శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (18:45 IST)

తేజ ఓ కొండచిలువ... వాడేంటి చెప్పేది బొ... అనేవాడు: కళ్యాణి కోడూరి ఇంటర్వ్యూ

కళ్యాణ మాలిక్‌గా తెలుగు చిత్రానికి పరిచయమైన కీరవాణి సోదరుడు గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. ఆ తర్వాత  కళ్యాణి కోడూరుగా మార్చుకున్నారు. ఇది న్యూమరాలజీనిబట్టి కాకుండా... ఏదో మార్చాలని మార్చుకున్నా... అంటున్న ఆయన తాజాగా 'బాహుబలి'లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు ఉడతసాయం చేశానని చెబుతున్నారు. ఆయన లేటెస్ట్‌గా తేజ దర్శకత్వంలో 'హోరాహోరీ' అనే చిత్రానికి బాణీలు కట్టారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతుంది. పైగా తేజతో పనిచేయడం నరకమని చెబుతున్న ఆయనతో ఇంటర్వ్యూ...
 
తేజతో సినిమా చేయడం ఎలా జరిగింది?
నేను తేజ సినిమాలో చేయాలని చాలాసార్లు ప్రయత్నించాను.. కానీ అప్పుడు సాధ్యపడలేదు. రంజిత్‌ మూవీస్‌ నిర్మాత దామోదరప్రసాద్‌ హోరాహోరీ తీశారు. ఆయన సినిమాకు నేను పని చేశాను. ఈ సినిమాను నాకంటే తేజకు హిట్‌ రావాలని కోరుకుంటున్నాను.
 
తేజకు కోపం ఎక్కువంటారు?
నాకూ ఎక్కువే. సినిమాకి పనిచేసేటప్పుడు దెబ్బలాటలు, కీచులాటలు జరిగాయి. ఓ దశలో మానేద్దామనుకున్నాను. అప్పటికే 4 పాటలు పూర్తయ్యాయి. అటూఇటూ కాకుండా పోతుందని మళ్ళీ కాంప్రమైజ్‌కు రావడం జరిగేది.
 
'జయం'లో ట్రెండ్‌కు ఇప్పటికి తేడా వుందికదా?
చిత్రం, జయం వంటి చిత్రాలకు సక్సెస్‌ గీతాలే. దానికి ఆర్‌.పి. పట్నాయక్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నేనూ అటువంటివి ఇస్తానా లేదా? అనుకున్నాను. తేజ కోరినట్లు బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాను. నాపై కాన్ఫిడెన్స్‌ పెరిగింది.
 
అసలు తేజ ఎలాంటి ఇబ్బందిపెడతాడు?
తేజ 24 గంటలు తన టీమ్‌ను తన దగ్గరే కూర్చోవాలంటాడు. అదెలాగంటే కొండచిలువ నలిపేసినట్లు పిండేస్తాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఐడియాలు రావు. ట్యూన్స్‌ చేయలేం. ఫ్రీడం ఇవ్వడు. అందుకే గొడవలు జరుగుతాయి. ఓ దశలో ఒకొరికొకరు తిట్టుకుని కొట్టుకునేవరకు వెళ్ళేది.. వెంటనే ఛీ.. వీడి సినిమా చేయకూడదని వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత రాత్రి బాగా ఆలోచించి... మళ్ళీ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని సిట్యువేషన్‌ పరంగా అలా జరిగిందని సమర్థించుకునేవాళ్ళం.
 
అసలు అంత గొడవపడి ఎలా కలుసుకునేవారు?
మా ఇద్దరికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాకేష్‌ మీడియేటర్‌.. ఒక దశలో వాడేంటి చెప్పేది బొ... నాకు చెప్పొచ్చేది... పోరా.. పోతే.. అంటూ తిట్టేవాడు. ఇలా వుంటాయి. ఆయన మాటలు. ఇంత తిట్లు తిని వీడితోనా.. ఇన్నాళ్ళు చేయాలనుకుంది అనిపించేది. దాంతో ఇక వీడి మొహం చూడకూడదు అనుకునేవాడిని. ఆ తర్వాత రాకేష్‌ వచ్చి.. సార్‌! ఏదో జరిగిపోయిందని మా ఇద్దరి మధ్య కాంప్రమైజ్‌ చేసేవాడు.
 
హోరాహోరీలో మాస్‌ మెలోడి కలిపారే?
మాస్‌ బీట్‌తోపాటు మెలోడి వుంటేనే ఇప్పటి యూత్‌ చూస్తారు. నాకు నచ్చిన సాంగ్‌ 'చచ్చిపోవాలనుంది..' అనే పాట. అది ఒక్క నిముషంలో ట్యూన్‌ కట్టేశాను.. వెంటనే హమ్‌ చేసి వినిపిస్తే.. తేజ ఓకే చేసేశాడు. 
 
