శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 మే 2015 (18:45 IST)

ఒసామా ఆపరేషన్‌: లాడెన్‌ను అమెరికా సైన్యం కనిపెట్టలేదా?

అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. సీల్స్ ఆపరేషన్‌లో అమెరికా హతమార్చిన ఉగ్రవాదిని చివరికి అమెరికా సైన్యం కనిపెట్టలేదట. పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు అమెరికాకు 160 కోట్ల రూపాయలకు అమ్మేశారని ఓ పాత్రికేయుడు షాక్ న్యూస్‌ను బయటపెట్టేశాడు.
 
ఇలాంటి సంచలన విషయాలను హెర్ష్ అనే పాత్రికేయుడు లాడెన్ హత్య వెనుక చీకటి కోణాన్ని బయటపెట్టాడు. హెర్ష్ గతంలో వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా చేసిన అతిచేష్టలను కూడా బయటపెట్టాడు. 2010లో పాకిస్థాన్ నిఘా విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి సీఐఏ స్టేషన్ చీఫ్ జోనాథన్ బ్యాంకు కలిసి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనకు భారీ మొత్తాన్ని ముట్టజెపితే లాడెన్ ఆచూకీ చెబుతానని ఆయనకు ఆఫర్ ఇచ్చాడని హెర్ష్ తన కథనంలో వెల్లడించారు. 
 
ఆ సీనియర్ అధికారి మాటలను నమ్మని సీఐఏ వర్గాలు, ఆయనకు పాలిగ్రఫీ టెస్టు చేశారు. దీంతో ఆయన చెబుతోంది నిజమని నమ్మారు. దీంతో అతను కోరిన మొత్తాన్ని చెల్లించి, అబొటాబాద్‌లో లాడెన్ ఇంటికి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, లాడెన్ భవనాన్ని శాటిలైట్ నిఘాలో ఉంచారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని నిఘావిభాగం సీనియర్ అధికారులతో అమెరికా అధికారులు పలుమార్లు చర్చించారు. 
 
చివరకు 2011లో అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ అష్ఫఖ్ కయానీ, ఐఎస్ఐ అధినేత షుజా పాషా ఇద్దరూ అమెరికన్ నేవీ గ్రూప్ సీల్స్‌కు పూర్తి సహాయసహకారాలు అందించారని, సీల్స్ రంగంలోకి దిగి చకచకాపని పూర్తి చేసిందని హెర్ష్ పేర్కొన్నారు. ఈ విషయాలను అమెరికన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన అధికారి తనకు తెలిపారని హెర్ష్ చెప్పారు. కాగా, ఎప్పట్లానే అమెరికా ఈ కథనాన్ని ఖండించింది.