శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (20:19 IST)

పెండ్లి చేసుకుంటే నిర్మాతలు రారు...: ఆది ఇంటర్వ్యూ

సాయికుమార్‌ వారసునిగా తెరంగేట్రంచేసిన ఆది 'ప్రేమకావాలి' చిత్రంతో తనేంటో నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల్లోకూడా ఈజీగా చేసేశాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా పెద్దగా పేరురాలేదు. కానీరెండేళ్ళనాడు తాను చేసిన 'రఫ్‌' సినిమా ఇప్పుడు ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ నెల 28న విడుదలవుతుంది. సినిమాతోపాటు మా పెండ్లి కూడా జరగడం రెండూ ఎచీవ్‌మెంట్లుగా ఫీలవుతున్నట్లు ఆది చెబుతున్న కబుర్లు...
 
పెండ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? 
డిసెంబర్‌ 13న. హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా జరుగబోతుంది. నేను ఈ నెల 28 తర్వాత నుంచి నా స్నేహితులకు కార్డ్స్‌ ఇవ్వడం మొదలుపెడతాను. డిసెంబర్‌ మొదటివారంలో నాన్నగారు బంధువులకు స్నేహితులకు ఇవ్వనున్నారు.
 
లవ్‌ మ్యారేజా? 
కాదు. పెద్దల కుదిర్చిన సంబంధమే. నా సోదరి మామయ్యగారికి బెస్ట్‌ఫ్రెండ్‌ కూతురు ఆమె. పేరు అరుణ. ఇంజనీరింగ్‌ చదివింది. హైదరాబాద్‌లోనే ఒరాకిల్‌ సంస్థలో కొన్నాళ్ళు జాబ్‌ కూడా చేసింది.
 
ఆమెను మొదటిసారి ఎక్కడ చూశారు? 
నా చెల్లెలు మేరేజ్‌లో చూశాను. సినిమాల్లో చూసినట్లుగా తొలిచూపులోనే మంచి ఇంప్రెస్‌ అయ్యాను. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను.
 
ఇండస్ట్రీ గురించి ఏవైనా తెలుసా? 
ఇండస్ట్రీ మనిషి కాకపోయినా... ఇక్కడి విషయాలు అన్నీ తెలుసు. ముఖ్యంగా ఆర్టిస్టుగా ఎత్తుపల్లాలు, గాసిప్స్‌ అన్నీ వివరించాను. 
 
మీకు ఆమె ఎప్పుడు పరిచయమైంది? 
రెండేళ్ళనాడే. అప్పటినుంచి తరచూ ఫోన్లలోనూ బయట కొద్దిసార్లు కలుసుకున్నాం.
 
మీ 'రఫ్‌' సినిమా కూడా రెండేళ్ళయింది కదా? 
అవును. రఫ్‌ సినిమా మొదలయి రెండేళ్ళయింది. అందుకే ఈ చిత్రం నాకు తీపిగుర్తుగా వుంటుంది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం కావడం, నా పెండ్లికి ముందే విడుదల కావడం అంతా థ్రిల్‌గా అనిపిస్తుంది. ప్లాన్‌ చేయకపోయినా.. అన్నీ ప్లాన్‌ చేసినట్లుగా జరగడం ఆశ్చర్యంగానూ వుంది.
 
రఫ్‌ చిత్రంలోని పాయింట్‌ ఏమిటి? 
నిజంగా.. పెండ్లికి దగ్గరగా వుండే పాయింట్‌. ''ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోకపోవడం తప్పుకాదు. ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం తప్పు'' ఇది చిత్రంలోని కాన్సెప్ట్‌. సినిమాలో చెప్పినట్లుగానే నేను నాకు నచ్చిన అమ్మాయిని బయట కూడా పెండ్లి చేసుకోవడం చాలా సింక్‌ అయినట్లుగా అనిపిస్తుంది.
 
ఇకపై మీ సినిమాకు నిర్మాత దొరికినట్లు అనుకోవచ్చా? 
(నవ్వుతూ..) అదేంలేదు. పెండ్లి చేసుకున్నా.. మామగారు నిర్మాతలగా మారడం అనేది జరగదు. చాలా అరుదు. అయినా నా గురించి వారికి అంతా తెలుసు.
 
ఇకపై కథలు ఎలా ప్లాన్‌ చేస్తారు? 
ఇప్పటివరకు నాన్నగారు వినేవారు. ఇకపై కూడా వింటారు. పెండ్లయ్యాక సగ భాగం గనుక భార్యకూ చెబుతాను. సలహాలు తీసుకుంటాను.
 
హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఎలా చేసింది? 
ఆమెకు ఇది ఫస్ట్‌ సినిమా. కానీ ఇప్పుడు మూడో సినిమా అవుతుంది. ఎందుకంటే ఈపాటికే కరెంట్‌తోపాటు మరో సినిమా కూడా రిలీజ్‌ అయిపోయాయి. ఆమెతో ప్రమోషన్‌కు వెళుతుంటే నాకంటే ఆమెకు రెస్పాన్స్‌ బాగుంది.
 
సుహాసిని పాత్ర ఎలా వుంటుంది? 
సీనియర్‌ నటి సుహాసినితో కలిసి చేయడం చాలా ఆనందంగా వుంది. ఆమె నాకు అక్కగా నటించింది. 
 
శ్రీహరి పాత్ర ఎలా వుంటుంది? 
ఇంతవరకు ఆ పాత్రను బయటకు చెప్పలేదు. రిలీజ్‌ కనుక చెప్పాల్సి వస్తుంది. శ్రీహరి చివరి సినిమా ఇది. ఆయన డబ్బింగ్‌ కూడా పూర్తిచేశారు. ఇందులో ఆయన రిచ్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. చాలా గ్లామరస్‌గా కన్పించారు. నాన్నగారితో మంచి స్నేహం. అటువంటి వ్యక్తి అనారోగ్య కారణంగా చనిపోవడం చాలా బాధాకరం. ఈ సినిమా ఆయనకు సరైన నివాళిగా భావిస్తున్నాను.
 
కొత్త దర్శకుడు ఎలా చేశాడు? 
సుబ్బారెడ్డి దర్శకత్వం కొత్తయినా అప్పటికే ఏడుగురి దగ్గర పనిచేసిన అనుభవం వుంది. చాలా కొత్త టేకింగ్‌ వుంటుంది. ఓ ఫైట్‌ విషయంలో దాదాపు 8 నెలలు స్టడీ చేసి చేయగలిగాం.
 
అన్ని నెలలు పట్టడానికి కారణం? 
నేను బాడీని మార్చుకున్నాను. దాని కోసం కేవలం కాయకూరలు తినేవాడిని. అన్నం తినడం మానేశాను. ఆ ఫైట్‌ చిత్రంలో కీలకం. ఈ ఫైట్‌ను రామ్‌లక్ష్మణ్‌లు అద్భుతంగా తీశారు. ఇందులో నా బాడీలో కట్స్‌ కన్పిస్తాయి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ సినిమాను చేశాను.
 
కొత్త చిత్రాలు? 
ప్రస్తుతం 'గరమ్‌' అనే సినిమాను మాత్రమే చేస్తున్నాను. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ అయింది.అది కూడా ఇప్పుడు బ్రేక్‌ ఇచ్చాను. పెండ్లి పనులు అయ్యాక జనవరిలో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం' అని చెప్పారు.