శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 23 జులై 2015 (16:35 IST)

బాహుబలిలో నేను చేయడమేమిటి...? అల్లరి నరేశ్‌

సరదాగా అల్లరితో సినీ కెరీర్‌ను ప్రారంభించి అనుకోకుండా హీరో అయిన నటుడు నరేశ్‌. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కానీ అల్లరి అనేది మార్చేయాలని చాలా తంటాలు పడ్డాడు. కానీ ఏ చిత్రమూ అంతటి గుర్తింపు ఇవ్వలేకపోయింది. రాజేంద్రప్రసాద్‌ తర్వాత అంతటి హ్యాసాన్ని ఇస్తానని చెప్పుకున్న నరేశ్‌... ఆయనే తన గురువుగా చెబుతుంటాడు. తన తండ్రి ఇవివి సత్యనారాయణ.. తర్వాత అలాంటి కథలతో సినిమాలు రావడంలేదనీ... ఆయన లోటు ఇంటా, బయటా కన్పిస్తుందని చెబుతున్నాడు. లేటెస్ట్‌గా 'జేమ్స్‌బాండ్‌' సినిమా ద్వారా శుక్రవారం ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
టైటిల్స్‌ హీరోలనుబట్టే పెడతారు.. మీ టైటిల్‌... నేను కాదు నా భార్య అంటూ కాప్షన్‌ పెట్టారు. ఏమిటి?
జేమ్స్‌బాండ్‌ నేను కాదు.. మా ఆవిడ అనేది కాప్షన్‌.. ఈ టైటిల్‌ పెట్టేటప్పుదు యూనిట్‌ అంతా తెగ మెచ్చేసుకున్నారు. కథ అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. నా కథలకు ఇలాంటి టైటిల్స్‌ కరెక్టే అని పెట్టాం. పెండ్లి చేసుకునే సెటిల్‌ అవుతుదామనుకున్న కుర్రాడికి మాఫియా డాన్‌ లాంటి భార్య దొరుకితే ఏమవుతుందనే కథ.. చాలా ఎంటర్‌టైన్‌గా వుంటుంది.
 
'కితకితలు'కూడా ఇంచుమించు అదే కథకదా?
ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ లాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్న పోలీసు ఆఫీసర్‌కు కల్పనరాయ్‌ లాంటి భార్య దొరికితే ఎలా వుంటుందనేది పాయింట్‌. ఇది కొంచెం మార్పు ఒక రకంగా చెప్పాలంటే.. బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి బ్రదర్‌ లాంటి కాన్సెప్ట్‌.. హీరోయిన్‌ సాక్షి చౌదరి చాలా ఎత్తుగా వుండటంతో టైటిల్‌ ఆమెకు బాగా కుదిరింది.
 
పారడీ పేరుతో, పంచ్‌ డైలాగ్స్‌ పేరుతో ఎక్కువ చూపిస్తున్నారనే విమర్శ వుంది?
కామెడీ కోసం ఒకప్పుడు అలా చేశాం. రిసీవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు మారారు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భారీ డైలాగ్స్‌, పంచ్‌లు వుండవు. నాచురల్‌గా సింపుల్‌గా వుంటాయి.
 
మీ కెరీర్‌ అంత స్పీడ్‌గా సాగడంలేదు?
సహజంగా నటీనటులకు అప్‌ అండ్‌ డౌన్స్‌ మామూలే... సుడిగాడు తర్వాత ఒక్కసారిగా స్పీడ్‌గా వెళ్ళిన నేను కొన్ని ప్రయోగాలు చేసి దెబ్బతిన్నాను. లడ్డుబాబు. యాక్షన్‌ 3డి సినిమాలు కాన్పెప్ట్‌లు ఓకే.. కానీ ఎందుకనో ప్రేక్షకులు తిరస్కరించారు. ఇకపై జాగ్రత్తగా కథలు సెలెక్ట్‌ చేసుకుంటాను.
 
బాహుబలిలో అవకాశం వస్తే చేసేవారా?
అది సీరియస్‌ సినిమా... కామెడీ పెద్దగా లేదు. నా కోసం ఓ పాత్ర రాసి.. రాజమౌళి పిలిస్తే బాగుండేదనిపించింది. అదే గనుక వుంటే ఫోన్‌ చేసేవారుకదా..
 
నాన్నగారు మీకు గైడెన్స్‌ వుండేవారు? ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు?
నాన్నగారు కథలు విని ఎంపిక చేసేవారు. ఇప్పుడు అన్నీ నేనే వింటున్నాను. ఆయన లేని లోటు స్పష్టంగా కన్పిస్తుంది. 
 
మోహన్‌ బాబుతో కలిసి చేస్తున్నారు? ఎలా వుండబోతుంది సినిమా?
మోహన్‌ బాబుగారు హీరోనే కాదు.. ఆయన కామెడీ చాలా బాగుంటుంది. నేను ఆయన అభిమానిని. ఓసారి విష్ణు ఫోన్‌ చేసి.. నాన్నగారితో సినిమా చేయాలి అన్నారు. వాళ్లింటిలో ఇద్దరు హీరోలున్నా.. నాకు అవకాశం ఇచ్చారంటే.. గొప్ప విషయమే కదా.. అందుకే నటిస్తున్నాను. త్వరలో సెట్‌పైకి వెళుతుంది అని చెప్పాడు.