1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (06:09 IST)

ట్రంప్‌కు తొలి చురక పోప్ నుంచే వచ్చిందా? ట్రంప్ క్రిస్టియనే కాదు పొమ్మన్నారా?

అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసే తొలి చురక సాక్షాత్తూ పోప్ నుంచే వచ్చిందా? నైతిక విలువలకు పట్టం కట్టమని, పేదల పట్ల కరుణ చూపించాలని సుతిమెత్త

అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసే తొలి చురక సాక్షాత్తూ పోప్ నుంచే వచ్చిందా? నైతిక విలువలకు పట్టం కట్టమని, పేదల పట్ల కరుణ చూపించాలని సుతిమెత్తగా పోప్ చేసిన హితవు అమెరికా దేశాధ్యక్షుడికి వాడి చురకలాగే తగిలిందని పరిశీలకులంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా కార్యాలయంలో ఉన్న కాలంలో నిరుపేదలు, అనాధల సంరక్షణ బాధ్యతను ట్రంప్ తీసుకోవలసిందేనని పోప్ రాసిన ఉత్తరం అమెరికా అధ్యక్షుడికి దిశానిర్దేశం చేస్తున్న ఆదేశంలాగే ఉందని వీరు చెబుతున్నారు.
 
మానవ కుటుంబం తీవ్రమైన మానవీయ సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ప్రపంచంమంతా సమైక్యంగా రాజకీయంగా స్పందించాల్సి ఉందని పోప్ ట్రంప్‌కు శుక్రవారం రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు. అమెరకన్ ప్రజల చరిత్రను తీర్చిదిద్దిన సుసంపన్న ఆధ్యాత్మిక, నైతిక విలువల ద్వారానే మీ నిర్ణయాలు నడవాలని, మానవ గౌరవం, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్చాస్వాతంత్ర్యాల పురోగతికి అవి బాట వేయాలని పోప్ ఫ్రాన్సిస్ అమెరికా నూతన అధ్యక్షుడికి హితవు పలికారు.
 
పేదల పట్ల, అధోజగత్ సహోదరుల పట్ల, నిజంగా అవసరమైన వారిపట్ల మీరు చూపించే కరుణ, సహాయంపైనే మీ నేతృత్వంలోని అమెరికా ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని పోప్ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.వాటికన్ చరిత్రలో లాటిన్ అమెరికా నుంచి ఎంపికైన తొలి పోప్‌గా చరిత్రకెక్కిన పోప్ ఫ్రాన్సిస్ తన నాలుగేళ్ల పోప్ బాధ్యతల్లో పేదలు, సమాజంలోని బలహీన వర్గాల వారిపట్ల అమిత కరుణ ప్రదర్శించారు. 
 
కానీ పోప్ భారత్‌లో ఆప్ అధినేత కేజ్రీవాల్‌లా అంతంలేని ఆదర్శవాద ప్రపంచంలో కాలం గడుపుతుంటారని, అదే ట్రంప్ అయితే అనేక సంవత్సరాలుగా పన్నులు కట్టలేదని, అలాంటి ట్రంప్ పేదల పట్ల దయ, కరుణలతో ఎలా వ్యవహరించగలరని  నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
గత సంవత్సరం కూడా ఒక సందర్భంలో ట్రంప్‍‌ని అసలు నువ్వు క్రి్స్టియనే కాదనేశారు పోప్ ఫ్రాన్సిస్. వలసలపై, మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మించడంపై ట్రంప్ అభిప్రాయాలను పోప్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి  అభిప్రాయాలు కలిగి ఉన్న మనిషి అసలు క్రైస్తవుడే కాదన్నారు పోప్.