గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (19:20 IST)

చేపలు పట్టే జాలర్లే నా సిక్స్ ప్యాక్‌కు స్ఫూర్తి... 'కృష్ణాష్టమి' హీరో సునీల్ ఇంటర్వ్యూ

కృష్ణాష్టమి హీరోగా తనకు భారీ చిత్రం అవుతుందంటున్న హీరో సునీల్

కమేడియన్‌గా తనకంటూ ప్రత్యేక  శైలిని ఏర్పర్చుకున్న సునీల్‌... ఆ తర్వాత హీరోగా మారి సిక్స్‌ప్యాక్‌తో ముద్ర వేసుకున్నాడు. తాజాగా కృష్ణాష్టమిలోనూ మూడు సెకన్ల పాటు సిక్స్‌ప్యాకులో కన్పిస్తాడు. ఆయన నటించిన చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ..
 
నటుడిగా రెండేళ్ళ గ్యాప్‌ రావడానికి కారణం?
మాట కోసం ఆగాను. కొన్ని కమిట్‌మెంట్లు జరుగలేదు. జీవితంలో అనుకున్నవన్నీ జరుగవు. అందుకే గ్యాప్‌ వచ్చింది.
 
ఇబ్బంది అనిపించలేదా?
హైదరాబాద్‌కు 1995లో వచ్చాను. ఐదేళ్ళు ప్రతిరోజూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. డబ్బున్నప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. వచ్చేటప్పుడు 'పాస్‌' అంటూ కండక్టర్‌కు చెప్పేవాడ్ని. ఒకవేళ టికెట్‌ చెకింగ్‌ వుందనుకుంటే మధ్యలో దిగిపోయేవాడిని. అలా ఐదేళ్ళు ప్రయత్నించినా ఒక్క అవకాశం రాలేదు. వస్తూంది.. వస్తూంది.. అంటూ పాజిటివ్‌ లుక్‌తో వుంటే తప్పకుండా వస్తుంది. అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడిలా ఇలాంటి కుర్చీలో కూర్చొన్నాను. అందుకే గ్యాప్‌ వల్ల ఇబ్బంది అనిపించలేదు.
 
హీరోగా జర్నీ ఎలా వుంది?
పదిహేనేళ్లుగా హాస్యనటుడిగా చేశాను. హీరోగా 'అందాల రాముడు' చేశాను. పెద్ద హిట్‌ అయింది. కానీ ఐదేళ్ళు సినిమా చేయలేదు. దేవుడు పంపినట్లు రాజమౌళిగారి 'మర్యాద రామన్న'లో అవకాశం వచ్చింది కాబట్టి చేశా. ఆ వెంటనే రామ్‌గోపాల్‌ వర్మ సినిమా 'అప్పల్రాజు'లో చేశాను. అసలు వర్మతో 'ప్రేమకావాలి' అనే సినిమాలో చిన్న వేషం ట్రై చేశాను. కుదరలేదు. అప్పటి నుంచి ఆయన్న అడగలేదు. ఇక ఆ తర్వాత 'పూలరంగడు', 'మిస్టర్‌ పెళ్లికొడుకు', 'భీమవరం బుల్లోడు', 'తడాఖా' చిత్రాలు చేశాను. నాతో ఎవరైనా కథలు చెప్పొచ్చు. మధ్యలో మీడియేటర్‌ ఎవ్వరూ లేరు. అలా చాలామంది కథలు తీసుకువచ్చారు. కానీ అన్నీ మొనాటిగా వున్నాయని అనిపించి కొన్ని చేయట్లేదు. 
 
ఫెయిల్‌ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఫెయిల్‌ అయితే ఒత్తిడికి గురవుతాను. అదే సక్సెస్‌ వస్తే ఆనందం వస్తుంది. ఏదైనా సీన్‌ చేస్తే అది బాగా వచ్చిందా?లేదా? అంటూ.. ఇంట్లోవారికి చెబుతా. అప్పుడే నాకు నిజమైన తృప్తి. నేను ఖాళీగా వుండను. వుంటే ఏదో ఒకటి చేసేస్తాడు అంటూ రవితేజ నా మీద సెటైర్లు వేస్తుంటాడు. అందుకే మనస్సు వేరే విషయాలపై కంట్రోల్‌ తప్పకుండా.. జిమ్‌, డాన్స్‌ చేస్తూ గడిపేస్తుంటాను.
 
