గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (21:07 IST)

కాజల్‌ కావాలన్నారు. సరే.. తెచ్చుకోండని చెప్పాను... జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ ఇంటర్వ్యూ

మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలతో దర్శకుడిగా ఒక్కసారిగా కీర్తి సంపాదించిన కొరటాల శివ.. అంతకుముందు రచయిత. ఎన్‌టిఆర్‌కు చాలా ఆప్తుడు. బృందావనం.. రచయితగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు జనతా గ్యారేజ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదల

మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలతో దర్శకుడిగా ఒక్కసారిగా కీర్తి సంపాదించిన కొరటాల శివ.. అంతకుముందు రచయిత. ఎన్‌టిఆర్‌కు చాలా ఆప్తుడు. బృందావనం.. రచయితగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు జనతా గ్యారేజ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి, ఇతర విషయలను మాట్లాడారు. ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. మీ కోసం.
 
విడుదల ఒకరోజు ముందుకు రావడానికి కారణం?
సెప్టెంబర్‌ 2న బంద్‌ అని ప్రకటించారు. అందుకే ముందుకు జరిగాం. అయినా అప్పటికే సినిమా రెడీగా వుంది. 
 
బంద్‌ ప్రభావం కలెక్షన్లపై వుంటుంది గదా?
మొదటిరోజు కలెక్షన్లు ఇంపార్టెంట్‌. రెండవరోజు ఒక ఆట ఆడకపోయినా పర్వాలేదు. మిగిలిన ఆటల్లో అవి పూర్తవుతాయి.
 
ఎన్‌టిఆర్‌తో సినిమా ఒత్తిడి అనిపించలేదా?
నాకు ప్రతీదీ మొదటి సినిమాగా వుంటుంది. అలానే కృషిచేస్తా.
 
ఈ సినిమా ఎలా మొదలైంది?
'శ్రీమంతుడు'కు ముందు అనుకున్న కథ ఇది. అప్పట్లో ఎన్‌టిఆర్‌ డేట్స్‌ కుదరలేదు. పైగా ఇందులో ప్రధానమైన మరో పాత్రకు మోహన్‌ లాల్‌ కావాలి. ఆయన డేట్స్‌ కూడా సాధ్యపడలేదు. అక్కడ వరుసగా మూడు సినిమాలు చేసేస్తుంటారు ఆయన. అందుకే ఆలస్యమైంది.
 
కథ రాసుకున్నప్పుడే మోహన్‌లాల్‌ అనుకున్నారా? వేరే ఆఫ్షన్‌ చూశారా?
మొదటి నుంచి కథ రాసుకున్నప్పుడే మోహన్ లాల్‌ అనుకున్నాం. ఒక్కోసారి అలా దొరక్క ఫైనల్‌గా మరో పేరు వస్తుంటుంది. తెలుగులో ఆయన చాలాకాలం అయింది సినిమాలు చేసి. కొంతమంది లీడ్‌ రోల్స్‌ చేసే ఆయన క్యారెక్టర్లు చేయరన్నారు. ఒక్కసారి అడిగి లేదనిపించుకుంటే చాలు అనిపించి నేనే వెళ్ళి ఆయన్ను కలిశాను. ఏదో షూటింగ్‌లో వున్నారు. షాట్‌ గ్యాప్‌లో కథ చెప్పాను. మరలా షాట్‌కు వెళ్ళి వచ్చాక.. నేను చేస్తున్నా.. అని ఒక్కమాట చెప్పారు.
 
మీ సినిమాల్లో సామాజిక అంశాలుంటాయి. ఇందులో కూడా వుందా?
ఏదో పెట్టాలని పెట్టడం జరగదు. సామాజికపరంగా కొన్ని అంశాలు వచ్చేస్తుంటాయి. అది నా బాడీలోనే వుంది. అందుకే అలా వస్తుంటాయి.
 
కమర్షియల్‌ కథల్లో అలాంటివి చేయడం కష్టంకదా?
కమర్షియల్‌ సినిమా అంటే.. హీరో డిఫరెంట్‌గా డిజైన్‌ చేసేసి, ఏవో సాంగ్స్‌ పెడితే సరిపోదు. అందుకే ఇలాంటి ఎలిమెంట్‌ వుండాలని నమ్మేవాడిని.
 
ప్రతి చిత్రంలో ఎవరో కొత్త పాత్రలు సత్యరాజ్‌, నదియ.. వంటి వారిచేత చేయిస్తున్నారు?
కథాపరంగా ఓ పెద్ద పాత్ర వుండాలంటే.. కొత్త ఫేస్‌ కావాలి. అదికూడా తెలిసిన వారైతే బెటర్‌. ఆ పాత్రకు ఇతను అవసరమా లేదా? అనేది కూడా ముందుగానే చర్చించుకుంటాం. ఉంటే బాగుంటుందని సత్యరాజ్‌, జగపతి బాబు, మోహన్‌లాల్‌ వంటి పాత్రలను చిత్రాలకు అనుగుణంగా పెట్టడం జరిగింది. హీరోకే మొత్తం ఫోకస్‌ చేయకుండా మరో పాత్ర వుంటేనే రక్తికడుతుంది.
 
ఎమోషనల్‌గా వుండే ఎన్‌టిఆర్‌ను ఎలా డీల్‌ చేయగలిగారు?
ఆయన క్యారెక్టర్‌ ఎప్పుడూ ఎమోషనల్‌గా వుంటాయి. నా క్యారెక్టర్‌ హైలో వుంటూనే పెర్‌ఫార్మెన్స్‌ అండర్‌ప్లేగా వుంటుంది. కథ అనేది అరుపుల్లో కాదు. అభినయంలో చూపించాలి.
 
