శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (17:23 IST)

రజినీకాంత్‌తో నటించాలనుకోలేదు... స్టార్‌డమ్ కోరుకోవడం లేదు: అరవింద్‌ స్వామి

''నా వయసు 21 ఏళ్లు. ఆ సమయంలో నేను సినిమాల్లో నటించాలనుకోలేదు. దళపతి, రోజా సినిమాల్లో యాక్ట్‌ చేసేటప్పుడు ఆ ఆలోచనలేదు. రజినీకాంత్‌ 'దళపతి' అనగానే ఎందుకో చేద్దామనిపించింది. నేను సిగ్గరి, స్టార్‌డమ్‌ను ఎ

''నా వయసు 21 ఏళ్లు. ఆ సమయంలో నేను సినిమాల్లో నటించాలనుకోలేదు. దళపతి, రోజా సినిమాల్లో యాక్ట్‌ చేసేటప్పుడు ఆ ఆలోచనలేదు. రజినీకాంత్‌ 'దళపతి' అనగానే ఎందుకో చేద్దామనిపించింది. నేను సిగ్గరి, స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకోలేదు'' అని అరవింద్‌స్వామి అన్నారు. ఆయన రామ్‌చరణ్‌తో 'ధృవ'లో విలన్‌గా నటించారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
 
* చాలాకాలం గ్యాప్‌ తీసుకున్నారే?
అలైపాయుదె(సఖి)చిత్రంలో (199-00) అతిథి పాత్రలో నటించాను. నేను కేవలం సినిమాల్లోనే నటించాలనుకోలేదు. బిజినెస్‌ చేయాలనుకున్నాను. నా పిల్లలతో సరదాగా గడపాలనుకున్నాను. అందుకనే సినిమాల నుండి బ్రేక్‌ తీసుకున్నాను.
 
* మరి బిజినెస్‌ ఎలా వుంది?
గ్లోబెల్‌ ఫైనాన్సియల్‌ ప్రాసెస్‌లు చేసే బ్యాక్‌ ఆఫీస్‌ బిజినెస్‌ చేశాను. వర్క్‌ ఫ్లో అప్లికేషన్స్‌ క్రియేట్‌ చేయడం వంటి బిజినెస్‌లు చేశాను. గ్లోబెల్‌ ప్రాసెస్‌ బిజినెస్‌ ఇప్పుడు చేయడం లేదు. పే రోల్‌ ప్రాసెస్‌ బిజినెస్‌ మాత్రమే చేస్తున్నాను. నా వద్ద 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
 
* స్క్రిప్ట్‌ వర్క్‌ ఎలా తీసుకుంటారు?
 తమిళ సినిమా తని ఒరువన్‌ కాన్సెప్ట్‌ను మాత్రమే దర్శకుడు మోహన్‌రాజా నాకు ముందు చెప్పారు. అప్పటి నుండి నేను కూడా స్క్రిప్ట్‌ వర్క్‌లో భాగమయ్యాను. రెండు మూడు నెలలు పాటు స్క్రిప్ట్‌, సిద్ధార్థ్‌ అభిమన్యు క్యారెక్టర్‌ గురించి వర్కవుట్‌ చేశాం. నిజానికి యాక్టింగ్‌ చేయడం కంటే ఇలా వర్క్‌లో ఇన్‌వాల్వ్‌ కావడం అనేదే నాకు ఆసక్తిగా అనిపించింది. అదీ కాకుండా సిద్ధార్థ్‌ క్యారెక్టర్‌ పొసెసివ్‌గా అనిపించడం, నేనే చేస్తే బావుంటుందని టీం సభ్యులు అనడంతో నేను సిద్దార్థ్‌ అభిమన్యు రోల్‌ చేయడానికి రెడీ అయ్యాను.
 
* 'ధృవ'తో మీ ఐడియాలు మారాయా?
నాకు నెగటివ్‌ రోల్స్‌ చేయాలనే కోరిక ఉండేది. ఒక నటుడు హీరోగా చేస్తున్నాడు, విలన్‌గా చేస్తున్నాడు, చేయాలనే భావన మనలోనే ఉంది. హాలీవుడ్‌ సినిమాల్లో చూస్తే పర్టికులర్‌ పాత్రలో నటించే వ్యక్తి చెడ్డవాడేం కాదు. ఓ పాత్రను చేస్తున్నాడు. అది ఎవరైనా కావచ్చు. ఒక నటుడుగా ఎప్పుడూ పాజిటివ్‌ క్యారెక్టర్స్‌నే కాదు, నెగటివ్‌ క్యారెక్టర్స్‌ కూడా చేయాలనే తలంపే అందుకు కారణం. ఎప్పుడూ మంచి వ్యక్తిగా నటించడం బోరింగ్‌గా అనిపిస్తుంది. నెగటివ్‌ క్యారెక్టర్‌ అంటే మందు తాగడమో, సిగరెట్స్‌ కాల్చడమో, కోపంగా ఉండటమో కాదు, నేను అలా చేయనని ముందుగానే దర్శకుడు మోహన్‌రాజాకు చెప్పాను. అలాగే సినిమాలో నేనెంత విలన్‌గా ఉన్నా, సినిమా చూసే ఆడియెన్స్‌లో మూడొంతుల మందికి క్లైమాక్స్‌లో అరే ఇతనికిలా ఎందుకయ్యిందనిపించాలని కూడా చెప్పాను. క్యారెక్టర్‌ను అలాగే డిజైన్‌ చేశాను. ఆ విషయంలో మేం సక్సెస్‌ అయ్యాం. భవిష్యత్‌లో కూడా నేను పాజిటివ్‌ క్యారెక్టర్స్‌ చేస్తాను, నెగటివ్‌ క్యారెక్టర్స్‌ కూడా చేస్తాను. క్రియేటివ్‌ వర్క్‌ను నేను బాగా ఇష్టపడతాను. అలాగని నెగటివ్‌ క్యారెక్టర్‌ అంటే మందు తాగడం, సిగరెట్స్‌ తాగే సీన్స్‌ ఎప్పుడూ చేయనని కాదు, కథ డిమాండ్‌ చేస్తే తప్పకుండా ఆ సీన్స్‌‌లో కూడా యాక్ట్‌ చేస్తాను.
 