దిల్‌ రాజు బేనర్‌లో ఎలా వచ్చింది?
నేను ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకుని జిమ్‌, డాన్స్‌లు చేస్తుండగా.. ఓరోజు దిల్‌రాజు గారు ఫోన్‌ చేసి.. ఒక కథ వుంది. పెద్ద హీరో అనుకున్నాం. కానీ అది నీకు బాగా సూటవుతుందని నా కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్పారు. అప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావ్‌! అని అడిగితే.. మారు మాట్లాడకుండా.. తప్పకుండా చేస్తాను అన్నాను. ఆ టైంలో దిల్‌రాజు కుమార్తె వివాహం ఊటీలో జరిగింది. ఆయన తిరిగి వచ్చాక ఆయనే కథ చెప్పారు. దీనికి దర్శకుడు ఎవరు? అని అడిగాను. వాసూవర్మ అని చెప్పారు. ఇంకేం.. మంచి ఫ్రెండ్‌ కూడా అని నేను అన్నాను. వాసూవర్మ.. 'ఆర్య' సినిమా నుంచి పరిచయం. 'బొమ్మరిల్లు' షూటింగ్‌లో వున్నప్పుడు.. నాకోసం ఓ డైలాగ్‌ రాశారు. 'సత్తి! మంచి పనోడు' అంటూ ట్యాగ్‌లైగ్‌ పెట్టింది ఆయనే. ఎప్పటినుంచో యువ టాలెంట్‌తో చేయాలనుకుంటుండగా.. అది వాసూవర్మ లాంటివారితో జరిగింది. చాలా ఆనందంగా వుంది.
 
అయితే ఇంకో సందేహం కూడా వచ్చింది. వాసు నన్ను ఒప్పుకుంటాడా! అనిపించింది. అంతకుముందే ఆయన 'లవర్‌' అనే కథను రెడీ చేసుకుని దానికి దర్శకత్వం చేయాలని చూశాడు. కానీ.. దిల్‌ రాజు సినిమా కాబట్టి ఆయన అంగీకరించడంతో వాసువర్మ అంగీకరించాడు. నాకు తెలిసి నా సినిమాల్లో భారీ సినిమా కృష్ణాష్టమి. విజువల్‌ పరంగా, లుక్‌ పరంగా, 60 శాతం విదేశాల్లో చిత్రీకరణతో పెద్ద సినిమా అయింది. కథ కూడా హృదయాన్ని టచ్‌ చేస్తుంది. ఓవరాక్షన్‌ అస్సలు వుండదు. ప్రతి సీన్‌లో కామెడీ వుంటుంది. పంచ్‌ పేలుతుంది.
 
మొదట్లో మీరన్నట్లు కమిట్‌మెంట్‌ కోసం గ్యాప్‌ తీసుకున్నారు. కానీ ఆ గ్యాప్‌ ఫెయిల్‌కు దారితీస్తే?
కథ ప్రకారం కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే పేలుతుంది. కొన్ని పాత్రలు కొందరు చేయాల్సి రావడంతో డేట్స్‌ ప్రాబ్లమ్‌ వల్ల అనుకున్న సినిమా వెనక్కి వెళ్ళింది. ఏదైనా ఒక్క విషయం చెబుతాను. సహజంగా ఈరోజు అనుకుంది రేపటికి ఆ స్పీడ్‌ తగ్గుతుంది. అలాగే ప్రతిసారీ మొదటిసారిలా వుండాలన్నా కుదరదు. ఆలస్యమైనా సక్సెస్‌ అవుతుందా? ఫెయిల్‌ అవుతుందా? అనేది ప్రేక్షకులు చూడరు. సినిమా నచ్చిందా లేదా అంతే.
 
ఇంత గ్యాప్‌ వల్ల హీరోగా కెరీర్‌కు బ్రేక్‌ పడదా?
నాకు మొదటి నుంచి అలా జరగలేదు. దేవుడి దయే. ఒక్కసారి హీరోకు రెండేళ్ళపాటు గ్యాప్‌ వస్తే అవకాశం రాకపోవచ్చు. కానీ నేను గ్యాప్‌లో చాలా కథలు విన్నాను. చాలామంది నా దగ్గరకు వచ్చి కథలు చెప్పడం.. ఏ కథా నచ్చలేదని తిట్టుకుని వెళ్లిపోడం వంటి సంఘటనలు చాలా జరిగాయి. అందుకే ఈ ఏడాది ఆ గ్యాప్‌ పూర్తిచేస్తున్నాను. వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో సినిమా, వీరుపోట్ల దర్శకత్వంలోని మరో సినిమా రెండూ సగభాగం పూర్తయ్యాయి. గత ఏడాది గ్యాప్‌ను ఈ ఏడాది మూడు సినిమాల్తో భర్తీ చేస్తాను.
 
