గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (20:58 IST)

కోట్లు పెట్టి సినిమా తీసి ఆ హీరోతో పొడిపించుకోవాలా...?!!: సి. కళ్యాణ్‌ ఇంటర్వ్యూ

నిర్మాత అనేవాడు సినిమా అయ్యాక పబ్లిసిటీ ఎలా చేసుకోవాలనే హక్కు వుంది. దాన్ని కూడా కబ్జాచేస్తూ... ఒకరిద్దరికే యాడ్స్‌, బైట్స్‌ ఇస్తున్నారని గొడవ చేయడం కరెక్ట్‌కాదు.... అని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ అన్నారు. ఆయన ఉత్తమ విలన్‌ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
'ఉత్తమవిలన్‌'లో ఓ పాటకు విహెచ్‌పి వాళ్లు గొడవ చేశారు కదా?
కమల్‌ చిత్రాలంటే వివాదాలకు తెరతీస్తాయి. ఉత్తమవిలన్‌లో ఓ పాట కొంతమంది మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కానీ చిత్రం చూడకుండా ఎలా జడ్జ్‌ చేస్తారు. అందుకే సెన్సార్‌ అయ్యాక మాట్లాడాలని చెప్పాం. సెన్సార్‌ క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చింది. దాంతో వారు అర్థం చేసుకున్నారు.
 
8వ శతాబ్దపు కథ ఏమిటి?
ఇందులో 8వ శతాబ్దపు కథ వుంది. అది చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. దీన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. హిరణ్యకశపుని కథను అలాగే చెప్పాలి. వేరేగా చెబితే కుదరదు. కమల్‌ ఆ ప్రయత్నమే శాడు. ఆయనకు ఈ చిత్రంపై నమ్మం ఎంతంటే... సి.జి. వర్క్‌ చేసిన వ్యక్తి ఇక చిత్రం చేయలేను బాబో అన్నంత పారిపోయేలా కమల్‌ పనిచేయించుకున్నారు. ప్రతీ బిట్‌ను కరెక్షన్‌ దగ్గరుండి చేయించుకున్నారు. కథకుడు, కథానాయకుడు ఆయనే కాబట్టి దానిపై ఆయనకు అంత అవగాహన, శ్రద్ధ వున్నాయి.
 
ఉత్తమ విలన్‌ అంటే ఏమిటి?
ఇందులో కథానాయకుడు మంచివాడే. కానీ అతని చేసే పనులు విలనిజంగా వుంటాయి. మంచి కార్యం కోసం కొన్నిసార్లు విలన్‌లా వ్యవహించాల్సివుంటుంది. ఎక్కడైనా తప్పుజరిగితే దేవుడు శిక్షవేస్తాడు. అలా హీరో వచ్చి చేసిన పనులే ఉత్తమవిలన్‌ కథ. ఈ చిత్రాన్ని కుటుంబంతో హాయిగా చూడవచ్చు.
 
పబ్లిసిటీ ఎలా చేస్తారు? కౌన్సిల్‌నుంచి విడిగా వున్న 14మంది ప్రకారం చేస్తారా?
ఈ విషయంలో నిర్మాతకు ఫ్రీడమ్‌ వుండాలి. నా వరకు అందరూ నాకు కావాలి. ఆ 14మంది గురించి నా సినిమా విడుదలయ్యాక కూర్చొని మాట్లాడతాను.
 
కౌన్సిల్‌కు వ్యతిరేకమా?
14 మంది చేసే నిర్ణయాలు కౌన్సిల్‌కు ఇబ్బందిమాట వాస్తమే. అయితే.. వారు.. కాస్ట్‌ ఆఫ్ ప్రొడక్షన్‌ను కంట్రోల్‌ చేయాలంటే రెండు పద్ధతులున్నాయంటూ.. ఎవరికి ఏది నచ్చితే వారు అలా చేయండి అంటే బాగుండేది. అలా అనకుండా మొదటి పద్ధతిలోనే వారు తీసుకున్న నిర్ణయాలు.. మీడియా అత్యుత్సాహం చిన్నదాన్ని కొండంత చేశాయి.
 
కాస్ట్‌ కంట్రోల్‌ కోట్లు తీసుకునే హీరో, దర్శకుల నుంచి కంట్రోల్‌ చేయవచ్చుకదా?
అది చేస్తున్నారు. కౌన్సిల్‌లో నిర్ణయాలు అన్నీ వింటారు. కానీ అందులోనే కొంతమంది.. దొడ్డిదారిన వెళ్ళి అడ్వాన్సులు ఇచ్చేస్తుంటారు. ఇవన్నీ పరిష్కరించాలంటే.. కొందరు పెద్దలతో మీటింగ్‌ వేయాలి. సినిమా పూర్తయ్యేవరకు కాస్ట్ కంట్రోల్‌ చేయవచ్చు. అయ్యాక.. పబ్లిసిటీ విషయంలోనూ చేయాల్సి వుంటుంది.
 
