నేను కూరలో ఉప్పు లాంటి వాడిని : బ్రహ్మానందం ఇంటర్వ్యూ

Brahmanandam
IVR| Last Modified బుధవారం, 23 జులై 2014 (21:31 IST)
సినిమాల్లో తాళింపు లాంటివాడు కమేడియన్‌. అది ఎక్కువ తక్కువగా ఉన్నా... రుచి తేడా వచ్చినట్లే... పాత్రల్లో ఏమాత్రం అటూఇటూ అయినా... కమేడియన్ వెకటు పుట్టిస్తాడు. హాస్యనటుడ్ని సరిగ్గా మలుచుకుని చేసేవాడు దర్శకుడు. తను ఎలా చెబితే అలా చేయడమే అతనికి తెలుసు. చాలా చిత్రాల్లో కమేడియన్లు కీలక పాత్ర పోషిస్తారు. సినిమా విజయాల్లో... అయితే
కొంతకాలం కొంతమందిని చూడవచ్చు. కానీ ఆ తరం ఈ తరం అంటూ లేకుండా ఇప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ ‌1 కెమేడియన్‌ ఏలుతున్న బ్రహ్మానందం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆయనపై విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని అస్సలు పట్టించుకోనంటున్న బ్రహ్మానందంతో జరిపిన ఇంటర్వ్యూ...

సినమాల్లో హాస్య నటుడు పని ఎంతవరకు?
ఒకరకంగా చెప్పాలంటే... దర్శకుడు చెప్పింది చేయడమే హాస్యనటుడిది. అసలు ఎటువంటి నటుడైనా దర్శకుడే ఆయన పాత్ర గురించి చెబుతాడు.. దాన్ని మలుచుకుని చేయడమే నటన. హీరోలు ఎంత బాగా చేసినా.. కూరలో ఉప్పు లాగా హాస్యం లేకపోతే.. రుచి వుండదు. అందుకే ఆ బాధ్యతను హాస్యనటులు పోషిస్తారు.

భిన్నమైన పాత్రలు పోషించడం ఎలా అనిపిస్తుంది?
ఏదైనా పాత్రను పోషించి మెప్పిస్తే.. బాగా చేశాడని ప్రేక్షకులు మెచ్చుకుంటారు. అసలు ఇంకో రహస్యం ఏమిటంటే.. ఆ మెప్పించే పాత్రను ఇచ్చేది దర్శకుడే. ఫలానా పాత్ర అని చెప్పి.. ఇలా చేయి.. అంటూ చెబుతారు. కొందరైతే అస్సలు చెప్పరు. మీకు తోచిన విధంగా చేయమంటారు. చేశాక.. అది జనాల్లోకి వెళితే.. పేరు మాకు వస్తుంది... కానీ దర్శకుడికి రాదు. అదీ చిత్రం ఇక్కడ.

వినాయక్‌ దర్శకత్వంలో చేయడం ఎలా అనిపిస్తుంది?
వినాయక్‌ సీనియర్‌ దర్శకుడు. ఆయన చేసిన చిత్రాలన్నీ పెద్ద హీరోలతోనే. నా కోసం ఓ పాత్ర వుందన్నారు. పాత్ర పేరు డింపుల్‌.. వాడు చేసేది చాలా చిత్రంగా ఉంటుంది. పాత్ర చెప్పేటప్పుడు వినాయక్‌ చెప్పిన విధానం చాలా నచ్చింది. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

'అల్లుడు శీను' ఎలా చేశాడు?
అల్లుడు శీను.. అంటే ఎవరని.. నేను మొదట్లో దర్శకుడ్ని అడిగాను.. అది హీరో పేరండి... శీను అసలు పేరు. అల్లుడు అని ప్రకాష్‌రాజ్‌ అంటుంటాడు. అలా అల్లుడు శీను అయింది. అలా ఎందుకన్నాడో సినిమాల్లోనే తెలుస్తుంది అన్నారు. అల్లుడు శీను... అసలు పేరు బెల్లంకొండ శీను. వారి నాన్న బెల్లంకొండ సురేష్‌. అగ్ర నిర్మాత.. తన కుమారుడికి అన్ని విద్యలు.. అంటే డాన్స్‌, ఫైట్లు, నటన నేర్పించి తెరపైకి తెచ్చారు. తను అద్భుతమైన నటుడిగా చేశాడు. కమర్షియల్‌ హీరోగా ఎదుగుతాడనే నమ్మకముంది.

సమంత పాత్ర ఎలా ఉంటుంది?
సమంత నా దృష్టిలో బోర్న్‌ ఆర్టిస్టు... ఎటువంటి క్యార్టెర్‌ అయినా ఇట్టే చేసేస్తుంది. పాత్రలో లీనమై పోతుంది. అటువంటి నటిని చాలా అరుదుగా చూస్తుంటాము.

'రభస'లో ఎటువంటి పాత్ర చేస్తున్నారు?
ఎన్‌టిఆర్‌తో 'రభస' చేస్తున్నాను. మళ్ళీ అదుర్స్‌ తరహాలోనే మా ఇద్దరి కాంబినేషన్‌ అదుర్స్‌గా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

కొత్త హీరోతో వినాయక్‌ ఎలా చేయగలిగారు?
వి.వి.వినాయక్‌ అంటే కమర్షియల్‌ హీరోలతో చేయడం సుళువు. కానీ కొత్త హీరోతో చేయడం చాలా కష్టం. తను చాలా రిస్క్‌ చేశాడనిపించింది. అలా అని భయపడకుండా చాలా నమ్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. తనకు దర్శకునిగా లైఫ్‌ ఇచ్చిన నిర్మాత కుమారుడి నిలబెట్టడం కోసం ఆయన చేయడం చాలా ఆనందంగా ఉంది.

అగ్రహీరోలైనా సరే మీ పాత్రే హైలెట్‌ కావడానికి కారణమేమిటి?
నాకు అలా పాత్రలు వస్తున్నాయి. అలా అని నేను ఇలా రాయమని ఎవ్వరినీ అడగను. కొందరికి అదృష్టం కలిసివస్తుంది. కొన్నాళ్ళకు ప్రతిభ నిలబెడుతుంది. మరికొన్నాళ్ళకు అదృష్టమే వెంటాడుతూనే ఉంటుంది. దేవుడు అలా నన్ను మలిచాడు. పాత్రలు అలా వస్తున్నాయి. నేను ఫలానా పాత్ర రాయమని అడగను. పోనీ నాకు ఈ పాత్ర రాయండి.. అంటే రాయరు. ఏదో అలా జరిగిపోతుందంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవంతుని రాత. ఆపై వీళ్ళకు నాపై నమ్మకం. ఏ పాత్ర ఫెయిల్యూర్‌ అయినా సక్సెస్‌ అయినా అది పెద్దగా పట్టించుకోను.

మీపై వస్తున్న విమర్శలకు మీరేమి చెబుతారు?
విమర్శలు అనేవి ప్రతి ఒక్కరికీ వుంటాయి. అవి పట్టించుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఎవరికి ఎంత రాసిపెట్టుందో అంతే దక్కుతుంది. ఇదే నేను నమ్మేది. ఇంతకంటే ఏమీ చెప్పలేనని... ముగించారు.దీనిపై మరింత చదవండి :