శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: సోమవారం, 15 డిశెంబరు 2014 (22:09 IST)

10 వేలు అప్పు తీర్చడానికి వెయ్యి జీతం కోసం.... చక్రి ఇంటర్వ్యూ 1వ భాగం ఆనాటిది...

ఆయన ఓ 'రెడీమేడ్‌ బట్టల దుకాణం' పెట్టాలనుకున్నారు. నెలకు వెయ్యి రూపాయల వేతనంతో 'బిల్డింగ్‌ సూపర్‌వైజర్‌' జాబ్‌ దొరికితే చాలు.. అదే పదివేలనుకున్నారు. కానీ.. 'ఆ రెండూ'  దొరక్కపోవడంతో ఒక హాస్పిటల్‌లో మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. మోర్నింగ్‌ అవర్స్‌, ఈవినింగ్‌ అవర్స్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల గల డాక్టర్స్‌ను కలుస్తూ.. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవడానికి బదులు, పాటలకు బాణీలు కట్టుకుంటూ.. తన గమ్యం దిశగా ఆశాభావంతో అడుగులు వేశారు. అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా.. తను సంగీతం అందించిన తొలి చిత్రం, మలి చిత్రం విడుదలకు నోచుకోకపోయినా.. మొక్కవోని మొండిధైర్యంతో ముందుకు సాగారు. 
 
అప్పటికే 30-40 ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు సంగీతాన్ని అందించి.. సినిమా సంగీతాన్ని కాచి వడబోసిన ఆ కుర్రాడు.. పూరి జగన్నాథ్‌ పుణ్యమా అని 'బాచి' చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించాడు. ఆ చిత్రంతోనూ ఎదురుదెబ్బ తగిలినా, పూరి ప్రేరణతో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'కు కూడా సంగీతాన్నందించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకుని.. 'తెలుగు సినిమా  సంగీతం' అనే మహాగ్రంథంపై తనదైన శైలిలో 'సిగ్నేచర్‌' చేశారు... 'శభాష్‌' అనిపించుకున్నారు. ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిన చక్రి మొన్న జూన్ నెలలో పుట్టినరోజు సందర్భంగా చెప్పిన విషయాలు...
 
మా నాన్న (వెంకట నారాయణ) టీచర్‌గా పనిచేసేవారు. ఆయన మంచి సింగర్‌ కూడా. కొన్ని పాటలు తనే రాసుకుని పాడుతుండేవారు. బుర్రకథ కళాకారునిగానూ నాన్నకు చాలా మంచి పేరుండేది. మా నాన్నలో దైవభక్తి, దేశభక్తి, సేవానిరతి పుష్కలంగా ఉండేవి. ప్రతి వినాయకచవితికి వినాయకుడ్ని స్వయంగా తయారుచేసి మా ఊర్లో ప్రతిష్టిస్తుండే నాన్న.. మా వరంగల్‌ జిల్లాలోని 'కంబాలపల్లి' గ్రామంలో పాడుబడిన శివాలయాన్ని పునరుద్ధరణ చేశారు. వరదలు, తుఫాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బట్టలు, బియ్యం వంటివి సేకరించి, వాటికి తన వంతు జోడించి పంపిణీ చేస్తుండేవారు. తన ఎరుకలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ తనకు చేతనైనంత సాయం చేస్తుండేవారు. పద్దెనిమిదేళ్ళకే నేను ఒక దేశభక్తి  గీతాన్ని రాశానన్నా.. గాయకుడిగా- ముఖ్యంగా సంగీత దర్శకుడిగా నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నానన్నా... నా సంపాదనలో కొంత శాతం సేవా కార్యక్రమాలకు విరివిగా వెచ్చిస్తున్నానన్నా.. అన్నిటికీ ప్రేరణ నాన్నే. మా అమ్మ (విద్యావతి)ది కూడా చాలా మంచి వాయిస్‌. ఆవిధంగా సంగీతం నాకు జన్మత: అబ్బిందనే చెప్పవచ్చు!
 
ఏ ఫంక్షన్‌ జరిగినా పాటల ప్రోగ్రామ్‌ మనదే!
నేను ఎయిత్‌, నైన్త్‌ చదువుతున్నప్పుడే ఫ్లూట్‌ నేర్చుకునేవాడ్ని. నా సంగీత ప్రయాణానికి పునాది పడింది, నాంది పలికింది అప్పుడే. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ మరియు డిగ్రీ ఫస్టియర్‌లో వయొలిన్‌తోపాటు.. సింగింగ్‌ (కర్ణాటక వోకల్‌) నేర్చుకున్నాను. డిగ్రీ సెకండియర్‌కు వచ్చేసరికి 'సాహితి కళాభారతి' పేరిట ఒక సంస్థను నెలకొల్పి ప్రోగ్రామ్స్‌ చేస్తుండటం, పిల్లలకు ట్రైనింగ్‌ ఇస్తుండటం చేసేవాడ్ని. అప్పట్లో వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ చుట్టుపక్కల ఎక్కడ ఏ ఫంక్షన్‌ జరిగినా.. మన పాటల ప్రోగ్రాం ఉండేది. నానా పాట్లు పడి పాటల ప్రోగ్రాం చేయడం.. 'నాలుగు రూపాయలు' సంపాదించడం అప్పట్నుంచే మొదలైంది.
 
