శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (17:44 IST)

భారత్ మేరా దోస్త్.. స్నేహాస్తం సాచిన నవాజ్ షరీఫ్!

భారత్ తమ దాయాది నేస్తమంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ స్నేహాస్తం సాచారు. తాము ఒక్క భారత్‌తోనే కాకుండా సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటితో మంచి సంబంధాలు కోరుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు.
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూఢిల్లీ పర్యటన తర్వాత శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడటాన్ని ఆ రెండు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.
 
ఈ నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్ వెళ్లి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ముఖ్యమైన పొరుగు దేశమంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
 
ఇందులో ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థితిని షరీఫ్‌కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల మధ్య జమ్మూకాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించినట్టు సమాచారం.