శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:40 IST)

ఆ బీచ్‌లో ఫోటోలు దిగారంటే జైలుకు పంపుతారట..

సాధారణంగా బీచ్‌లంటే ఇష్టపడని వారు ఉండరు. కాస్త సరదాగా సమయాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తారు. బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటూ, సముద్రంలో కొట్టే కేరింతలను ఫోటోల్లో బంధిస్తుంటారు. కానీ థాయ్‌లాండ్ బీచ్‌లో మాత్రం ఇలా చేయడం కుదరదు. కెమెరా క్లిక్‌మనిపించిన మరుక్షణం ఎయిర్ నేవిగేషన్ అధికారులు వచ్చి పట్టుకుపోతారు. జైలుకి పంపిస్తారు, అలాగే కొన్ని కేసుల్లో అయితే శిక్ష కూడా వేస్తారు.
 
అక్కడి ఎయిర్ నేవిగేషన్ చట్టం ఇంత కఠినంగా ఉండడానికి కారణం లేకపోలేదు...అందేంటంటే అక్కడ ఉన్న మాయ్ ఖావ్ బీచ్ టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పక్కనే ఈ బీచ్ ఉండడంతో పర్యాటకులు తమ చేతులకు అందే అంత ఎత్తులో వెళుతున్న విమానాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. 
 
రన్‌వేపై ల్యాండింగ్ అయ్యే విమానాలు అత్యంత దగ్గరగా వెళ్తుంటాయి. బీచ్ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు విమానాలు దగ్గరగా వచ్చినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. పర్యాటకులు ఇలా చేయడం వల్ల కాక్‌పిట్‌లోని పైలట్‌లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. పర్యాటకులు తీసుకుంటున్న ఫోటోలు పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని థాయ్ అధికారులు చెబుతున్నారు.
 
ఫలితంగా విమానంలోని ప్రయాణికులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ఎయిర్ నేవిగేషన్ అధికారులు పర్యాటకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై అక్కడ ఫోటోలు తీసుకుంటే మాత్రం థాయ్ పోలీసులు జైల్లో పెడతారు.
 
ఎయిర్‌పోర్టు చుట్టూ 9 కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్ జోన్‌గా ప్రకటించారు. ఎవరైనా ఈ జోన్ పరిథిలో డ్రోన్స్ ఎగురవేసినా, లేజర్ లైట్లు వేసినా, ఫోటోలు తీసుకున్నా సరే జైలుకు పంపుతారు. కొన్ని కేసుల్లో అయితే ఉరిశిక్ష కూడా అమలు పరిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.