ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
ఈ ఏడాది ప్రారంభం నుంచే పలు స్మార్ట్ఫోన్లకు సేవలు నిలిపేసింది వాట్సాప్. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 1 నుంచి మరికొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లకు సేవలు నిలిపేయనుంది.
సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో సారి పాత మోడల్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు సేవలు నిలిపివేయనుంది. ఫేస్బుక్కు చెందిన ఈ సంస్థ ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వచ్ఛన్) విభాగం ద్వారా సంబంధిత విషయం తెలిసింది. ఈ సమాచారం ప్రకారం.. 2.3.7 ఓఎస్, అంతకన్నా తక్కువ వెర్షన్లతో పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫిబ్రవరి 1 నుంచి సేవలు నిలిచిపోనున్నాయి.
యాపిల్ ఫోన్ల విషయానికొస్తే.. ఐఓఎస్ 8 అంతకన్నా తక్కువ వెర్షన్తో పని చేసే మోడళ్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఈ మోడళ్లలో.. కొత్తగా ఖాతాలు తెరవడం.. పాత ఖాతాలను రీ వెరిఫై చేయడమూ కుదరదని పేర్కొంది వాట్సాప్. వీటిలో వాట్సాప్ పనిచేయకపోయినప్పటికీ.. ఎంపిక చేసిన మోడళ్లయిన.. కేఏఐఓఓఎస్ 2.5.1+ ఓఎస్, జియో ఫోన్, జియో ఫోన్ 2లకు వాట్సాప్ ఎప్పటిలానే పని చేయనుంది.
మీరు ఇప్పటికీ.. పాత మోడల్ ఫోన్లు వాడుతున్నట్లయితే.. మీ డేటా మొత్తం కోల్పోకుండా ఓ సదుపాయం ఉంది. వాట్సాప్లో.. ఎక్స్పోర్ట్ చాట్పై క్లిక్ చేస్తే అందులో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలతో సహా డౌన్లోడ్ చేసుకోవాలా? కేవలం చాట్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలా అనేది మీరే ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే 2019 డిసెంబర్ 31 నుంచి విండోస్ ఫోన్లకు పూర్తిగా సేవలు నిలిపేసింది వాట్సాప్.