ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (09:31 IST)

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర - ఖెర్సన్ నగరం ఆక్రమణ

ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా సైనిక బలగాలు క్రమంగా పట్టుసాధిస్తున్నాయి. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌ దేశంలోని కీలక నగరాల్లో ఒకటి ఖెర్సన్‌ సిటీని తమ వశం చేసుకున్నాయి. ఖెర్సన్‌ను ఆక్రమించుకున్నట్టు రష్యా అధికారింగా ప్రకటించింది. నల్లసముద్రం ఒడ్డున ఖెర్సన్ ఉక్రెయిన్ దేశానికి ప్రధాన ఓడరేవు పట్టణం. ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది ప్రజలు నివాసిస్తున్నారు. ఉక్రెయిన్‌కు దక్షిణ వైపున ఈ నగరం ఉంది. 
 
మరోవైపు, గత ఎనిమిది రోజులుగా ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తున్న రష్యా... ఇప్పటికే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని, అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇక మర్యుపోల్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టు ముట్టి, రాజధాని కీవ్ నగరానికి అతి చేరువలో వచ్చాయి. 
 
ఇదిలావుంటే ఉక్రెయిన్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు రష్యా బలగాలు గత ఎనిమిది రోజులుగా భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కీవ్, ఖార్కివ్ నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలు దాడులు చేస్తూ, మారణహోం సృష్టిస్తున్నాయి.