కమేడియన్‌ చేసిన ఇదే బేనర్‌లో హీరోగా చేయడం ఎలా అనిపిస్తుంది?
దిల్‌ రాజు కంపెనీలో చేయడం బాధ్యత. ఇక్కడ గౌరవాలు, ట్రీట్‌మెంట్లు వుండవు. వారికి గౌరవం నేనే ఇస్తాను. వారి క్వాలిటీ బ్రహ్మాండంగా వుంటుంది. దిల్‌ రాజుగారు నాకు ఎప్పటినుంచో తెలుసు. నేను, త్రివిక్రమ్‌ ఒకే రూమ్‌లో వుండగా.. రాజు, గిరితో కలిసి వచ్చేవారు. ఆయన సినిమాలు పంపిణీ చేసేవారు. బాగా లావుగా వుండేవారు. రోజుకు 12 గంటలు పడుకుంటారని ఆయన గురించి టాక్‌. అంతసేపు ఎలా పడుకుంటారని అమాయకంగా అడిగేవాడిని. అలాంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే బాడీని తగ్గించి స్మార్ట్‌గా తయారయ్యారు. ఇలా ఎలా తగ్గారని ఆమధ్యనే అడిగాను. రన్నింగ్‌ చేస్తారట. ఓసారి ఆయనతో నేనూ వెళ్ళాను. ఒక దశలో నేను ఆయనతో రన్నింగ్‌ చేయలేక ఆయాసపడుతున్నాను. నేను లావు కాబట్టి అలా వస్తుందని చెప్పాను. అయితే.. హీరోగా వుండాలంటే ఆ లావు పనికిరాదు. కమేడియన్‌గా ఓకే. తగ్గాలి. దిల్‌ రాజుగారే తగ్గగాలేనిది.. నేను తగ్గలేనా! అంటూ కసరత్తు మొదలుపెట్టాను. అలా ఒళ్లు తగ్గి.. ఆయన బేనర్‌లో హీరోగా చేయడం చాలా థ్రిల్‌గా అనిపిస్తుంది.
 
కృష్ణాష్టమి టైటిల్‌ ఏమిటి?
హీరోకి, కృష్ణాష్టమి టైటిల్‌కు కనెక్షన్‌ వుంది. చాలా టచ్‌గా వుంటుంది. ఎమోషన్‌ వస్తుంది. కథకు చాలా కీలకం ఆ పేరు. ఇందులో సెంటిమెంట్‌, ఫన్‌, పాజిటివ్‌‌నెస్‌ వుంటాయి. ఎవ్వరూ చెడ్డవారు కాదు. అందరూ మంచోళ్ళే. పరిస్థితుల వల్ల అలా మారాల్సి వస్తుంది అనే నీతి కూడా ఇందులో వుంది. పక్కోడికి సాయం చేయాలనే పాత్ర నాది.
 
అల్లు అర్జున్‌ కోసమే అనుకున్న కథకు మీరెలా సరిపోయారు?
నేను అదే దిల్‌రాజుగారిని అడిగాను. కానీ ఆయన.. అల్లు అర్జున్‌ కోసం తయారుచేసుకున్న కథను చెప్పలేదు. నాకోసం తయారుచేసుకున్న కథనే చెప్పారు. అలాగే ఈ సినిమాలో ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రధాన ఎసెట్‌. చిరంజీవి సినిమాల్లో చేసేటప్పుడు చిన్న పాత్ర వేశాను. అప్పుడు దానికి ఆయన కెమెరామెన్‌గా వుండేవారు. కానీ సోలో హీరోగా నాకు చేయడం గొప్పగా వుంది. నన్ను అందంగా చూపించారు.
 
