1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (11:31 IST)

సముద్రగర్భంలో కలిసిపోనున్న గ్రామం... ఎక్కడ?

మంచుకొండలు కరిగిపోతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరిగితోంది. సముద్ర తీరాన ఉన్న గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే అమెరికాలోని ఓ గ్రామం మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందనే విషయం స్పష్టం అవుతోంది. అమెరికా అలాస్కా రాష్ట్రంలోని కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలసిపోనుంది.
 
ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల దూరంలో ఉన్న కివలిన గ్రామం ఇప్పుడు కేవలం ఎనిమిది నుంచి పదడుగుల దూరానికి చేరింది. అంటే సముద్ర మట్టం పెరుగుతోందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఎనిమిది పదడుగులు కూడా 2025 నాటికి కరిగిపోతోందని తెలుస్తోంది. ఖచ్చితంగా ఆ గ్రామం సముద్ర గర్భంలో పూర్తిగా కలసిపోతోందని ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించిన అమెరికా ఆర్మీ పటాలం ఇంజనీర్లు తేల్చి చెప్పారు. ఆర్కటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. అందులో ప్రస్తుతం 403 మంది నివసిస్తున్నారు.
 
ఒకప్పుడు పండ్లతోటలు, తిమింగళా వేటపై బతికిన అక్కడి ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. స్తోమత కలిగిన వాళ్లు అలాస్కా నగరంవైపు వలసపోగా, నిర్భాగ్యులు అక్కడే ఉండిపోయారు. ఎక్కడకు పోవాలో, ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతున్నారని ది లాస్ ఏంజెలిస్ టైమ్స్ వెల్లడించింది. ఆ ద్వీప గ్రామాన్ని 1847లో రష్యా నేవీ కనుగొన్నది. 1960లో అక్కడ ఎయిర్ స్ట్రీమ్ను అమెరికా ప్రభుత్వం నిర్మించింది. 
 
అప్పుడు పొడవాటి బీచ్లతో, ప్రకృతి రమనీయతతో అలరారుతుండేది. అర్కెటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో చెలరేగిన తుఫానుల కారణంగా బీచ్లన్నీ మాయం అవుతూ వచ్చాయి. సముద్రం ఆటుపోట్లను అరికట్టేందుకు సముద్రం ఒడ్డున 2011లో నిర్మించిన అడ్డుగోడలు కూడా ఇటీవలి తుఫానులకు కొట్టుకుపోయాయి.