శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:30 IST)

అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్... ఇద్దరు పోలీసులతో పాటు మరో వ్యక్తి కాల్చివేత

gunshot
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతుంది. తాజాగా ఓ దుండగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా మరో వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఓ ఇంట్లో పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిసిన పోలీసులపై ఇంట్లోని దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. చర్చలు జరుపుతుండగానే ఈ దారుణం జరిగిపోయింది. ఈ దుండగుడి గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తిని కూడా కాల్చి చంపేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని ఓ ఇంటిలో అనేక మంది పిల్లలు బందీలుగా ఉన్నారని, ఆ నివాసంలో ఆయుధాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పందించారు. అక్కడకు చేరుకొని ఇంట్లో ఉన్న నిందిత వ్యక్తితో బయట నుంచి చర్చలు జరుపుతుండగానే లోపల నుంచి కాల్పులకు తెగబడ్డాడు. 
 
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, వారికి సమాచారం ఇచ్చి సహాయంగా నిలిచిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడు చనిపోయాడని, అతడి వివరాలను ఇంకా గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఇంట్లోని ఏడుగురు పిల్లలు సురక్షితంగా ఉన్నారని, వారి వయసు 2 -15 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. అయితే షూటర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
 
ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్స్ బర్న్స్ స్పందించారు. ఇది హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఒక కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి పోలీసులు స్పందించారని, కాల్పుల్లో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. 27 ఏళ్లు, 40 సంవత్సరాల వయస్సున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇద్దరు పారామెడిక్స్ చనిపోయారని వివరించారు.