పెద్ద బేనర్‌లో రాకపోతే భయపడేవారా?
ఎక్కడైనా కొత్త న్యూస్‌ వస్తే పాతది మర్చిపోతాం. మన జీవితంలోనూ అంతే. మన జీవితం అంతా ఫాస్ట్‌ఫార్వెడ్‌లోనే వెళుతుంది. అదే నేను విలేజ్‌లో 15 ఏళ్ళు వున్నా.. కానీ 50 ఏళ్ళ గడిపాననే ఫీలయ్యాను. హైదరాబాద్‌ వచ్చి 20 ఏళ్లు అయింది. కానీ 5 ఏళ్ళులా అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞాపకాలు అన్నీ స్పీడ్‌స్పీడ్‌గా మారిపోతున్నాయి. మా తాత, ముత్తాతలు బతికినంత హాయిగా మనం బతకలేకపోతున్నాం. జూబ్లీహిల్స్‌లోని ఎత్తయిన ప్రదేశాన్ని ఎక్కాలంటే.. బండి దిగి తోసుకుంటూ వెళ్ళిన రోజులు తలచుకుంటే థ్రిల్‌గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కారుల్లో ఇవే రోడ్ల మీద వందలసార్లు తిరిగాను. కానీ అవేవీ గుర్తుండవు. అలాగే గ్రాండియర్‌ అనేది కథలో వుండాలి. కథ నచ్చితే పెద్ద బేనర్‌ చిన్న బేనర్‌ అనే తేడా లేదు.

హీరోగా ఢోకా లేదు అని ఏ సినిమాతో అనిపించింది?
నిజం చెప్పాలంటే.. ఈ సినిమాతో వచ్చింది. 'మర్యాద రామన్న' షూటింగ్‌లో సరదాగా 'హా సునీల్‌ గారు! మళ్ళీ మీరు కమేడియన్‌గా చేయాలంటే చాలా టైమ్‌ పడుతుంది అన్నారు రాజమౌళిగారు. ఆయన వాక్కు అలానే అయింది. కానీ ఐదేళ్ళు సినిమా చేయలేదు నేను.
 
ఇండస్ట్రీలో సునీల్‌ గ్యాప్‌ అలాగే వుండిపోయిందంటున్నారు?
నేను బాగా ఫామ్‌లో వుండగానే ఆపేశాను కాబట్టి అలా అంటున్నారు. అదే నేను వరుసగా ఐదేళ్ళు చేస్తే.. రొటీన్‌ అనిపించేదేమో. కానీ.. నాతో కూడా గ్యాప్‌ అలాగే వుంది అన్నారు కూడా. కానీ కొత్త నీరు రావాలి. వస్తున్నారు కూడా. సప్తగిరి, సత్య, షకలక శంకర్‌. పృథ్వీ, పోసాని.. చాలామంది కామెడీ చేస్తున్నాను. అంతకుముందు కంటే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి కూడా. అప్పుడు నా ఫేసు.. క్యారెక్టర్లు అలా పడ్డాయి. ఇప్పుడు వీరు. క్యారెక్టర్లు ఇలా పడుతున్నాయి అంతే. ఒకరకంగా నా లోటును వందమంది భర్తీ చేయగలరు.
 
కమేడియన్‌గా సంపాదన ఉందా? హీరోగా వుందా?
కమేడియన్‌ అనేది రిటైల్‌ వ్యాపారం.. హీరో అనేది హోల్‌సేల్‌ వ్యాపారం. అక్కడ బాధ్యత తక్కువ. ఇక్కడ ఎక్కువ. ఒకరకంగా కమేడియన్‌గా సంపాదనే ఎక్కువ.
 
కమేడియన్‌గా ఒత్తిడికి గురయిన సందర్భాలున్నాయా?
హాస్యనటుడిగా రోజుకు 5,6 షూటింగ్‌లు చేశాను. బెంగుళూరు చెన్నై, హైదరాబాద్‌, ఊటీ.. ఇలా 15 రోజుల్లో తిరగాల్సి వచ్చింది. నిద్ర పోవడానికి సమయం జర్నీలోనే. మామూలుగా నవ్వించడం ఈజీనే. ఇలా జర్నీలు చేస్తూ షూటింగ్‌లో పాల్గొంటూ.. సీన్‌ పరంగా చేయాలంటే చాలా కష్టం. ఇలా అన్నిసినిమాల కో-డైరెక్టర్లను నెగ్గుకువచ్చి నవ్వించడం కష్టమైపోయేది. ఒక షూటింగ్‌ మధ్యాహ్నానికి పూర్తయ్యాక మరో షూటింగ్‌కు వెళ్ళాలి. అందుకే ఇద్దరు కో-డైరెక్టర్లు ఓకే అనుకుంటారు. కానీ ఈ కో-డైరెక్టర్‌ వెళ్లనీయడు. అక్కడ మరో సినిమాకు ఆర్టిస్టులంతా రెడీ.. నా కోసం ఆగారని చెబుతారు.. ఇలా వాళ్ళమధ్య వున్న సహకారంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. దాంతో ఒత్తిడికి గురయి.. బాగా చేయాల్సిన సీన్లు కూడా సరిగ్గా చేయలేక.. మనస్సులో పెనుగులాటలతో బయటకు చెప్పలేని టెన్షన్‌ అనుభవించాను.
 
