శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : గురువారం, 26 మే 2016 (20:53 IST)

రానా ఏదో అలా అనేశారు... పట్టించుకోను... 'రాయుడు' శ్రీదివ్య ఇంటర్వ్యూ

తెలుగమ్మాయి అయినా తమిళ చిత్రాల్లో ముందంజలో వున్న నటి శ్రీదివ్య. కేరింతలో మంచి పెర్‌ఫార్మెన్స్‌ చూపించిన తను తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విశాల్‌తో 'మరుదు' అనే చిత్రంలో నటించింది. ఈ నెల

తెలుగమ్మాయి అయినా తమిళ చిత్రాల్లో ముందంజలో వున్న నటి శ్రీదివ్య. కేరింతలో మంచి పెర్‌ఫార్మెన్స్‌ చూపించిన తను తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విశాల్‌తో 'మరుదు' అనే చిత్రంలో నటించింది. ఈ నెల 20న తమిళంలో విడుదలై ఆదరణ పొందుతోంది. మధుర బ్యాక్‌డ్రాప్‌తో సాగిన ఈ చిత్రం అమ్మమ్మ, మనవడు నేపథ్యంలో సాగే కుటుంబకథా చిత్రమిదని తెలియజేస్తుంది.   ముత్తయ్య దర్శకత్వంలో విశాల్‌ సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన తమిళ చిత్రం ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి 'రాయుడు' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రీదివ్యతో ఇంటర్వ్యూ.
 
విలేజ్‌ అమ్మాయిగా ట్రైలర్‌లో కన్పిస్తున్నారు?
అవును. పక్కా విలేజ్‌లో వుండే అమ్మాయిగా నటించాను. నేను హైదరాబాద్‌లో పెరగడం వల్ల.. పల్లెటూరి వాతావరణం పెద్దగా తెలీదు. పైగా తమిళనాడులోని విలేజ్‌లోని అమ్మాయిలు ఎలా వుంటారో కూడా తెలీదు. అందుకే ఈ చిత్రం మధురై ప్రాంతంలో జరుగుతుంటే అక్కడ అమ్మాయిల్ని అడిగి వారి బాడీ లాంగ్వేజ్‌ను మాటలను పట్టుకోవాలని ప్రయత్నించాను. కానీ వారు చాలా సిగ్గుపడుతూనే ఇంగ్లీషులో మాట్లాడుతుంటే ఆశ్చర్యమేసింది. చేసేది లేక దర్శకుడు ముత్తయ్య చెప్పినట్లు చేశానంతే..
 
హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్ర చేశారా?
హీరోతో సమానమైన పాత్ర. ఇది నాకు లభించడం అదృష్టం. విశాల్‌ పాత్ర ఎంత వుంటుందో.. దానికి తగ్గట్లుగానే నా పాత్ర వుంటుంది. నా పాత్రలో రెండు షేడ్స్‌ వుంటాయి. భాగ్యలక్ష్మి అనే పాత్రలో నటించాను. ఉన్నది వున్నట్లు మాట్లాడే పాత్ర. ఫస్ట్‌ హాఫ్‌లో బోల్డ్‌గా కనిపించే అమ్మాయి పెళ్ళైన తరువాత సెకండ్‌ హాఫ్‌లో చాలా తెలివితేటలతో కనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఇప్పుడు వస్తోన్న చాలా సినిమాల్లో హీరోయిన్స్‌కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కానీ తమిళంలో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చే ప్రతి సినిమా హిట్‌ అవుతుంది. ఈ సినిమాలో కూడా నా రోల్‌ అలానే ఉంటుంది. పవర్‌‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తాను.
 
విశాల్‌తో నటించడం ఎలా అనిపించింది?
విశాల్‌ అనగానే.. పెద్ద స్టార్‌ హీరో సెట్స్‌ మీద ఎలా ఉంటారో? అనే భయం కలిగింది. నా పరిస్థితి తెలుసుకున్నట్లు.. ఫ్రెండ్లీగా వుండేవారు. యూనిట్‌తో ఒకే విధంగా ఉంటారు. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఫీల్‌ అయ్యాను. తమిళంలో సూరి అనే వ్యక్తి వున్నారు. విశాల్‌, సూరి కలిస్తే ఇక నవ్వులే నవ్వులు. జోక్స్‌ చేస్తూ.. చాలా సరదాగా ఉంటారు.
 
