కాబూల్ నగరంలోకి అడుగుపెట్టిన తాలిబన్ తీవ్రవాదులు
పాక్ సైన్యం సహాయ సహకారాలు పెట్రోగిపోతున్న తాలిబన్ తీవ్రవాదులు ఇపుడు ఆప్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లోకి వారు ఆదివారం ప్రవేశించారు. శనివారం కాబూల్ నగర శివారుల్లో తిష్టవేసిన ఉగ్రవాదులు.. ఒక్కరోజులోనే నగరం లోపలికి చొచ్చుకొచ్చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి తాలిబన్ ఉగ్రవాదులు చొరబడిపోతున్నారని వెల్లడించారు.
నగరంలోని చాలా ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోందని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనం తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేసింది. అంతర్జాతీయ మిత్రులతో కలిసి తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం నిరోధిస్తోందని, ప్రస్తుతం కాబూల్ సైన్యం నియంత్రణలోనే ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనని చెబుతున్నారు.
కాగా, ఇటు అమెరికా తన రాయబారులను అక్కడి నుంచి హెలికాప్టరులో తరలించింది. వజీర్ అక్బర్ ఖాన్ జిల్లాలోని ఎంబసీ అధికారులను విమానాశ్రయానికి తీసుకెళ్లామని అమెరికా అధికారులు తెలిపారు. యూరోపియన్ యూనియన్ సిబ్బందిని కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించామని నాటో అధికారి చెప్పారు.
వీలైనంత త్వరగా అమెరికన్లను కాపాడి తీసుకొచ్చేందుకు 5 వేల మంది బలగాలను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలిచ్చారు. 82వ ఎయిర్ బార్న్‌కు చెందిన వెయ్యి మంది బలగాలను అదనంగా పంపిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ అధికారి చెప్పారు. తమకూ ఎవరినీ చంపాలని లేదని, అయితే, తాము మాత్రం కాల్పులను విరమించబోమని తాలిబన్ ప్రతినిధి చెప్పాడు.