శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (21:41 IST)

పోయినవన్నీ బన్నీతో తిరిగి వచ్చాయి...‌: మారుతి ఇంటర్వ్యూ

ఈ రోజుల్లో సినిమాతో సినీ దర్శకుడిగా కెరీర్‌ను ఆరభించిన మారుతి.. నానితో 'భలేభలే మగాడివోయ్‌'తో ముందుకు వస్తున్నారు. ఈ నెలలోనే ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈలోగా ఆయన నిర్మాతగా శంకర్‌ సమర్పణలో వచ్చిన 'కప్పల్‌' సినిమాను తెలుగులో 'పాండవుల్లో ఒకడు' పేరుతో మారుతి అనువదించారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆయన తెలియజేస్తున్నారు. ఈ సందర్భగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
 
'పాండవుల్లో ఒకడు' అంటే ఏమిటి? 
'స్నేహం, లవ్‌, మ్యారేజ్‌ అంశాల చుట్టూ అల్లిన కథ ఇది. ఓ చిన్న లైన్‌ తీసుకుని తమిళంలో తీశారు. ఇది ఐదుగురు స్నేహితుల కథ. భారతంలో ద్రౌపది ఐదుగురు భర్తలను చేసుకుంటుంది. ఈ కథలో ఐదుగురు స్నేహితులు తమ స్నేహం జీవితాంతం ఇలాగే కొనసాగాలంటే అందరూ ఒక అమ్మాయినే పెండ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ తర్వాత వైభవ్‌ ప్రేమలో పడతాడు. మిగిలిన నలుగురు ఎలా అడ్డుపడ్డారన్నది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది.
 
మొదట్లో రీమేక్‌ అన్నారు?
ఈ సినిమాను రీమేక్‌ కంటే డబ్బింగ్‌ బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చాం. దానికి నా స్నేహితులు కూడా సినిమా చూసి డబ్బింగ్‌ బెటర్‌ అన్నారు. ఈ విషయాన్ని శంకర్‌కు తెలియజేస్తే .. ఏదైనా సాయం కావాలంటే చేస్తానన్నారు. ఆయన సినిమా ఇవ్వడమే పెద్ద సాయం మాకు.
 
ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? 
ఈ సినిమా విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషగా వున్నారు. పెద్దగా పబ్లిసిటీ ఇవ్వకపోయినా మౌత్‌ టాక్‌తో బాగా ప్రచారం జరిగింది.
 
నాని చిత్ర ఎంతవరకు వచ్చింది?
నాని హీరోగా 'భలేభలే మగాడివోయ్‌' చిత్రాన్ని రూపొందించాను. సినిమాపై నాని చాలా సంతోషంగా వున్నాడు. ఆర్టిస్టుగా అన్ని కోణాలను ఆవిష్కరించే నటుడు ఆయన. నానికి సరిపోయేపాత్ర ఇది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలో ఆడియోను, సినిమా విడుదల చేస్తాం.
 
ఈ కథను బన్నీకి అనుకున్నారా?
ఈ కథ అల్లు అర్జున్‌, నాని, శర్వానంద్‌ వయస్సువారికి కరెక్ట్‌గా సరిపోతుందని భావించాం తప్పితే బన్నీకే అని అనుకోలేదు. ఈ కథను ముందుగా అల్లు అరవింద్‌గారికి చెప్పాను. ఆయన వినగానే తెగ నవ్వేశారు. ఈ కథను నానిని ఊహించుకోమని అల్లు అరవింద్‌కు చెబితే హ్యాపీగా ఫీలయ్యారు. 'పిల్ల జమిందార్‌, 'భీమిలీ కబడ్డీ జట్టు'కు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇందులో వుంటుంది.
 
ఫ్రెండ్‌షిప్‌కు మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
కష్టసుఖాల్లోనూ సుఖదు:ఖాల్లోనూ అండగా నిలిచేవాడే అసలైన స్నేహితుడు. నా దృష్టిలో బంధువులకన్నా స్నేహబంధం గాఢమైంది. నాకు బన్నీ(అల్లు అర్జున్‌) మంచి స్నేహితుడు. సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది తనే. 'ప్రాణం' సినిమా పంపిణీదారుడిగా ఆర్థికంగా నష్టపోయాను. అలాంటి సమయలో 'ఆర్య' సినిమా చేస్తున్న బన్నీ.. నాకు ఆ సినిమాకు డిస్ట్రిబ్యూషన్‌ అవకాశం ఇచ్చాడు. దాంతో పోయినవన్నీ తిరిగి పొందాను. ఫ్రెండ్‌షిప్‌కు నిదర్శనం బన్నీ.
 
బన్నీతో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
ఇంకా కథ అనుకోలేదు. అంతా కుదిరితే తప్పకుండా చేస్తాను.