మళ్ళీ తేజతో సినిమా చేస్తారా?
నాకు నచ్చితేనే చేస్తాను. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఆలోచిస్తాను. ఒకవేళ చేయలేకపోవచ్చు కూడా.
 
ఓ పాటలో బూతులు విన్పించాయి?
ఏది చేసినా.. దర్శకుడి టేస్ట్‌బట్టే చేయాలి. ఫలానా ట్యూన్‌ కావాలి అని అంటే.. సాహిత్యం అనుగుణంగా చేయాలి. ఓ పాటలో డబుల్‌ మీనింగ్‌ వుంది. తెలిసి దానికి ట్యూన్‌ కట్టాల్సివచ్చింది.
 
'అలా మొదలైంది' తర్వాత గ్యాప్‌ తీసుకున్నారే?
ఏడాది ఖాళీగా వున్నా. మంచి సక్సెస్‌ సినిమా. ఆ తర్వాత ఎవ్వరూ నాకు ఫోన్‌ చేయలేదు. మళ్ళీ ఆ బేనర్‌ వారే అంతకుముందు ఆ తర్వాత అవకాశం ఇచ్చారు. 
 
మీరు చిత్రాలు చేయరని నిర్మాతలు అనుకున్నారా?
అదెలా వచ్చిందో కానీ.. ఓ రూమర్‌ వచ్చేసింది. అవకాశాలు వస్తే ఎందుకు చేయను.
 
ట్యూన్స్‌ ఏ బేస్‌మీద చేస్తారు?
పాటలకు బాణీలు కట్టడానికి నన్ను ట్యూన్‌ చేసింది డబ్బే. నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి. నా బాధ్యత సక్రమంగా నెరవేర్చాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకోవాలి. బ్యాలెన్స్‌ ఎక్కువైతే నా నుంచి మ్యూజిక్‌ కూడా చచ్చిపోతుంది కూడా. ఏదైనా ఇక్కడ డబ్బే..
 
బాహుబలిలో బ్యాక్‌గ్రౌండ్‌కి మీ పేరు వేశారు?
అవును.. నేను దానికి ఉడత సాయం చేశాను. అంతా అన్నయ్య కీరవాణి చేశాడు. నాది కిరాణా కొట్టు అయితే.. అన్నయ్య ఓ షాపింగ్‌ మాల్‌.
 
ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేయాలని అనిపించలేదా?
ఇప్పుడిప్పుడే దాని అవసరం తెలిసింది. తప్పకుండా చేస్తాను. కొత్త సంపాదనదారుల్లో అది ఒకటి. నాకంటూ సెపరేట్‌ మార్కెట్‌ ఏర్పర్చుకోవాలని వుంది. ముందు ఆడియో చేసి.. తర్వాత వీడియో కూడా చేస్తా. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను.
 
ఎఫ్‌.ఎం. వల్ల ఆదాయం రాదా?
వాటివల్ల ఆడియో కంపెనీలకే వస్తుంది. 'ఐపిఆర్‌' అనే దాని ద్వారా 15 శాతం రాయిల్టీ మాత్రమే మాకు వస్తుంది. 
 
తరచూ పేరు మార్చుకుంటున్నారు.. న్యూమరాలజీ ప్రకారమేనా?
కాదు. ఎందుకనో అలా మార్చుకోవాలనిపిస్తుంది. దానికి కారణం చెప్పాలంటే.. నాకు తిక్క వుంది. దాన్ని బట్టే అలా జరుగుతుంది.
 
పవన్‌ కళ్యాణ్‌ను కలిసారా?
(ఒక్కసారిగా నవ్వుతూ..) మీరన్నది అర్థమయింది... నేను ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.
 
మీరు చేసిన వాటిల్లో బెస్ట్‌ ఏది?
నేను బ్యాక్‌గ్రౌండ్‌ ఇవ్వడంలో బెస్ట్‌. గోల్కొండ హైస్కూల్‌, ఊహలు గుసగుసలాడే... వంటి చిత్రాలప్పుడు వాటికి అవార్డు వస్తుందని భావించాను. ఎందుకనో రాలేదు. హోరాహీరోకి బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఇచ్చాను.
 
కొత్త చిత్రాలు?
ప్రస్తుతం నందినిరెడ్డి కళ్యాణ వైభోగమే, అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాను అని చెప్పారు.