గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 20 జూన్ 2015 (21:04 IST)

సినిమాల వైఫల్యమే టీవీ విజయం... పవన్ సినిమా గురించి ఇప్పుడు చెప్పను.. దాసరి

ఒకప్పుడు బొబ్బిలిపులి, జస్టిస్‌ చౌదరి వంటి ఎన్నో కథల్లో సమాజాన్ని మేలుకొల్పిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు. క్రమణా సినిమాల్లో వచ్చిన మార్పులు ఆయనలో వచ్చిన మార్పులకనుగునంగా సినిమాలకుదర్శకత్వం వహించడం మానేశారు. అయితే ఇప్పటి తరానికి దగ్గరగా కూడా తీయగలనని 'ఫూల్స్‌' చిత్రాన్ని తీసి ఫెయిల్యూర్‌ చవిచూశారు. ఆ తర్వాత బాలకృష్ణతో తీసి ఫెయిలయ్యారు. ఆ సమయంలోనే టీవీ నిర్మాణం వైపు వెళ్లాలన్న ఆలోచనతో టీవీ రంగంలోకి వచ్చారు. 'అభిషేకం' అనే సీరియల్‌ను తీసి 2000 ఎపిసోడ్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా శనివారంనాడు ఆయనతో జరిగిన చిట్‌‌చాట్.
 
బుల్లితెరపై వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది?
బుల్లితెర నాకేం కొత్తకాదు. దూరదర్శన్‌ తప్ప మరో ఛానల్ తెలీని రోజుల్లోనే 'విశ్వామిత్ర' అనే ధారావాహిక తీశాను. అప్పట్లో బీటాకామ్‌ కెమెరా ఉపయోగించి తీసిన మొదటి సీరియల్‌ అదే. ఆ తర్వాత టీవీ జోలికి వెళ్ళలేదు. తర్వాత్తర్వాత టీవీల్లోనూ మార్పులు వచ్చాయి. ఆ సమయంలో మా ఆవిడ పద్మ మాత్రం మీరు టీవీ సీరియల్స్‌ తీయాలండి అంటుండేది. తనకు సీరియల్స్‌ అంటే ఇష్టం. చాలాసార్లు ప్రయత్నించా. కానీ సఫలం కాలేదు. ఆఖరికి అభిషేకం ఆమె కోసం తీశాను. ఆమెచేత ప్రారంభించాను. ఇప్పటికి 2వేలు పైగా నడుస్తోంది. చాలా ఆనందంగా వుంది.
 
టీవీ సీరియల్స్‌లో ఏడుపులు, పెడబొబ్బలు, అత్తాకోడళ్ల హింసలు ఎక్కువగా వుంటాయంటారు?
అవేవీ లేని సీరియల్‌ ఇది. ముందుగానే పద్మ చెప్పినట్లు చక్కటి కుటుంబకథా చిత్రం తీయాలని అనున్నాను. దానికి రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు ఇచ్చిన కథ. ఆయన్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. తను రాసిన పాత్రలు, సన్నివేశాలు ధారావాహికకు ప్రాణం పోశాయి.
 
మీ శిష్యులు ఎంతోమంది వున్నారు. వారికి సీరియల్స్‌ ద్వారా అవకాశాలు ఇస్తున్నారా?
ఒక్కో సీరియల్‌కు చాలామంది దర్శకులు మారుతుంటారు. ఈ సీరియల్‌కూ అంతే. అంతా నా శిష్యులు. ఎవ్వరూ మారినా కథలోని పాయింట్‌ మారదు. అంతకుముందు ఏ సీన్‌ ఉన్నా కాని కంటెన్యూగా తీస్తారు. ఒకరకంగా ఎన్నో సినిమాలు తీసి ఖాళీగా వున్న సీనియర్‌ దర్శకులు టీవీ సీరియల్స్‌ వైపు వెళితే.. మంచి ఫలితాలు సాధిస్తారు.
 
అనువాద సీరియల్స్‌ చాలా రిచ్‌గా వుంటన్నాయని ప్రేక్షకులు అంటున్నారు?
నేను అనువాద సీరియల్స్‌కు వ్యతిరేకిని. బాలీవుడ్‌ సీరియల్స్‌ పరిమితులు వేరు. బడ్జెట్‌ వేరు. అక్కడి పద్ధతులు లొకేషన్లు వేరు. అంతపెట్టి మన తెలుగు సీరియల్స్‌ తీయలేం. అసలు.. మనకు భాషాభిమానం వుండాలి. కన్నడలో అస్సలు డబ్బింగ్‌ సీరియలే వుండదు. కారణం అక్కడివారికి భాషపై మమకారం. అది మనకు రావాలి. నేను మొదటినుంచి మొత్తుకుంటున్నది అదే.
 
సినిమాలకు మహిళలు రావడం లేదు కారణం?
కుటుంబ ప్రేక్షకులు ఇంటికే పరిమితం అయ్యారు. టీవీని వదిలి బయటకు రావడంలేదు. దానికి కారణం సినిమాల వైఫల్యమే. సినిమాతో మనం కావాల్సిన వినోదాన్ని మంచి సంబంధాల్ని అందించడంలో ఫెయిల్‌ అయ్యాం. అవన్నీ సీరియల్స్‌ ఇస్తున్నాయి. దానికి ఉదాహరణే అభిషేకం సీరియల్‌ ఆదరణ. బహుశా దక్షిణాదిలో ఇంతపెద్ద సీరియల్‌ లేదని చెప్పగలను.
 
పవన్‌ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
ఇప్పుడు దాని గురించి చెప్పదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను అని ముగించారు.