మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (10:44 IST)

ఆ హంతకుడి పుర్రెను 176 యేళ్లుగా భద్రపరుస్తున్నారు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల శరీరాలు చెడిపోకుండా భద్రపరిచి వారిని స్మరించుకుంటుంటారు. గతంలో రష్యా విప్లవకారుడు, రాజకీయవేత్త వ్లాదిమిర్‌ లెనిన్‌, పోప్ జాన్ పాల్ 2 పార్థివ దేహాన్ని కూడా భద్రపరిచారు. ఇపుడు పోర్చుగల్‌‌లో ఒక హంతకుడి తలను గత 176 ఏళ్లుగా భద్రపరచడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
 
ఆ హంతకుడి పేరు డియోగొ అల్వెస్‌. ఇతనో సీరియల్‌ కిల్లర్‌. ఇతని తలను జాగ్రత్తగా భద్ర పరచడం ఇపుడు విచిత్రంగా మారింది. ఈ చిత్రమైన కథనం వివరాలను పరిశీలిస్తే... 1810లో గాలిసియాలో డియోగో అల్వేస్ జన్మించి చిన్నతనంలోనే పోర్చుగల్‌‌కి వలస వెళ్లాడు. అక్కడ పెరుగుతూ దొంగగా మారాడు. పోర్చుగల్‌లోని పెద్ద కాలువ వద్ద నిలబడి.. కాలువ దాటుతున్న రైతులను దోచుకునేవాడు. ఇలా మూడేళ్లలో 70 మందిని హతమార్చాడు. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ కాలువను ప్రభుత్వం మూసేసింది.
 
ఆ తర్వాత అతనిని అతి కష్టం మీద అరెస్టు చేసి, 1841లో ఉరితీశారు. లిస్బన్‌‌లోని మెడికల్‌ కాలేజీ బోధకులు, శాస్త్రవేత్తలు కలిసి మనిషి పుర్రెకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉరితీయబడ్డ అల్వెస్‌ తలను తమకు అప్పగిస్తే అతను నేర వృత్తిలోకి ఎందుకు దిగాడో.. ఎందుకు అలా హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 
 
దీంతో ప్రభుత్వం అతని తలను వారికి అప్పగించింది. దానిపై ఎన్ని పరిశోధనలు చేసినా, వారు ఆశించిన ప్రయోజనం మాత్రం సాధ్యం కాలేదు. దీంతో పోర్చుగల్‌లో ఉరిశిక్ష పడిన చివరి ఖైదీ, అతి కిరాతకుడు కావడంతో అతని తలను అలాగే భద్రపరిచారు. ప్రస్తుతం ఆ తల ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ ఆఫ్‌ లిస్బన్‌’‌లో భద్రంగా ఉంది.