ఫాస్ట్‌ఫుడ్స్ మాత్రమే ఆహారం.. కంటిచూపు, వినికిడి శక్తి మటాష్
ఫాస్ట్‌ఫుడ్స్ మాత్రమే ఆ పిల్లాడు ఇష్టపడి తింటుంటేవాడు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకునేవాడు కాదు. దీంతో ఆ పిల్లాడు.. కంటిచూపును, వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోయాడు. ఈ ఘటన టెన్నిసీ రాష్ట్రంలోని బ్రిస్టల్ కౌంటీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, బ్రిస్టల్‌కు చెందిన ఓ పిల్లాడు(14) తొలుత అలసిపోయినట్లు అనిపిస్తోందని స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు తొలుత షాకయ్యారు.
ఎందుకంటే అతని శరీరంలో ఎర్రరక్త కణాలు సాధారణం కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇతర విటమిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గిపోయింది. దీంతో సదరు టీనేజర్‌కు మాక్రోటిక్ అనీమియా అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
పండ్లను, కూరగాయలను పక్కనబెట్టి.. ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్డు, చిప్స్, శుద్ధి చేసిన మాంసం, వేపుళ్లు మాత్రమే తినేవాడని వైద్యులు తెలిపారు. దీని ప్రభావంతో కంటి చూపు, వినికిడి శక్తిని కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.