పాటల 'పోస్ట్‌మార్టమ్‌' చేస్తుండేవాడ్ని
మా నాన్న టీచర్‌ కావడంతో తరచూ బదిలీలవుతుండేవి. అందువల్ల వరంగల్‌ జిల్లా అంతా మాకు పరిచయమే. మేం మహబూబాబాద్‌‌లో ఉండేటప్పుడు మ్యూజిక్‌ ప్రాక్టీస్‌ నేను ముమ్మరం చేశాను. ఊరి చివర పెద్ద కాంపౌండ్‌లో చిన్న షెడ్డు ఉండేది. కాలేజ్‌ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో భాగంగా కట్టిన షెడ్‌ అది. ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చకపోవడంతో షెడ్డుగానే మిగిలిపోయింది. దాన్ని రెంట్‌కు తీసుకుని.. మా 'సాహితీ కళాభారతి'కి కార్యస్థానంగా మార్చుకున్నాం. చీకటి పడితే చాలు చుట్టూ వాతావరణం చాలా భయానకంగా ఉండేది. దానికితోడు కూతవేటు దూరంలో శవాలకు పోస్ట్‌మార్టం నిర్వహించే బిల్డింగ్‌ ఉండేది. హనుమాన్‌ చాలీసా చదువుకుంటూ షెడ్డులోకి వెళ్లిపోయి.. ఇంక ఓపిక లేక నిద్రలోకి జారేంతవరకు రకరకాల ఇన్‌స్ట్రు‌మెంట్స్‌తో ప్రాక్టీస్‌ చేస్తుండేవాడ్ని.
 
ఒకే జాతి మనదిరా.. ఒకే బాట మనదిరా..!!
స్కూల్‌ మరియు కాలేజ్‌లో కల్చరల్‌ యాక్టివిటీస్‌లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుండే నేను.. స్టూడెంట్‌ ఆర్గనైజేషన్స్‌లోనూ అంతే యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తుండేవాడ్ని. సినిమా ఫీల్డ్‌కు వెళ్ళాలన్న ఆలోచన అప్పట్లో ఎంతమాత్రం ఉండేది కాదు. డిగ్రీ ఫస్టియర్‌లో ఒక దేశభక్తి గీతం రాసి, దానికి ట్యూన్‌ కూడా కట్టి, ఆ పాటను పాడి ప్రైజ్‌ కొట్టడం ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. 'ఒకే జాతి మనదిరా. ఒకే బాట మనదిరా, కులభేదం లేదురా.. ఒకే కులం మనదిరా' అంటూ నేను రాసి, కంపోజ్‌ చేసి పాడిన పాట కాలేజ్‌లో నన్ను హీరోను చేసేసింది. నా 'ఫ్యాన్‌ ఫాలోయింగ్‌'కు బీజం పడింది అప్పుడే. ఇక అప్పట్నుంచే..'నీ టాలెంట్‌ అంతా ఇక్కడ వేస్ట్‌ అయిపోతోంది.. హైదరాబాద్‌ వెళ్ళి సినిమాల్లో ట్రై చెయ్‌' అంటూ ఫ్రెండ్స్‌ పోరు పెట్టడం మొదలైంది. అయితే వాళ్ళ మాటలు నేను నా చెవికెక్కించు కోలేదు. 'నేను, నా పాటలు, నా ఫ్రెండ్స్‌' అన్నట్లుగా జాలీగా గడిపేస్తుండేవాడ్ని.
 
రెడీమేడ్‌ బట్టల షాపు పెట్టేందుకు రెడీ అయ్యాను!
ఇప్పుడు వర్తించకపోవచ్చు కానీ.. అప్పట్లో టీచర్ల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. అందుకే 'బతక లేక బడిపంతులు' అనేవారు. 'ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకిమోత' అన్నట్టుగా ఉండేది వాళ్ల పరిస్థితి. అమ్మానాన్న, ఇద్దరక్కయ్యలు, నేను, చెల్లి, తమ్ముడు.. వచ్చిపోయే బంధువుల నడుమ రోజుల్ని కొంచెం కష్టంగానే వెళ్ళదీస్తుండేవాళ్ళం. అందువల్ల ప్రభుత్వోద్యోగం పట్ల నాకు పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు. అదే సమయంలో మా బంధువుల్లో ఒకరికి రెడీమేడ్‌ బట్టల షాపు ఉండేది. వాళ్ళ షాప్‌ చాలా బాగా నడుస్తూ.. ఆర్థికంగా వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు. అందువల్ల నేను కూడా రెడీమేడ్‌ బట్టల షాపు పెట్టాలని ఫిక్సయిపోయాను. 'ఎందుకురా నాన్నా.. నా జాబ్‌ నీకు వచ్చేలా చేస్తానని' నాకు నచ్చచెప్పాలని మొదట్లో చూసిన నాన్న.. నేను మొండికేయడంతో షాప్‌ పెట్టుకునేందుకు నాకు సపోర్ట్‌ చేయాలని డిసైడయ్యారు. పగిడీ (అడ్వాన్స్‌) ఇచ్చేందుకు బ్యాగులో డబ్బులు పెట్టుకుని మరీ తిరిగాం. కానీ షాపు దొరకలేదు. దొరికుంటే జీవితం ఎలా ఉండేదో..??
 