ప్రేక్షకుల స్పందన ఎలా వుందంటారు?
ఒక మనిషిని నవ్వించడం ఈజీనే. కానీ వందలమందిని నవ్వించడం కష్టం. ఇప్పుడు జనరేషన్‌లో స్పీడ్‌ ఎక్కువ. మేథావితనం కూడా పెరిగింది. అదేసమయంలో చెకింగ్‌ పెరిగింది. వీడేం చేస్తాడో చూద్దాం! అనే మనస్తత్వంలో వున్నారు. ఒకరకమైన యుద్ధ వాతావరణ వచ్చేసింది. ఇలాంటి సమయంలో నవ్వించడం అనేది చాలా కష్టం. అలాంటి మనిషి టెన్షన్‌ తోడయితే.. నటుడిగా ఏం నవ్వించగలడు. నేను అంతకుముందు అనుభవించింది అదే.
 
ఫ్యామిలీ లైఫ్‌?
అప్పుడు పిల్లల్తో గడిపేవాడ్ని కాదు. పొద్దున్న లేస్తే.. షూటింగ్‌.. రాత్రిళ్లు ఇంటికి వచ్చేవాడిని. తెల్లారి మళ్లీ షూటింగ్‌.. ఇలా జరిగిన జర్నీలో.. ఒక్కసారిగా హీరోగా మారాక.. హాయిగా పిల్లల్తో గడపగలుగుతున్నాను. పిల్లల ప్రేమను చూడగలిగాను.
 
వ్యక్తిగతంగా ఎలా వుంటారు?
కృష్ణాష్టమిలో వున్నట్లుగానే పాజిటివ్‌గా ఆలోచిస్తాను. నెగెటివ్‌గా వుంటే బాధ ఎక్కువవుతుంది. మనలో సంకల్పం వుంటే ఎంతటి నెగెటివ్‌ అయినా పాజిటివ్‌గా మార్చుకోవచ్చు.
 
ఫైట్లు డాన్స్‌లు బాగా చేశారే?
ఇందులో డాన్స్‌ బలవంతంగా చేశాను. నా రెండు కాళ్ళకు ఆరు ఆనకాయలున్నాయి. ఐదు భరించగలను. కానీ ఆరోది భరించలేకపోయాను. షూలో రాయి వుంటేనే తట్టుకోలేం. అలాంటి ఎముక కింద.. డాన్స్‌ చేసే ఫ్లోర్‌ కింద కాలుపెట్టి చేయాలంటే నరకమే. అందుకే ప్రతి సాంగ్‌ను ముక్కములుగా చేయగలిగాను. కాలికి ఆపరేషన్‌ జరిగింది. కొన్ని కాల్చేశారు కూడా. దానికోసం రెండు నెలలు పూర్తి రెస్ట్‌ తీసుకోవాలి. కాలు కింద పెట్టకూడదు. రెండేళ్ళ గ్యాప్‌కు ఇది కూడా ఓ కారణం. 
 
అలాంటి సమయంలో దిల్‌రాజుగారు పిలిచి సినిమా ఇవ్వడం నా జీవితానికి నిజమైన సంతోషం. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయలేదు. ఆయన ఒక్కమాట అన్నారు. నీ సినిమా 'భీమవరం బుల్లోడు' థియేటర్‌లో చూశాను. ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేశారు. ఏవరేజ్‌గా తీస్తేనే అంత కలెక్షన్లు వచ్చాయి. అదే సూపర్‌హిట్‌ అయితే.. ఎంత కలెక్షన్లు వస్తాయి. కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా అన్నివర్గాలవారికి నచ్చేలా సినిమా తీస్తే ఎలా వుంటుందని అన్నారు. దేవుడు వరమిచ్చినట్లు ఆయన వచ్చి నాతో సినిమా చేశారు. 
 
