శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (12:16 IST)

కొత్త వైరస్‌తో మొదటి వ్యక్తి మృతి : పశ్చిమాఫ్రికాలో కలకలం...

పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో కొత్తగా వెలుగు చూసిన మార్‌బర్గ్ వైరస్ ఇపుడు పెను ప్రమాదంగా మారింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తొలి రోజే ప్రాణాలు కోల్పోయాడు. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని వైద్యులతో పాటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలోని గేక్కేడౌలో మార్‌బర్గ్ అనే వైరస్ బారినపడి ఈ నెల 2న ఓ వ్యక్తి మరణించాడు. 
 
అతడు అంతకుముందు రోజు ఆ వైరస్ బారినపడ్డాడు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, సోకిన తర్వాత ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీనివల్ల రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. దీనిబారినపడితే 24-88 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది.
 
ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ, చికిత్సా విధానం కానీ లేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ కూడా ఎబోలా జాతికి చెందినదేనని పేర్కొంది. కాగా, ప్రస్తుతం మార్‌బర్గ్ వైరస్ బయటపడిన చోటనే గతంలో ఎబోలా కూడా బయటపడింది. ఈ వైరస్‌కు కూడా కొవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయి. 
 
రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి, రోగి స్రావాలను, అతడు తాకిన ఉపరితలాలను, వస్తువులను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. కరోనాతో 1 నుంచి 5 శాతం లోపు మరణాలు సంభవిస్తే దీని వల్ల అంతకుమించి మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.