చెవినిల్లు కట్టుకొని పోరు పెట్టడంతో...
చెవిలో ఇల్లు కట్టుకొని మరీ పోరు పెట్టినట్టుగా నా ఫ్రెండ్స్‌, నా వెల్‌విషర్స్‌ అందరూ 'నువ్వుండాల్సింది ఇక్కడ కాదు. హైదరాబాద్‌లో. నువ్వు పాటలకు బాణీలు కట్టాల్సింది.. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ల కోసం కాదు సినిమాలకు' అంటూ ఒత్తిడి చేయడంతో 'సరే ముందు ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేద్దాం' అని డిసైడయ్యి.. ఓ పది వేలు అప్పు చేసి మరీ ఎర్రబస్సెక్కి హైదరాబాద్‌ చేరుకున్నాను. స్టేజ్‌తో నిమిత్తం లేకుండా మైకు పట్టుకుని మైకం పూనినట్లు పాటలు పాడటం, చప్పట్ల వర్షంలో తడిసి ముద్దవడమే తప్ప.. ఓ పాటను ఎలా రికార్డ్‌ చేస్తారో ఎంతమాత్రం తెలియని నేను ఫిలింనగర్‌లో పిచ్చెక్కినట్టుగా తిరిగాను. అలా తిరుగుతూ తిరుగుతూ ప్రేమలో పడిపోయాను.. హైదరాబాద్‌ నగరంపై. హైదరాబాద్‌ వాతావరణం, ఇక్కడి 'హడావిడి' నాకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఎవరినీ పట్టించుకునే తీరిక లేకుండా, ఎవరి పనులతో వాళ్లు బిజీ బిజీగా గడిపేస్తుండడం నన్నెందుకో బాగా ఆకట్టుకుంది. ఆల్బమ్‌ రికార్డింగ్‌ కోసం వచ్చిన నేను హైదరాబాద్‌లో సెటిల్‌ అవ్వాలని ఫిక్సయిపోయాను. 
 
పది వేలు అప్పు తీర్చడం కోసం వెయ్యి రూపాయల జీతానికి...
ఎలాగైతే పదివేలు ఖర్చు చేసి 'పండు వెన్నెల' అల్బమ్‌ రికార్డింగ్‌ చేయించాను. ఆ ఆల్బమ్‌ ద్వారా కనీసం పాతిక ముప్పై వేలు రాబట్టాలని ఆశపడ్డ నాకు- కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. 'చాలా బాగున్నాయంటూ' ఒకటికి పదిసార్లు మెచ్చుకునేవాళ్ళే తప్ప పది రూపాయలు చేతిలో పెట్టి తీసుకునేవాళ్ళు లేకపోయారు. అందువల్ల ఆల్బం ఆలోచన తాత్కాలికంగా పక్కన పెట్టి- ఆల్బం కోసం చేసిన అప్పు తీర్చడం కోసం జాబ్‌ చేయాలని తీర్మానించుకున్నాను. రఘువీర్‌ అని మా ఊర్లో ఒక బిజినెస్‌మేన్‌ ఉన్నారు. ఆయన రిఫరెన్స్‌తో హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఓ బిల్డింగ్‌కు సూపర్‌వైజర్‌గా జాయిన్‌ కావాలని వెళ్ళాను. అయితే సూపర్‌వైజర్‌గా కాదు, ఆ బిల్డింగ్‌లో ఉన్న ఫ్లాట్స్‌ అమ్మడానికి మార్కెటింగ్‌ చేయమన్నారు. ఆరోజు జూన్‌ 14 సాయంత్రం. తెల్లారితే నా పుట్టినరోజు. బర్త్‌డే గిఫ్ట్‌గా జాబ్‌లో జాయినవ్వచ్చని ఎంతో ఆశపడ్డాను. అప్పటికి హైదరాబాద్‌ ముక్కూమొహం కూడా తెలియని నాకు.. అపార్ట్‌మెంట్స్‌ అమ్మి పెట్టడమంటే అంత 'వీజీ' కాదనిపించింది. వెంటనే ఇంకో ఫ్రెండ్‌ ఇంటికి వెళ్ళిపోయాను.