6 ప్యాక్‌ చేసినప్పుడు మీ భార్య రియక్షన్‌ ఎలా వుంది?
ఒక్కటే అన్నారు. పెండ్లి కాకముందు అందరూ సిక్స్‌ప్యాక్‌ చేస్తారు. మీరు పిల్లలు పుట్టాక రివర్స్‌ చేస్తున్నారే అని అడిగింది. మనకు అన్నం తినడం అలవాటు. అది తినకుండా కంట్రోల్‌ చేస్తుంటే ఆమెకు చాలా భారంగా వుండేది. రోజుకు 8 గంటలు కష్టపడితేనే సిక్స్‌ప్యాక్‌ వస్తుంది.
 
ఇలా చేయాలని ఎందుకనుకున్నారు? స్పూర్తి ఎవరు?
ఏదో కొత్తగా వుండాలని చేశాను. స్పూర్తి అయితే.. చేపలు పట్టేవారే. 'అత్తిలి సత్తిబాబు' సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అక్కడ సముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగేది. బోటు వేసుకుని 30, 40, 60 సంవత్సరాలు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళేవారు. ఒక్కోడు ఒక్కో బ్రూస్‌లీ బాడీలా వుంది. వారిని చూసి మీరు ఏం తింటారని అడిగాను. రైస్‌ తింటాం, చికెన్‌, ఫిష్‌ తింటాం అన్నారు. వారు రోజూ తెడ్లతో అలా సముద్రంలోకి గంటల తరబడి ప్రయాణం చేస్తుండగా.. బాడీలో వచ్చే మార్పే 6ప్యాక్‌. అలాంది నేను ఎవరినో కోచ్‌గా తీసుకోవడం ఎందుకు? అని వారి అడుగుజాడల్లోనే రోజూ జిమ్‌లో కష్టపడి.. డైటింగ్‌ చేశాను. కృష్ణాష్టమిలో కూడా మూడు నిముషాల పాటు సిక్స్‌పాక్‌ వుంటుంది కూడా.
 
కమేడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ ఏమిటి? అని ఎవరూ అనలేదా?
అన్నారండి బాబూ.. చాలామంది సలహా ఇచ్చారు కూడా. ఇంతకుముందెప్పుడూ కమేడియన్‌ ఇలా చేయలేదు. ఇప్పుడు ఇలా చేసి ఏం చేయగలవు? మానుకో అన్నారు. ఈ విషయమే మా అమ్మగారికి చెప్పాను. నువ్వు ప్రేమతో చేద్దామనుకున్నావ్‌ చేసేయ్‌. ఇంతకుముందు అలా ఎవ్వరు చేయలేదు కరెక్టే.. తర్వాత తరానికి నువ్వు మార్గదర్శి అవుతావేమో అంటూ.. ధైర్యం నూరిపోసింది. ఆ పాజిటివ్‌నెసే నన్ను నడిపింది.
 
మరి హీరో గ్లామర్‌గా వుండాలి కదా?
అందుకే మరలా మామూలుగా అయ్యాను. మన దగ్గర బుగ్గలు బాగుంటే.. హీరోగా అంగీకరిస్తారు. హాలీవుడ్‌ అలా కాదు. బుగ్గలు వుండకూడదు. బుగ్గలు వుంటే తండ్రి పాత్రలు ఇస్తారు. అందుకే.. ఈ సినిమా సిక్స్‌ప్యాక్‌ ఓ షాట్‌ వుందంటే... అది చివర షూట్‌ చేయమని చెప్పాను. ఆలోగా బాడీ వర్కవుట్‌ చేశాను. 
 
మీరు చేసే సినిమాల్లో దర్శకులకు సూచనలు ఇస్తుంటారా?
ఎవరైనా ఏదైనా అనుమానం కల్గిస్తే.. అప్పుడు సూచిస్తుంటాను. లేదా నాకే ఏదైనా అలా అనిపిస్తే.. త్రివిక్రమ్‌, పూరీ, శ్రీనువైట్ల వంటివారి దగ్గరకు వెళ్ళి ఈ సీన్‌ ఇలా వచ్చింది. ఇంకెలా వస్తే బాగుంటుంది అని చర్చించి రిహార్సల్స్‌ చేస్తా.
 
త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు?
గ్యారంటీగా వుంటుంది. కొన్ని కమిట్‌మెంట్లు వున్నాయి. అవి పూర్తయ్యాక.. నాకు తగిన కథతో చేస్తాను. నాకు తగినట్లుగా బంకు సీను పాత్ర రాశాడు. అది పెద్దగా పేలింది. అలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం అని చెప్పారు.