శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 20 మార్చి 2015 (17:10 IST)

నేను చచ్చిపోతే ఏం చేస్తావన్నారాయన... ''ఉత్తమ విలన్''పై కమల్ ఇంటర్వ్యూ

'ఉత్తమ విలన్ చిత్రంలో బ్లడీ ఫైట్స్‌ ఏమీ ఉండవు. చాలా కొత్తగా ఉంటుంది. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మనసు లోపల ఫైటింగ్‌ జరుగుతుంది. అంతగా ఆకట్టుకునే చిత్రమిది' అని అన్నారు యూనివర్సల్‌ నటులు కమల్‌ హాసన్‌. ఆయన హీరోగా నటించిన 'ఉత్తమ విలన్‌' చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన కమల్‌ కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
 
బాలచందర్ పాత్ర ఏం చేశారు...? 
మా గురువు గారు కె.బాలచందర్‌ను మొదట సినిమాలో తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన సుముఖత చూపలేదు. 'వద్దు ఈ ముసలాడితో తీయడం కష్టమవుతుంది' అన్నారు. లేదు మీరు కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పాను. ఓ సందర్భంలో 'సినిమా మధ్యలో నేను చనిపోతే ఏం చేస్తావ్‌' అన్నారు. అది మీరు నేర్పించిన విద్యే. మీరు ఉన్నంత వరకు సన్నివేశాలుంచి తర్వాత కథ మారుస్తా' అని చెప్పాను. ఆయన ఏమనుకోకుండా నటించారు. కానీ ఇప్పుడు లేకపోవడం చాలా బాధగా ఉంది. దర్శకుడు రమేష్‌ అయితే బాలచందర్‌ లేకపోతే సినిమా తీయనని అన్నారు. నిజం చెప్పాలంటే బాలచందర్‌ నాకు ఫాదర్‌ లాంటి వారు. నేను మా నాన్న దగ్గర కంటే.. ఆయన దగ్గరే ఎక్కువ రోజులున్నాను. దాదాపు 34 సినిమాలు ఆయనతో చేశాను. 
 
ఏ సినిమాకైనా, ఏ దర్శకుడితోనైనా ఎన్ని రోజులు కాల్షీట్లు అని అనుకుంటాం. కానీ బాలచందర్‌తో చేసినప్పుడు ఎప్పుడూ 'ఎన్ని రోజులు షూటింగ్‌' అని అడగలేదు. అంత ధైర్యం ఎవరూ చేయలేరు. 
 
అగ్రదర్శకులతో నటింపజేశారు... ఎలా చేశారు...? 
ఇందులో కె బాలచందర్‌, కె.విశ్వనాథ్‌ వంటి అగ్రదర్శకులు నటించారు. చాలా మంది పెద్ద దర్శకులు నటించేటప్పుడు వారిని డీల్‌ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ వారుంటేనే చాలా ఈజీ. దర్శకుడికి సగం పని తగ్గిపోతుంది. ఏ సందర్భంలో ఎలా నటించాలో వారికి తెలుసు. అయితే ఈ చిత్రానికి చెప్పాలి వస్తే.. వారు ముందు నేను హీరోగా, రమేష్‌ అరవింద్‌ దర్శకుడుగా నటించామనే చెప్పాలి. యూనిట్‌ అందరిలో చాలా అనుబంధం ఉంది. 

 
ట్రైలర్ చూస్తే సీరియస్ అనిపిస్తోంది.. 
ట్రైలర్‌ చూస్తే సినిమా అంతా సీరియస్‌గా సాగుతుందనే భావన కల్గుతుంది. కాని నా గత సినిమాలు చాలావరకు డిఫరెంట్‌ కామెడీ ఉంటుంది. మరి ఇందులో లేదా అని అడుగుతున్నారు. కానీ ఇందులో అన్ని సినిమాల కంటే ఎక్కువగా కామెడీ ఉంటుంది. కానీ దాని గురించి చెబితే మరోలా అనుకుంటారని కామెడీ గురించి చెప్పడం లేదు. కానీ లోపల కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. 
 
ఈ చిత్రానికి ఇతివృత్తంగా ఎప్పటి కథను తీసుకున్నారు... 
ఈ 'ఉత్తమ విలన్‌' చిత్రంలో నాది రెండు పాత్రలు. ఒక 18వ శతాబ్దానికి చెందినదిగా ఉంటుంది. మరోటి 21 శతాబ్దానికి చెంది ఉంటుంది. ఒకటి కామెడీ, మరోటి ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాకు 'ఉత్తమ విలన్‌' అని పేరు పెట్టడానికి కారణం కథ. కథానుగుణంగా ఆ టైటిల్‌ సెట్‌ అవుతుంది. 
 
డాన్స్‌ ప్రధానంగా ఈ కథ చేశారని అంటున్నారు...  
నేను ఇప్పటి వరకు చాలా రకాల డాన్స్‌ చేశాను. కొత్తగా ఏదైనా చేయాలని కేరళకు చెందిన ఒక ప్రత్యేకమైన డాన్స్‌ మీద ఓ పాత్ర ఉంటుంది. అది చాలా ఏమోషనల్‌గా సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా నేర్చుకోవడానికి చాలా ఉంది. నేను ప్రతి రోజు ఏదో రూపంలో నేర్చుకుంటూనే ఉంటాను.  ఏ సినిమా ద్వారా అయినా ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చు. సినిమాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని చెప్పారు కమల్.