మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (15:12 IST)

ఐక్యరాజ్యసమితిలో మసూద్‌పై ఈసారి అమెరికా వంతు?

భారత్ పదేపదే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాల్సిందిగా సూచిస్తున్న పాక్‌ ఉగ్రనేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు ఈసారి అమెరికా చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు భారత్ ఐక్యరాజ్య సమితిలో మూడుసార్లు ఈ ప్రతిపాదనను ఉంచగా ప్రతిసారీ చైనా కారణంగానే ఈ ప్రతిపాదన వీగిపోయింది. 
 
తాజాగా ఈ ప్రతిపాదనను అమెరికా చేపట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది.
 
దీనిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొన్నారు. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషేనేతకు సంబంధాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలుపడం వంటివి చేశారని పేర్కొన్నది. 
 
భారత్ రెండు వారాల క్రితం తీసుకొచ్చిన ఒక తీర్మానాన్ని చైనా నిలిపి ఉంచి చివరలో వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అమెరికా మరో తీర్మానంతో ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో చైనా దీనిని మరోసారి అడ్డుకొంటుందేమో చూడాలి.