శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2014 (14:03 IST)

తలుపులమ్మ కూడా స్ఫూర్తే... అక్కడకు వెళితే తిరిగిరారు.. కార్తికేయ డైరెక్టర్ చందు

తొలి సినిమా మధ్యలోనే ఆగిపోయినా మలి సినిమా 'యువత'తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు చందు. పుట్టింది గోదావరి జిల్లా కొవ్వూరులో అయితే ఓనామలు తిద్దుకుంది చెన్నైలో. అక్కడే సినిమా రంగానికి బీజం పడింది. అక్కినేని నాగార్జునకు అభిమానిగా మారిన ఆయన దర్శకుడిగా ఎవరి దగ్గరా చేయకపోయినా పలు చిత్రాలకు సంభాషణలు, దర్శకత్వ పరిశీలన నిర్వహించారు. అదే 'కార్తికేయ' చిత్రానికి దర్శకత్వం వహించేలా చేసిందంటున్న చందు చెబుతున్న సంగతులు.
 
'కార్తికేయ' విడుదల తర్వాత మీకు వచ్చిన స్పందన ఏమిటి? 
కమర్షియల్‌గా బాగుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌లోనూ ఆదరిస్తున్నారు. హైదరాబాద్‌లో పెద్ద థియేటరైన దేవిలో ఇప్పటికీ హౌస్‌ఫుల్‌తో ప్రదర్శించబడుతుంది.
 
దీనికి కారణం ఏమనుకుంటున్నారు? 
తీసుకున్న పాయింట్‌ను ఎస్టాబ్లిష్‌ చేయడం కుదిరింది. అటు కుటుంబ కథా చిత్రాలు చూసేవారికి ఇటు సస్పెన్స్‌, కామెడీ ఇష్టపడేవారికి నచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
 
మీ నేపథ్యం గురించి? 
గోదావరిలోని కొవ్వూరు స్వంత ఊరు. చెన్నైలోనే ఇంజనీరింగ్‌ చేశాను. అక్కడ ఉన్నప్పుడు నాగార్జున చిత్రాలు చూసి అభిమానిగా మారాను. 2006లో నా సినిమా కెరీర్‌ ప్రారంభమైంది. నేను, 'స్వామిరారా' దర్శకుడు సుధీర్‌ వర్మ, నిఖిల్‌ కలిసి ఓ సినిమా ఆరంభించాం. అనుకోని కారణాల వల్ల 40 శాతంతో ఆగిపోయింది. ఆ తర్వాత 'యువత' చిత్రానికి పనిచేశాను. 'కళావర్‌ కింగ్‌' వంటి కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడిగా ఎవరి దగ్గర శిష్యరికం చేయకపోయినా పరిశీలించేవాడిని. తొలిసినిమా 'కార్తికేయ'.
 
తమిళంలో కూడా చేయడానికి కారణం? 
మొదట తెలుగు అనుకున్నాం. స్వాతి, తులసి, జె.పి., కిషోర్‌ వంటి నటులు తమిళులకు పరిచితులే. ఇందులో గుడి ఎపిసోడ్‌ను కుంభమేళాలో చేశాం. అందుకే కథను చెన్నై, ఆంధ్ర బోర్డర్‌ అని చెప్పాం. నవంబర్‌ 21న తమిళంలో విడుదల చేయబోతున్నాం.
 
పామును హిప్నటైజ్‌ చేయడమే అంశం ఎలా తట్టింది? 
పాము పగబట్టే కథ ఇది. నాకు తెలిసి పగ పట్టదు. అందుకే అటు సైంటిఫిక్‌గానూ, ఇటు నమ్మకంగాను వుండేలా హిప్నటైజ్‌ అనే కాన్సెప్ట్‌ను చెప్పాం.
 
నిఖిల్‌ను తీసుకోవడానికి కారణం? 
'స్వామిరారా' చేస్తున్నప్పుడు నిఖిల్‌తో కథ అనుకున్నాం. అప్పటికి నిర్మాత విజయకుమార్‌కు చెప్పాం. సెట్‌పైకి రావడం కొంత టైమ్‌ పట్టింది.
 
ట్రైలర్స్‌లోనే కథంతా చెప్పేశారు. దానివల్ల ఇబ్బంది అనిపించలేదా? 
థియేటర్‌కు ప్రేక్షకుల్ని రప్పించాలంటే అలా చెప్పాల్సివచ్చింది. ఆ ఇంట్రస్ట్‌తోనే అందరూ వస్తున్నారు.
 
సినిమా చూశాక ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్సాన్స్‌ వచ్చింది? 
చాలామంది ఫోన్‌చేసి అభినందించారు. వివి వినాయక్‌, సుకుమార్‌, అల్లు అర్జున్‌, దిల్‌ రాజు వంటివారు మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి సుప్రియ కాల్‌ చేశారు. కామాక్షి మూవీస్‌ అధినేతలు చందన్‌ రెడ్డి నుంచి కూడా అభినందలు వచ్చాయి.
 
