శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (19:46 IST)

ముందుతరం లక్కీ.. భలే.. భలే.. భలేగుంటుంది!: నాని

నటుడిగా... పిల్ల జమిందార్‌తో సక్సెస్‌లోకి వచ్చిన నాని.. ఆ తర్వాత 'ఈగ'తో పేరుతెచ్చుకున్నా... క్రెడిట్‌ రాజమౌళికే దక్కింది. అయితే ఆ చిత్రం నుంచి ఆ కుటుంబంతో నానికి మంచి సంబంధాలున్నాయి. అవి ఆయన నటించిన ప్రతి సినిమాను ప్రసాద్‌ల్యాబ్స్‌లో కూర్చుని చూసి.. బాగుంటే బాగుందని లేదంటే.. లేదని చెప్పేస్తారు.. ఈ విషయాన్ని నాని స్వయంగా వెల్లడించారు. ఇదంతా మారుతి దర్శకత్వంలో నాని నటించిన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం ప్రమోషన్‌ సందర్భంగా వెల్లడించాడు. శుక్రవారమే విడుదలవుతుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా నానితో ఇంటర్వ్యూ...
 
ప్రశ్న: మారుతీకి మీకు ఎలా సెట్‌ అయింది? 
జ : మారుతి డైరెక్ట్‌ చేసిన ప్రేమ కథా చిత్రం చూశాను. ఆయన ఈ సినిమా కథ నాకు వినిపించినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. మారుతి అధ్బుతంగా చెప్పగలరు. కథ విన్న వెంటనే ఓకే చేసేశా. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆయన రాసిన ప్రతి డైలాగ్‌ ప్రేక్షకులను నవ్వించే విధంగా చిత్రీకరించారు. ఆయనలో మంచి కామెడీ ఫ్లేవర్‌ ఉంది. ఇండస్ట్రీలో ఆయన డైరెక్టర్‌గా అవ్వాలనుకున్నప్పుడు ఆయన చేతిలో ఓ 5డి కెమెరా, 40 లక్షలు డబ్బు ఉందంట. ఉన్న దాంతోనే సినిమా చేసి సక్సెస్‌ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. ఈరోజు ఆయనతో ఏ ప్రొడ్యూసర్‌ అయిన సినిమా చేయడానికి రెడీగా ఉండే పొజిషన్‌లోకి వచ్చారు. 'అష్టాచమ్మా', 'అలామొదలైంది' చిత్రాల తరువాత పూర్తిగా కొత్త ఫార్మెట్‌లో సినిమాలు చేశాను. మారుతి కూడా అంతే. ఆయన చేసే సినిమాలు రొటీన్‌గా ఉండవు. ఈ సినిమాతో మారుతి ఒరిజినల్‌ ఫ్లేవర్‌ ఏంటో తెలుస్తుంది. డైరెక్టర్‌ గా ఆయనకు ఈ సినిమాతో మంచి టర్నింగ్‌ పాయింట్‌ వస్తుంది. 
 
ప్రశ్న: టైటిల్‌కు అర్థమేమిటి? 
జ : భలే భలే మగాడివోయ్‌ అనే టైటిల్‌ చూసి అందరూ పొగడ్త అనుకుంటున్నారు.. కాని అది పొగడ్త కాదు తిట్టు. ఎవరికైనా మన చేష్టలతో విసుగొస్తే ఎవడ్రా బాబు వీడు అని తిట్టుకుంటారు. ఈ సినిమాలో హీరోకు ఉన్న మతిమరుపు సమస్యతో తన అనుకున్న పనిచేసే విషయంలో ఎలా సక్సెస్‌ అయ్యాడో చూపిస్తున్నాం కాబట్టే ఈ టైటిల్‌ను పెట్టాం. ఈ సినిమా చూసిన తరువాత యాప్ట్‌ టైటిల్‌ అని అందరూ అనుకుంటారు. 
 
