చైనాలో ముస్లింలకు చిత్రహింసలు... పాక్‌ను నిలదీసిన అమెరికా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ముస్లింల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఓ సూటి ప్రశ్న సంధించింది. భారత్ సంగతి సరే.. చైనాలో ముస్లింలు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ వారి సంగతి ఏంటంటూ నిలదీశారు.
ఇదే అంశంపై అమెరికా దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల శాఖ తాత్కాలిక సహాయ మంత్రి అలిస్ వేల్స్ మీడియాతో మాట్లాడుతూ చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉయ్‌గుర్ ముస్లింలను నిర్బంధంలో ఉంచినా ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
'కాశ్మీర్‌లో మాదిరిగానే పశ్చిమ చైనాలో నిర్బంధంలో మగ్గుతున్న ముస్లింల మానవహక్కులపట్ల నేను ఆందోళన చెందుతున్నా. చైనా అంతటా ముస్లింలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులను మీరు వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నా' అని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి ఆమె అన్నారు.
మరోవైపు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలిగించిన తర్వాత కాశ్మీర్ లోయలో విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు భారత ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక రూపొందించారన్నారు. కాశ్మీరీలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే చర్యలను అమెరికా స్వాగతిస్తుందన్నారు.