మరి ఒకరిద్దరు ఛానల్స్‌కే హక్కులు ఇవ్వడం కరెక్టేనా?
అది నిర్మాత ఇష్టం. తనకు ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో దాన్ని చూసుకుంటాడు. ఓ ఆడియో ఫంక్షన్‌ పెడితే.. మేం ఇంత ఇస్తామని.. ఓ ఛానల్‌ ముందుకు వస్తే.. దానికే ఇస్తాం. అంతకంటే ఎక్కువ ఇస్తామని మరొకరు వస్తే అతనికి ఇస్తాం. ఇదేం రహస్యంగా జరిగేదికాదు. అన్ని ఛానల్స్‌కు వర్తమానాలు పంపి తీసుకునే నిర్ణయమిది.
 
ఇటీవలే రోజుకో ఆర్టికల్స్‌ ఇండస్ట్రీపై వస్తున్నాయి?
అవన్నీ అవసరంలేని ఆర్టికల్స్‌. పేర్లు పెట్టి రాయమనండి.. దాన్నిబట్టి నిర్మాత, హీరోను కంట్రోల్‌ అవుతారు. ఏవేవో ఊహించుకోండని ఆర్టికల్స్‌ రాస్తే.. అది నిజమైన జర్నలిజం కాదు. నేను తప్పు చేస్తే నా పేరు పెట్టి రాయండి.. దాన్ని నేను సరిచేసుకుంటాను. నా గురించి పదిమందికి తెలిసింది. పేర్లు లేకుండా ఏవేవో రాస్తే.. ముసిముసి నవ్వులకే వుపయోగపడుతుంది.
 
ఇప్పటి నిర్మాత పరిస్థితి ఎలా వుందంటారు?
చాలా బ్యాడ్‌గా వుంది. నిర్మాతకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్న ఇప్పటి పరిస్థితి చూస్తే ఇంకా 5 ఏళ్ళలో నిర్మాత కనబడడు. ఇప్పటికే ఫైనాన్సియర్లు ముందుకు రావడంలేదు. ఇండస్ట్రీలో జరిగే విషయాలు కొండంతలు చేసి చూపించడం వల్ల నష్టమే జరుగుతుంది.
 
కార్పొరేట్‌ సంస్థలు అందుకే రావడంలేదా?
కార్పొరేట్‌ సంస్థలు ఇక రావు. వారికి హీరోకు వైట్‌ ఇస్తారు. దానికి హీరో ఒప్పుకోడు. ప్రమోషన్‌కు రావాలి. దానికి ఇక్కడ ఇష్టపడరు. ఓ కార్పొరేట్‌ సంస్థ ఓ హీరోను అప్రోచ్‌ అయి రూల్స్‌ పెడితే... చంపేస్తాను. పొడిచేస్తానంటూ.. గొడవ చేశాడంటా.. ప్రమోషన్‌ గురించి రమ్మని అడిగితే.. నువ్వెవరు నాకు చెప్పడానికంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. కోట్లుపెట్టి.. వాడిచేత నేను పొడిపించుకోవడం ఏమిటని ఆ నిర్మాత కంప్లయింట్‌ చేశాడు. అదే బాలీవుడ్‌లో హీరో హైదరాబాద్‌ వచ్చి పబ్లిసిటీ చేస్తాడు. 
 
కొత్త నిర్మాతల వల్ల లాభమా? నష్టమా?
ఒక రకంగా కొత్తనీరు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కానీ ఆ నీరు మింగేస్తేనే ప్రమాదం. అదెలా అంటే.. కొత్త నిర్మాతలు వస్తే వారికి ఇక్కడి సమస్యలు చెబుతాం. అన్నీ విన్నాక.. మీరు మొదట్లో తీసినప్పుడు ఇలాంటి క్లాస్‌లు చెప్పేవారా! అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొకరు.. పోతే మా డబ్బులే పోతాయ్‌! అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.  
 
'మా' ఎన్నికపై మీరెలా స్పందిస్తారు?
ఒక పక్క నవ్వు.. మరో పక్క వేలంవెర్రిలా కొట్టుకుంటున్నారని బాధ కూడా వుంది. వెయ్యికిపైగా వున్న సభ్యులు గురించి జరిగిన ఎన్నికలులా 'మా' ఎన్నికల సమయంలో జరిగిన వాగ్వివివాదాలు.. మీడియా తంతు నవ్వు తెప్పిస్తుంది. కేవలం 350మంది సభ్యులున్న ఈ ఎన్నికలో ఓటు వేసింది కూడా తక్కువే.. దాని కోసం రాష్ట్రమంతా ఆసక్తికరంగా ఎదురుచూసేలా వుందంటే.. ఇది కేవలం సినిమా క్రేజ్‌... మురళీమోహన్‌ను ఇంతకుముందు 'గారు' అని పిలిచేవారు. కానీ ఈ ఎన్నికల తర్వాత.. ప్రతివాడూ.. 'వాడే.. మురళీమోహన్‌' అని అంటున్నారు. ఇది విని నేను భరించలేకపోతున్నాను అని ముగించారు.