వైద్య శాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హామినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగాను పాబోకు ఈ బహుమతి దక్కింది.
స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని నోబెల్ బృందం దీన్ని ప్రకటించింది. గత యేడాది మాత్రం ఉష్ణగ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు.
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగుతుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం, రసాయన శాస్త్రం, గురువారం రోజున సాహిత్య విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 10న అర్థ శాస్త్రంలో నోబెల్ పురస్కారం గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.