శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (11:56 IST)

ఉక్రెయిన్‌పై అణుదాడికి సిద్ధమవుతున్న రష్యా?

తమ బలగాలకు ధీటుగా సమాధానమిస్తున్న చిన్నదేశం ఉక్రెయిన్‌ను కట్టడి చేసేందుకు అణుదాడి చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగానే ఆయన తమ దేశ అణ్వాయుధ వ్యవస్థను అప్రమత్తం చేశారంటూ అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌‍పై ఆయన ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చని భావిస్తున్నారు. 
 
ఉక్రెయిన్‌పై దాడులు జరిపి ఆ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకుని గుప్పెట్లో పెట్టుకోవాలని భావించిన రష్యా.. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించింది. అయితే, పుతిన్ అనుకున్నది ఒకటి అయితే, అక్కడ జరుగుతున్నది మరొకటి. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. దీనికితోడు ఉక్రెయిన్‌కు అనేక దేశాల మద్దతు లభిస్తుంది. 
 
అదేసమయంలో రష్యాను ఏకాకిని చేసేందుకు అనేక ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా, రష్యా విమానాలు తమ గగనతలంలో ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నారు. అమెరికాతో పాటు పలు దేశాలు ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. దీంతో రష్యా అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొనేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలతో దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 
 
ఇటీవల తమ దేశ అణు వ్యవస్థలను అప్రమత్తం చేశారు. దీంతో ఈ మేరకు రష్యా సైన్యం ఏర్పాట్లు చేస్తుంది. అవసరమైతే ఏ క్షణంలోనేనా అణుదాడి చేయడానికి సిద్ధంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే విన్యాసాల కోసం అణు జలాంతర్గామునలు బేరెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించడం గమనార్హం. సైబీరియా మంచు అడవుల్లో సమాచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. సముద్ర జలాల్లో విన్యాసాలు చేస్తామని, పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్ ఫ్లీట్ తెలిపింది.