ప్రశ్న: లావణ్య ఎలా నటించింది? 
జ : లావణ్య త్రిపాఠి టిపికల్‌ డాల్‌లా కాదు. చాలా రియలిస్టిక్‌‌గా నటిస్తుంది. తను ఒక పాత్రలో నటిస్తున్నంతసేపు నిజంగా తన క్యారెక్టర్‌ అంతేనేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌‌లో పర్ఫెక్ట్‌‌గా సెట్‌ అయింది. తనని తప్ప ఆ రోల్‌‌లో వేరే వాళ్ళని ఊహించుకోలేం. 
 
ప్రశ్న: మ్యూజిక్‌ ఎలా వుంది? 
జ : మొదటిసారి సినిమాలో పాటలు విన్నప్పుడు బావున్నాయి అనుకున్నాను. ఆడియో రిలీజ్‌ అయిన తరువాత సాంగ్స్‌ అందరికి కనెక్ట్‌ అయ్యాయి. గోపిసుందర్‌ పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌. బెంగుళూరు డేస్‌ సినిమా నుంచి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ ని. ఈ సినిమా కోసం ఎనర్జిటిక్‌ మాస్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. తెలుగులో కూడా అయన పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతారు. 
 
ప్రశ్న: రీమిక్స్‌ సాంగ్‌ వుందా? 
జ : ఈ సినిమాకి భలే భలే మగాడివోయ్‌ టైటిల్‌ పెట్టగానే కమల్‌ హాసన్‌ గారి సినిమాలోని పాటను రీమిక్స్‌ చేస్తున్నారేమో అనుకున్నారు. అంత మంచి క్లాసీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయడం మాకిష్టం లేదు. కాని ఆ పాట మాత్రం ఇందులో చాలా సార్లు వినిపిస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం ఫోన్‌లో డ్రామా జరుగుతుంటుంది. ఆ ఫోన్‌ రింగ్‌ టోనే భలే భలే మగాడివోయ్‌ పాట. 
 
ప్రశ్న :  ఈగ తర్వాత కథల ఎంపికలో లోపం వుందా? 
జ : ఈగ సినిమా తరువాత డిఫరెంట్‌ పాత్‌ సెలెక్ట్‌ చేసుకున్నాను. ఓల్డ్‌ సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో పైసా, సోల్‌ సెర్చింగ్‌ అనే కాన్సెప్ట్‌తో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలు చేసాను. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసినప్పుడే నాకు ఆ సినిమా పర్టిక్యులర్‌ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియన్స్‌కు మాత్రమే రీచ్‌ అవుతుందని తెలుసు. నాకు అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన వారందరూ కంగ్రాట్స్‌ చెప్పకుండా థాంక్స్‌ చెప్పేవారు. 
 
ప్రశ్న:  కొత్త దర్శకులు ఎవరు రాలేదా? 
జ : అబ్బో చాలామంది వచ్చారు. వారు ఆ కథలు చెబుతుంటునే ఒక్కోసారి విసుగుపుట్టేది. నేను వింటున్నట్లు నటించేవాడిని ఓ దర్శకుడు వచ్చి అందరూ హాలీవుడ్‌ సీడీలు చూసి ఇన్‌స్పైర్‌ అయి కథలు రాసుకువస్తారు. నేను అలా కాదు ఎందుకు నచ్చలేదో తెలుసుకుని అందులో మనం ఏం మార్పులు చేయాలో.. ఆలోచిస్తాను.. అన్నాడు.. దాంతో ఆయన కథ కూడా అలాగే వుంటుందని తిరస్కరించాను. 
 
ప్రశ్న: చిత్రంలో వున్నట్లే మతిమరుపు నిజంగా వుందా? 
జ : నేను ఈ సినిమా కథను స్నేహితులకు చెప్పాను.. అరే.. అది మా కథే అన్నారు. మతి మరుపుల అనేది అందరికీ వుంటుంది. మనకు ఇష్టంలేని విషయాలపై మనస్సు వెళ్ళదు. నేను కూడా అంతే.. 
 
