అభినందన్ వర్ధమాన్.. యుద్ధ విమానాన్ని కూల్చలేదు.. పాకిస్థాన్
పుల్వామా దాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి విదితమే. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం జరిగిన వైమానిక దాడిలో భారత వైమానికి దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. తమ యుద్ధ విమానాన్ని ఎఫ్ 16 కూల్చివేశాడని పేర్కొనడంపై పాకిస్థాన్ స్పందించింది.
2019లో జరిగిన వైమానిక దాడిలో తమ యుద్ధ విమానాన్ని కూల్చివేశారన్న భారత్ వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. దుందుడుకు చర్యలకు పాల్పడాలని చూసిన భారత పైలట్‌ను ఆరోజు విడుదల చేయడం.. శాంతికాముక దేశంగా పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం' అని ఆ దేశ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి ఘటన సందర్భంగా అభినందన్ నడుపుతున్న మిగ్- 21 యుద్ధవిమానం.. పాకిస్థాన్‌లో కూలింది. అనంతరం వర్ధమాన్‌ను నిర్బంధంలోకి తీసుకున్న పాక్ మార్చి 1న ఆయన్ను భారత్‌కు అప్పగించింది.
ఆ సమయంలో చూపించిన ధైర్యసాహాసాలకు గాను సోమవారం వర్థమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 'వీర్ చక్ర'ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం దీనిపై పాక్ స్పందించింది. వర్ధమాన్ తమ విమానాన్ని కూల్చివేయలేదని పేర్కొంది.