* పదేళ్ళ క్రితం మీకు ప్రమాదం జరిగింది? దాన్ని గురించి చెబుతారా?
2006లో నాకు యాక్సిడెంట్‌ అయ్యింది. వెన్నుముకకు గాయమైంది. అదేసమయంలో పక్షవాతం కూడా వచ్చి నేను ఒక సంవత్సరం పాటు నడవలేకపోయాను. నేను సాధారణ వ్యక్తి కావడానికి దాదాపు మూడు నాలుగేళ్ల సమయం పట్టింది. నేను మేడిటేషన్‌ చేశాను. దాదాపు పాతిక కిలోల బరువు తగ్గాను. నాకు యాక్సిడెంట్‌ జరిగినప్పుడు నేను నా శరీరాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడం కంటే నా మైండ్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకున్నాను. డిప్రెషన్‌ కాకూడదని భావించాను. నెగటివ్‌ ఆలోచనలు కూడా చేయడం మానేసి నా మైండ్‌ను ఏదో ఒక పనితో యాక్టివ్‌గా ఉంచుకున్నాను. ఏదో ఒక పనిచేశాను. అందులోభాగంగా ఆన్‌లైన్‌ చెస్‌ ఆడాను. మ్యాథ్స్‌ సమస్యలు చేశాను. ఇలా బిజీ అయ్యాను.
 
* దర్శకుడిగా ఆలోచన ఉందా?
వచ్చే ఏడాది చివర్లో డైరెక్ట్‌ చేసే ఆలోచన ఉంది. అలాగని నటనను వదులుకోను. అయితే నేను డైరెక్ట్‌ చేసే సినిమాలో నేను నటించను. నేను డైరెక్ట్‌ చేయబోయే సినిమాకు సంబంధించి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ కథతో ముందు కెళ్లాలనే ఆలోచన చేస్తున్నాను.
 
* మణిరత్నంతో సినిమా వార్తలు వస్తున్నాయి?
 నేను మణిరత్నంగారితో ఎప్పుడైనా పని చేయడానిని సిద్ధమే. ఎందుకంటే ఆయన నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారని కాదు. 'దళపతి' సినిమా చేసేటప్పుడు కూడా నేను కొత్త నటుడు, అనుభవమున్న నటుడని చూడకుండా మొత్తం స్క్రిప్ట్‌ వివరించారు. ఆయన సీన్‌ను విజువలైజేషన్‌ చేసే విధానం కొత్తగా ఉంటుంది. ఆయనతో పనిచేసిన ప్రతిసారి ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. నాకు ఆసక్తి కలిగే విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.
 
* తెలుగు సినిమాలు చేయరా?
స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. ఎందుకంటే నాకు తెలుగు కొత్త భాష. స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తే, నేను భాషపై కాన్స‌న్‌స్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగని తమిళంటే ఇష్టమని, తెలుగంటే ఇష్టం లేదని కాదు. కొంత మంది నటీనటులు కొత్త లాంగ్వేజెస్‌ను త్వరగానే నేర్చుకుంటారు. అయితే నేను లాంగ్వేజెస్‌ను నేర్చుకోవడంలో చాలా వీక్‌. ప్రస్తుతానికైతే తమిళ సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాలనుకుంటాను. వేరే భాషా చిత్రాల్లో నటించనని కాదు. ఇతర భాషల్లో కూడా నటించే అవకావం ఉంది. 
 
* తదుపరి చిత్రాలు.... 
బోగన్‌ సినిమాలో నటించాను. చదరంగ వేట్టై సీక్వెల్‌ చేస్తున్నాను. అలాగే పోలీసు వృత్తిలో ఓ వ్యక్తి పాతికేళ్లు అనుభవంతో కూడిన వనంగ ముడి అనే కథను రాసుకున్నాను. దానిలో యాక్ట్‌ చేస్తున్నాను. మమ్ముట్టి నటించిన "భాస్కర్‌ ది రాస్కెల్‌" తమిళ రీమేక్‌లో నటిస్తున్నట్టు ఇంటర్వ్యూ ముగించారు.