ప్రశ్న : మీ భార్య దీనిపై ఎలా స్పందించేవారు? 
జ : ఆమె నా గురించి ఓ నిర్ణయానికి వచ్చేసింది. నాకు ఏదో విషయం చెబుతుంది. నేను వింటున్నానో. లేదో టెస్ట్‌ చేస్తుంది. నేను వూ..వూ.. అటూ వూ.. కొడతాను. కానీ కాసేపటికి నా మైండ్‌ వేరే విషయంపై వెళ్ళిపోతుంది. నన్ను టెస్ట్‌ చేయాలని.. ఓసారి ఇంటి విషయాలు చెబుతూ వెంటనే మా చెల్లి కూతురు ఎగురుకుంటూ ఇంటికి వచ్చింది. వెంటనే నీళ్లుతాగి విమానంలోకి వెళ్ళిపోయింది అంటూ చిత్రంగా మాట్లాడుతుంది. అప్పుడుకూడా నేను వింటున్నట్లు 'వూ...కొడితే.. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నా మైండ్‌ ఇక్కడలేదని. 
 
ప్రశ్న: మరి కథలు వినేటప్పుడు ఎలా వింటారు? 
జ : అప్పుడు పక్కాగా వింటాను. ఎందుకు ఏమిటి? అనేది చెప్పలేను.కానీ.. ఒక్కోసారి మైండ్‌ ఎక్కువసేపు కాన్‌సన్‌ట్రేషన్‌ చేయదు. ఇది చాలామందికి వుంటుందట. 
 
ప్రశ్న: మరి భిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన 'ఎవడే.. మీకు ఏమి నేర్పింది? 
జ : చాలా నేర్పింది... మా తరమే అదృష్టవంతులం. టెక్నాలజీ అంతా వుంది. మా ముందుతరం దురదృష్టవంతులు. కనీసం ఫోన్లుకూడా లేవు. ఎంజాయ్‌మెంట్‌ లేదు. అనుకునేవాడిని.. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్‌ కోసం 37 మంది హిమాలయాలకు వెళ్లాం. బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. ఫోన్లు పనిచేయవు. అక్కడ స్నానం చేయడానికి లేదు. రూమ్‌లు లేవు. అందరం కలిసి ఒకేచోట టెంట్‌ వేసి నిద్రపోయేవాళ్ళం. లైట్‌బాయ్‌నుంచి అందరూ ఫ్రెండ్స్‌ అయ్యారు. వారి చిన్నప్పటి సంగతులు. నా విషయాలు ఒకరికొకరు షేర్‌ చేసుకున్నాం. ఎన్నో కథలు, జీవితాలు అందులో వున్నాయి. అవన్నీ చాలా సరదాగా.. ఆనందంగా షేర్‌ చేసుకుంటూ.. అంత్యాక్షరి లాంటివి ఆడుకుంటూ.. ఎంజాయ్‌ చేశాం... ఆ జర్నీ.. ఇప్పటికీ కళ్ళముందు కన్పిస్తుంది. కానీ ఇక్కడికివచ్చాక.. అంతా హైటెక్‌ కల్చర్‌.. నేను ఎవరితోనైనా మాట్లాడినా.. ఫోన్‌తో ఆడుకుంటూనే వుండేవాడిని.. కానీ.. అందులో లేని ఆనందంగా... హిమాలయాల్లో న్పించింది. దాంతో.. మాకంటే.. ముందు తరం అదృష్టవంతులు అనిపించింది. 
 
