శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2015 (20:55 IST)

అఖిల్-నాగచైతన్యలతో పోటీ పడాలనుంది... : నాగార్జున ఇంటర్వ్యూ

తెలుగు సినిమాను ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేయడం, మార్కెట్‌ విస్తరణకు వుపయోగపడేలా చేయడమనేది బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు ఇప్పుడు చూస్తున్నాం. కానీ నేను ఈ ప్రయోగం గతంలోనే చేశానని అక్కినేని నాగార్జున అన్నారు. కొత్తకొత్త స్క్రిప్ట్‌లతో కొత్తవారిని డైరెక్టర్‌గా అవకాశాలు కల్పిస్తూ ఆయన చిత్రాలు చేస్తూ 'మనం'తో ఒక్కసారి జాతీయస్థాయిలోని నటులందరినీ ఆకర్షించాడు. ఇప్పుడు తాజాగా సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లో వుండగానే ఆయన పుట్టినరోజు రావడం విశేషం. ఈ నెల 29న అంటే శనివారం నాగ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
 
మీ పుట్టినరోజునాడే మీ అఖిల్‌ కూడా హీరోగా మారాడు?
అవును.. చాలా ఆనందంగా వుంది. నాగచైతన్య, అఖిల్‌ ఇద్దరూ షూటింగ్‌లో బిజీగా వున్నారు. ముగ్గురం కలిసి సినిమా చేయడం కంటే అదృష్టం ఏముంటుంది.
 
'మనం' తర్వాత గ్యాప్‌ తీసుకున్నారు?
నిజమే. మూడు జనరేషన్స్‌ తర్వాత కొత్త కాన్సెప్ట్‌తో కథలు రావాలని ప్రయత్నించాను. కథలు సరిగ్గా కుదరక వెయిట్‌ చేశాం.
 
పుట్టినరోజు రిజల్యూషన్స్‌ ఏమైనావున్నాయా?
పెద్దగా ఏమీలేవు. ఆరోజు నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌తో చేస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు అఖిల్‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కూడా విడుదల చేస్తున్నాం. అయితే ఇక్కడో ఇంట్రెస్ట్‌ పాయింట్‌ వుంది. వారి చిత్రాలతో పాటు నా చిత్రం కూడా విడుదల అయితే చూడాలని వుంది. 
 
అంటే.. తనయులతో పోటీ పడుతున్నారా?
అలా చేయడమూ ఓ థ్రిల్లే.. ఇలా సినిమాలు విడుదల కావడం చాలా అరుదైన విషయం కూడా.
 
సోగ్గాడే...లో పంచె కట్టారే.. రెండు పాత్రలు చేస్తున్నారు?
ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. తండ్రీ కొడుకుల పాత్రలు అవి. తొలిసారిగా తండ్రిగా నటిస్తున్న సినిమా.
 
తండ్రిగా నటించడానికి ప్రత్యేక కారణం?
నిజం చెప్పాలంటే.. తండ్రీ పాత్ర కేవలం దెయ్యం క్యారెక్టర్‌. చిన్నప్పుడే తండ్రి చనిపోయినా కూడా అతనికి తండ్రి ఆత్మ కన్పిస్తూంటుంది.
 
అంటే ఆత్మ కథల నేపథ్యమా?
కాదుకానీ.. చాలా కొత్తగా వుంటుంది. ఇటీవలే వస్తున్న ఆత్మ చిత్రాల్లాంటిది కాదు.. చూస్తే మీకే తెలుస్తుంది.
 
అయితే రెండు పాత్రలు ఎలా బ్యాలెన్స్‌ చేశారు?
ఏముందండి.. ఈజీ.. తండ్రి పాత్ర కొద్దిగా డాబూ దర్పం వుండేలా చూసుకోవడమే. రెండో పాత్ర అమాయకత్వంతో కూడింది. రీసెర్చ్‌ మైండ్‌తో వుండేలా పాత్ర వుంటుంది. నటుడిగా ఇవి చాలా ఈజీనే.
 
రియల్‌ లైఫ్‌లో దెయ్యం కన్పిస్తే ఏం చేస్తారు?
అలాంటి జరిగిన సంఘటనలు లేవు. తీరని కోరికలతో చనిపోతే అలా అవుతారని విన్నాను. అదంతా పెద్దగా నమ్మను.
 
బాహుబలి.. శ్రీమంతుడు చిత్రాలు జాతీయ మార్కెట్‌లో వెళ్ళాయి. దీనిపై మీ స్పందన?
ఇది మంచి పరిణామమే. బాహుబలి సినిమా చూశాక థ్రిల్‌కు గురయ్యాను. అయితే ఇతర భాషల్లో మన తెలుగు హీరోలు ఆలస్యంగా మార్కెట్‌ను చేసుకుంటున్నారు. కానీ నేను ఈ ప్రయత్నం గతంలోనే చేశాను. నా చిత్రాలన్నీ తమిళంలో కూడా విడుదలయ్యేవి. అక్కడ నాకు మార్కెట్‌ కూడా వుంది. హిందీలో కూడా విడుదల చేసిన సందర్భాలున్నాయి. 
 
భిన్నమైన కథలు చేస్తున్న మీరు మళ్ళీ భక్తిరసం చేస్తున్నారనే వార్త విన్పిస్తుంది?
అవును. నిజమే.. నాకు చేయాలనుంది. దానికి సంబంధించిన కథను రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఇంకా ఫైనల్‌ కాలేదు.
 
కార్తీతో కలిసి చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది?
కొత్త కథలు చేయాలనుకున్న టైమ్‌లో వంశీ పైడిపల్లి ఓ కథ చెప్పాడు. నా పాత్ర చాలా భిన్నంగా వుంటుంది. రెండో పాత్ర పేరున్న హీరో అయితే చాలా బాగుంటుంది. కార్తీని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగింది. అదికూడా షూటింగ్‌ చివరికి వచ్చింది. బహుశా రెండు సినిమాలు అటుఇటూగా విడుదలవుతాయి.
 
రమ్యకృష్ణతో మళ్ళీ నటించడం ఎలా అనిపించింది?
తండ్రి పాత్రకు రమ్యకృష్ణ నటించింది. కొడుకు పాత్రకు లావణ్య చేసింది. రమ్యకృష్ణతో చాలా సినిమాలు చేశాను. ఇద్దరి సినిమాలు హిట్‌ అయ్యాయి. మంచి జోడీగా గుర్తింపు వచ్చింది.
 
ఏదైనా సందేశం ఇస్తున్నారా?
అదేం లేదు. పక్కా కమర్షియల్‌.. బాహుబలి లాంటి సినిమాలోనూ ఎక్కడా సందేశం లేదు. ఆడియన్‌ను ఎంటర్‌టైన్‌ చేయడమే సినిమా పని అని ముగించారు.