శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (21:44 IST)

కరెక్ట్‌ కాదని నటించడం మానేశా... నటశేఖర కృష్ణ ఇంటర్వ్యూ

ఘట్టమనేని కృష్ణ.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల నుంచి హీరో. ఎన్‌టిఆర్‌, ఎ.ఎన్‌ఆర్‌ హవా నడుస్తున్న టైంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న నటుడు కృష్ణ. అసలు కృష్ణకు నటించడం రాదనీ, ఆయన చేష్టలు చిత్రంగా వుంటాయనే విమర్శలు వుండేవి. కానీ అలాంటి నాయకుడు అగ్రహీరోల సరసన నటించడమే కాకుండా.. కొద్దికాలం ఏడాదికి 10 సినిమాల్లో నటించి చరిత్రను సృష్టించాడు. ఆయన నటించిన తొలి సినిమా రేపటికి.. అంటే శనివారం ..31.3.2015న విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులు.
 
మీ సినీ ప్రయాణం? 
సినీ ప్రయాణం అంత ఈజీగా రాలేదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965 మార్చి 31న విడుదలయిన 'తేనె మనసులు' చిత్రంతో స్టార్‌ అయింది. 3 నెలల వ్యవధిలో 'కన్నె మనసులు' సినిమా విడుదలయ్యింది. దాంతో వరుసగా 20 సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పరిశ్రమలో చాలామంది కావాల్సిన వారున్నారు. చాలామందికి సినిమాలు చేశాను.. 'అల్లూరి సీతారామరాజు చేశాక  14 సినిమాలకు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. తర్వాత సొంత బ్యానర్‌ పద్మాలయాపై 'పాడి పంటలు' సినిమా తీసి హిట్‌ కొట్టాను. 9 సంవత్సరాలలో సుమారుగా 100 సినిమాలలో నటించాను.
 
సినిమాలు ఆకట్టుకోవడానికి ఏం చేశారు... 
ఒకసారి చేసిన సినిమా మరలా రిపీట్‌ అవ్వకుండా స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యామిలీ డ్రామాలో, పౌరాణిక పాత్రలో, పల్లెటూరు రైతు పాత్రలో, ఓ యాక్షన్‌ హీరోగా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. అలాంటి వారిని ఆకట్టుకోవడానికి కథను ఎంచుకునే ముందు ప్రేక్షకుల కోణంలోనే ఆలోచిస్తాను. వారికి నచ్చే విధంగా ఉండే సినిమాలలో మాత్రమే నటిస్తాను. కానీ కొన్నిసార్లు ఫ్లాప్‌ సినిమాలలో నటించక తప్పలేదు. పులి జూదం వంటి సినిమాలు నన్ను నిరాశకు గురి చేసిన సినిమాలు.
 
మర్చిపోలేని సంఘటన... 
'అల్లూరి సీతారామరాజు' నా జీవితంలో మరచిపోలేని సినిమా. ఈ సినిమాకు ఆ రోజుల్లో 18 లక్షల రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఆ తరువాత వచ్చిన 'సింహాసనం' అన్ని రికార్డ్స్‌‌ను బ్రేక్‌ చేసింది. తర్వాత 'అగ్నిపర్వతం'. 
 
సినిమాల్లో మీరు చేయాలనుకున్న పాత్ర.... 
'శివాజీ' పాత్రలో నటించాలని అనుకున్నాను కానీ ఆ కోరిక నెరవేరలేదు. నేను నటించిన డాక్టర్‌-సినీ యాక్టర్‌ సినిమాలో కొంచెం సమయం శివాజీ పాత్రలో కనిపిస్తాను. కానీ ఫుల్‌ ఫ్లెడ్జ్‌గా చేయలేకపోయాను.
 
అంతేనా....
మా అబ్బాయి మహేష్‌ బాబు 'జేమ్స్‌ బాండ్‌' పాత్రలో నటిస్తే చూడాలని వుంది. వాడు ఆ పాత్రకు బాగా సరిపోతాడని చాలామంది అనేవారు. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాడు.
 
హాలీవుడ్‌ స్పూర్తితో చిత్రాలు చేశారంటారు...
నేను నటించిన కౌబాయ్‌ చిత్రాలు కొన్ని హాలీవుడ్‌ చిత్రాల ఆధారంగా రూపొందినవి. కాని ఆంగ్ల వాతావరణం లేకుండా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. నేను నటించిన కౌబాయ్‌ చిత్రాలన్నీ ఇతర భాషలలోకి అనువదించేవారు. 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం ఇంగ్లీష్‌‌లో 70కి పైగా ప్రాంతాలలో విడుదలయింది.
 
చాలామంది ఫ్రెండ్స్‌ వున్నారు.. 
రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌ బాబు, కృష్ణంరాజు అందరూ నా స్నేహితులే. రామారావుగారితో మల్టీస్టారర్‌ సినిమాలలో నటించడం చాలా కంఫర్ట్‌‌గా అనిపించేది. నేను హీరోగా కృష్ణంరాజు విలన్‌‌గా 50 సినిమాలు చేసాం. 
 
అవార్డులు గురించి..
2009లో పద్మభూషణ్‌, 2003లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు, 1997లో ఫిలింఫేర్‌ లైఫ్‌ టైం అచ్చీవ్‌‌మెంట్‌ అవార్డు, డాక్టరేట్‌ అవార్డులు అందుకున్నాను.
 
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌‌గా సినిమాలు చేయవచ్చు కదా..
బోర్‌గా అనిపించి కొన్ని సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌‌గా నటించాను. కానీ అది కరెక్ట్‌ కాదని తెలుసుకొని నటించడం మానేసాను. పెద్ద సినిమాలు, మంచి పాత్ర అయితేనే నటించాలని భావిస్తున్నాను. ప్రస్తుతం మా బ్యానర్‌‌పై 'ప్రేమకథా చిత్రం' సినిమాను హిందీలో నిర్మించాలనుకుంటున్నాం. 
 
ఇండస్ట్రీలో నేటితరం నటుల్లో అభిమాన నటుడు..
మహేష్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. మహేష్‌ తరువాత ప్రభాస్‌ నచ్చుతాడు.