రష్యా నుంచి చమురు కొనుగోలు : అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా
అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న తమతో పాటు అన్ని దేశాలపై నాటో దేశాలు అధికర సుంకాలను విధించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఏకపక్షంగా వేధించడం, ఆర్థిక బలప్రదర్శనకు పాల్పడడమేనని ఆరోపించింది. అమెరికా చెప్పినట్లు నాటో దేశాలు చేస్తే తాము ప్రతిచర్యలు చేపడతామని డ్రాగన్ కంట్రీ ఘాటుగా హెచ్చరించింది.
ఒక పక్క స్పెయిన్ నగరంలోని సోమవారం నుంచి ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొదలైన వేళ చైనా నుంచి ఇలాంటి స్పందన రావడం గమనార్హం. రోజువారీ సాధారణ ప్రెస్ బ్రీఫింగ్స్‌లో భాగంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జిన్ మాట్లాడుతూ, ప్రపంచంలోని ఇతర దేశాల వలె రష్యాతో కూడా తమకు సాధారణ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నట్లు తెలిపారు.
అమెరికా చర్యలు ఏకపక్ష వేధింపులని, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయని అన్నారు. ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక పంపిణీ వ్యవస్థలపై ' కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. భయపెట్టడం, ఒత్తిడి చేయడం వంటి చర్యలతో సమస్యలను పరిష్కరించలేమని ఇదివరకే నిరూపితమైందని ఆయన అన్నారు.