నాగార్జునను కలిశారా? 
ఆయన ఊళ్లో లేరు. వచ్చాక తప్పకుండా కలుస్తాను. నా వద్ద 4 కథలున్నాయి. అందులో ఒక్కటి నాగార్జునను దృష్టిలో పెట్టుకుని రాశాను. అది ఆయన విన్నాక ఏ విషయమో తెలియజేస్తాను.
 
నిఖిల్‌తో చేయడం ఎలా అనిపించింది? 
నిఖిల్‌ చాలా కంఫర్టబుల్‌ ఆర్టిస్టు. ఎలాగైనా మార్చుకోవచ్చు. దర్శకుల నటుడు ఆయన.
 
చిత్రం ఆలస్యానికి కారణం? 
చాలా కారణాలున్నాయి. దేవాలయం ఎపిసోడ్‌ కొంతవరకు కాకినాడలోని సామర్లకోట దగ్గర భీమేశ్వరాలయంలో తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో రాష్ట్ర విభజన ఉద్యమాలు నడుస్తున్నాయి. దాంతో అక్కడ చేయనీయలేదు. పిమ్మట సెన్సార్‌ యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. దానికి ముందు వారు ఏనిమల్‌ వెల్ఫేర్‌కు పంపారు. 
 
చిత్రీకరణకు ముందే మాకు విజ్ఞప్తి చేయాలని లాజిక్కుతో కొద్దికాలం ఆపారు. కథలో కొంత భాగం పెయింటింగ్‌తో పాములు, ఏనుగులు బొమ్మలు వేశాం. సిజి. వర్క్‌లో కొంత చూపించాం. వాటికి కూడా పర్మిషన్‌ తీసుకోవాలనే నిబంధన తెరపైకి తెచ్చారు. అనంతరం కొన్ని ఆర్థికపరమైన అంశాలు కూడా తోడయ్యాయి. అన్ని కలిసివస్తే ఆగస్టు 1న విడుదల చేయాలనుకున్నాం. ఆ తర్వాత విడుదలైన కొన్ని పెద్ద చిత్రాల వల్ల ఆగాల్సివచ్చింది.
 
నిఖిల్‌ చూస్తూ ఆశీర్వదించే పిచ్చోడి పాత్రలో అర్థమేమిటి? 
వారిని అవధూతలంటారు. మానవాతీత శక్తులు చాలా వుంటాయి. అందుకే ఆ పాత్ర పెట్టాల్సివచ్చింది.
 
'కార్తికేయ' చిత్రకథ యదార్థ సంఘటన నుంచి తీసుకున్నట్లు నిర్మాత చెప్పారు? 
కరెక్టే. పద్మనాభస్వామి దేవాలయం గురించి విన్నప్పుడు నెలలో అక్కడకి వెళ్ళాలనిపించింది. వెళ్ళాక చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. అది కొంతవరకే. దాన్ని పూర్తిగా తెలుసుకోవాలనేది కార్తికేయ సినిమా. 
 
అదికాకుండా విశాఖ దగ్గర 'తలుపులమ్మ' దేవాలయం వుంది. అక్కడ సాయంత్రం ఆరుగంటల తర్వాత ఎవ్వరూ వెళ్ళరు. వెళితే వారు కనిపించరు. ఇప్పటికీ ఇది ఓ రహస్యంగా వుంది. గతంలో చిన్నపాపతో కుటుంబీకులు వెళ్ళి.. కిందికి వచ్చాక ఒకరికొకరు తీసుకువస్తారనుకుని పాపను మర్చిపోయారు. తిరిగి వెళ్ళవద్దని అక్కడి వారు చెబుతున్నా.. అర్థరాత్రి రెండు గంటల తర్వాత పాప మేనమామ వెళ్లారు. కానీ ఆయన కన్పించలేదు. పాప మాత్రమే తెల్లవారిన తర్వాత చూస్తే కన్పించింది. ఈ సంఘటన కూడా స్పూర్తి కల్గించింది.
 
స్వాతి ఎంపిక ఎవరి ఆలోచన? 
నిర్మాతగారి ఆలోచన ఇంతకుముందు ఇద్దరు నటించిన స్వామిరారా పెద్ద హిట్‌కావడం కూడా ఓ కారణం.
 
అల్లు అర్జున్‌ ఛాన్స్‌ ఇచ్చారా? 
ఫోన్‌లో చాలాసేపు మాట్లాడారు. కథ, కథనం బాగా నచ్చాయన్నారు. కథ కుదిరితే తప్పకుండా చేస్తాను అని చెప్పారు.