ప్రశ్న: రాజమౌళి సపోర్ట్‌ చేస్తున్నారు? 
జ : ఈగ సినిమా తరువాత నేను చాలా సినిమాల్లో నటించాను. కాని ఏ సినిమాకు రాజమౌళి గారు నాకు సపోర్ట్‌ చేయరు. నా సినిమా రిలీజ్‌ అయిన మొదటిరోజు ఆయన తన ఫ్యామిలీతో సినిమా చూస్తారు. అదే ఆయన నాకిచ్చే సపోర్ట్‌. అయితే ఈ సినిమా ట్రైలర్‌ చూసి ఆయన జెన్యూన్‌ గా ఎగ్జైట్‌ అయ్యారు. అందుకే ట్విట్టర్‌ పోస్ట్‌ చేసారు. 
 
ప్రశ్న: 'భలే భలే..' ఎలా వుంది? 
జ : మా అక్క అమెరికా వెళ్ళిపోతుందని ఈ సినిమా షో వేసి చూపించాను. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంది. అక్కకి 'పైసా' సినిమా కూడా చూపించాను కాని నచ్చలేదని చెప్పేసింది. ఈ సినిమా చూసి చాలా బావుంది డెఫినిట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. హిట్‌ కాకపోతే నీ సినిమాలకు నేను జడ్జిమెంట్‌ చెప్పనని చెప్పింది. తన రియాక్షన్‌తో నాకు కాన్ఫిడెన్స్‌ ఇంకా పెరిగింది. 
 
ప్రశ్న: అల్లు అరవింద్‌ ఏమన్నారు? 
జ : ప్రభాస్‌గారు సినిమా చూసి చాలా ఎంజాయ్‌ చేశారు. అలాగే బన్ని కూడా ఎడిటింగ్‌ టైమ్‌లో సినిమా చూశారు. త్వరలోనే ఫస్ట్‌ కాపీ చూడబోతున్నారు. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. అల్లు అరవింద్‌గారు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. 
 
ప్రశ్న: ముందు కూడా నిర్మాతగా వుంటారా? 
జ : 'డి ఫర్‌ దోపిడీ' సినిమాకు నేను ప్రొడ్యూసర్‌ అయిన నేను ప్రొడ్యూస్‌ చేసిందేమీ లేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకు వచ్చిన నాకు కొబ్బరికాయ కొట్టడం నుండి గుమ్మడికాయ కొట్టడం వరకు అంతా తెలుసు. కాని ప్రొడక్షన్‌ గురించి అసలు ఐడియా లేదు. డి ఫర్‌ దోపిడీ సినిమాతో మంచి లెర్నింగ్‌ ఎక్స్పీరియన్స్‌ కలిగింది. ఫ్యూచర్‌ లో ప్రొడ్యూస్‌ చేస్తే చేస్తాను. 
 
ప్రశ్న: బాలయ్య ఫాన్ సినిమా టైటిల్‌ ఏమిటి? 
జ : హిందూపూర్‌‌లో హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నా చేతికి జై బాలయ్య అనే టాటూ చూసి అదే సినిమా టైటిల్‌ అని అక్కడ వారంతా అనుకున్నారు. నిజానికి సినిమా టైటిల్‌ అది కాదు. 
 
ప్రశ్న: ఈసారి నటుడిగా స్పీడ్‌ పెంచారే? 
జ : 2013లో నా సినిమాలు రిలీజ్‌ కాలేదు. 2014 లో రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. 2014లో రిలీజ్‌ అవ్వాల్సిన ఓ సినిమా 2015లో విడుదలయ్యింది. అప్పుడు ఒక ఫార్మాట్‌ ఉండేది. ప్రతి ఎనిమిది నెలలకు ఓ సినిమా విడుదలవుతుంది. పెద్ద ప్రాబ్లం ఉండదనుకున్నాను. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సినిమా సినిమాకు మధ్య గ్యాప్‌ పెరిగిపోవడం వలన నేను అనుకున్నట్లుగా సినిమాలు చేయలేకపోయాను. ఇక నుండి అలా కాకుండా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తా. ప్రస్తుతం మూడు నాలుగు కథలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. బాగా నచ్చిన కథలవి.. అని చెప్పారు.