షూటింగ్‌లో వుండగానే ప్రజా సేవ చేశారని చెప్పారు?
నాకంటే నడిగర్‌ సంఘం కార్యదర్శిగా విశాల్‌ సేవ చేస్తూనే వున్నారు. మధురై పక్కన పల్లెటూర్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లు లేవు. అక్కడ మహిళల ఇబ్బందులు చూసి ఆయన చలించిపోయారు. వెంటనే  తమిళనాడులోని రాజపాళ్యం అనే ప్రాంతంలో యూనిట్‌ సహకారంతో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నా వంతుగా ఓ పది టాయిలెట్స్‌ కట్టిస్తానని చెప్పాను.
 
మీరు దర్శకులకే షాట్‌ ఎలా చేయాలో చెబుతారని రానా కామెంట్‌ చేశారు?
ఆడియో వేడుకలో ఆయన నాపై సెటైరిక్‌గా మాట్లాడారు. నేను ఆయనకంటే సీనియర్‌ నటిగా పేర్కొంటూ.. నవ్వించే ప్రయత్నం చేశారు. ఇది అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు.
 
తమిళ చిత్రాల్లోనే నటిస్తున్నారు?
నాకు మొదటి నుండి తమిళ సినిమాలంటే బాగా ఇష్టం. రెగ్యులర్‌గా ఫాలో అయ్యేదాన్ని. అక్కడ సహజత్వం, నేటివిటీ అంటే నాకు నచ్చేవి. అంతేకాదు సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలే ఎక్కువగా ఉంటాయి.
 
అక్కడ సినిమా రిజల్ట్‌ ఎలా వుంది?
తమిళంలో విడుదలయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పదేళ్ళ తరువాత విశాల్‌ కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. చెన్నై కంటే మధురై వంటి ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే విడుదలయిన పాటలకు పాజిటివ్‌ ఫీడ్‌‌బ్యాక్‌ వస్తోంది. ముఖ్యంగా 'ఒంటిజెడ రోజా' అనే పాట శ్రోతలను అలరిస్తోంది.
 
ఈ చిత్రంలో హైలైట్స్‌ ఏమిటి?
అమ్మమ్మ, మనవడు మధ్య ఉండే సెంటిమెంట్‌తో కథ నడుస్తుంది. ఈ స్టొరీ ఎవరికైనా కనెక్ట్‌ అవుతుంది. అందుకే తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. పాటలు కూడా హైలైట్‌గా వున్నాయి. 
 
తెలుగులో సినిమాలు చేయరా?
తెలుగులో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది. 'కేరింత' తరువాత చాలా గ్యాప్‌ తీసుకున్నాను. మంచి సబ్జెక్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నాను. తమిళంలో వరుసగా సినిమాలు ఒప్పుకోవడం వలన తెలుగు సినిమాలు సైన్‌ చేయలేకపోతున్నాను. కాని తెలుగులో చేయాలని ఆసక్తిగా ఉంది.
 
మేకప్‌ లేకుండా నటించారా?
ఈ సినిమాలో నేను ఎక్కువగా మేకప్‌ చేసుకోలేదు. ముత్తయ్య గారికి మేకప్‌ ఇష్టం లేదు. నన్ను కొంచెం డార్క్‌‌గా చూపించాలని మేకప్‌ చేసేవారు. అచ్చంగా గ్రామంలో ఉండే అమ్మాయిలానే కనిపిస్తాను.
 
తదుపరి చిత్రాలు
'కాష్మోరా' అనే తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించాను. అది మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. అలానే జీవా హీరోగా చేస్తోన్న మరో సినిమా అంగీకరించానని తెలిపారు.