పెద్ద స్టార్స్‌ను పెట్టి రెండున్నర గంటల్లో ఎలా చెప్పగలిగారు?
అంతా ఎడిటర్‌ చంటిగారి వల్లే. కథకు ఏది అవసరమో, ఎంత అవసరమో అంత తీసుకున్నారు. సోది వుంటే తీసేశారు.
 
ఎన్‌టిఆర్‌తో మీ జర్నీ ఎమోషన్‌గా సాగిందనే వార్తలొచ్చాయి?
నేను 'బృందానం' చిత్రానికి రచయితగా పనిచేశాను. ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌. మంచి సంబంధాలున్నాయి. అది చెడిపోకుండా వుండాలనే జాగ్రత్తపడతాం. ఆయనకు ఏ కథ అయితే సరిపోతుందని భావించానో అదే రాసుకున్నాను. నా కథకు బెస్ట్‌ ఛాయిస్‌ ఎన్‌టిఆర్‌.
 
సోషల్‌ మీడియాలో వేరేవేరే విన్పించాయి?
మొదటి నుంచి కథ అనుకున్నప్పుడు ఈ పాత్రలకు వీరే కావాలి అనుకున్నాం. ఎన్‌టిఆర్‌తో చేయాలనుకున్నప్పుడు ఆయన 'రభస'లో బిజీగా వున్నారు. అందుకే 'శ్రీమంతుడు' చేశాను. ఈ సినిమా అయ్యాక చేద్దామని అనుకుని చేసిందే ఈ సినిమా. ఇందులో సోషల్‌ మీడియాలో వార్తలు ఎలా వచ్చాయో తెలీదు.
 
మలయాళంలో మార్పులేమైనా చేశారా? 
సేమ్‌ వెర్షన్‌. క్లెమాక్స్‌ కూడా. సేమ్‌. కాకపోతే ఒకటిరెండు మార్పులు వుంటాయి.
 
'మిర్చి' కంటే 'శ్రీమంతుడు' హిట్‌ అయింది. దానికంటే పెద్ద హిట్‌ కావాలనీ, రికార్డ్‌లు తేవాలని ఒత్తిడి వుందా?
సినిమా సినిమాకు పెద్ద కథ రాయాలనుకుంటాను. వారికి ఎలా నచ్చుతుంది. దాన్ని ఎలా తీయగలమనే ఆలోచిస్తాను. సహజంగా సినిమా సినిమాకు పెద్ద హిట్‌ కథ చేస్తా. కానీ దాని ఫలితం, రికార్డ్‌ల గురించి ఆలోచించను. వాటి కోసమే చూసుకుంటే సినిమా పోతుందనే నా నమ్మకం.
 
'జనతా గ్యారేజ్‌' అంటే ఏమిటి.?
రెండు క్యారెక్టర్లతో డిజైన్‌ చేసుకున్న కథ. వారిద్దరి ద్వారా కథ చెప్పాను. భూమి అంటే ఇష్టపడే ఓ వ్యక్తి, భూమి మీద మనుషులంటే ఇష్టపడే మరో మనిషి. ఇద్దరు ఎక్కడ కలిస్తే పాయింట్‌ బాగుంటుందనేది కథ.
 
ఇద్దరూ కలిసి రిపేర్లు చేస్తారా?
అవును. అన్ని రిపేర్లు చేస్తారు.
 
ఫ్యాన్స్‌కు 'సింహాద్రి' స్థాయిలో వుంటుందనుకుంటున్నారా?
ఎన్‌టిఆర్‌కు కెరీర్‌లో వుండగానే అది బిగ్గెస్ట్‌ హిట్‌.. అలా వుండాలనుకోవడంలో తప్పులేదు. నేనే కోరుకుంటున్నా. హీరో కూడా అలానే కోరుకుంటారు. ఫ్యాన్స్‌ కోరుకోవడంలో తప్పులేదు.
 
క్లోజ్‌ ఫ్రెండ్‌గా కలెక్షన్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు?
నేను, ఎన్‌టిఆర్‌ వాటికి ప్రాధాన్యత ఇవ్వం. మీరు(మీడియా) ఇవ్వకపోతే మేం ఇవ్వం. అంతెందుకు నాకు తెలిసిన ఓ ఫ్యామిలీ యుఎస్‌లో వుంది. సినిమా చూశాక బాగుందా? లేదా? అనేది చెప్పాలి. కానీ.. మొదటి రోజు షేర్‌ ఎంత? మొత్తం ఎంత? అనే అడుగుతున్నారు. అలాంటివారి ఒత్తిడే మినహా హీరోలకు అలాంటి టెన్షన్‌ లేదు. నెంబర్లు, షేర్‌లు గొడవలేకపోతేనే మనశ్శాంతిగా వుంటుంది. 
 
ఒక్కో సీజన్‌లో ఒక్కో తరహాలో సాగుతుంది. మొదట్లో వందరోజులు, ఆ తర్వాత ఐదు వారాలు, తర్వాత ఆరు వారాలు, ఇప్పుడు షేర్ల స్థాయికి చేరుకుంది. ముందుముందు మరో దశకు చేరుకుంటుందేమో. ఇదంతా ఓ సైకిల్‌.. నాకు తెలిసి.. హీరోలు.. నా కథేమిటి.. నా బాడీ ఎలా వుండాలి? నా కేశాలంకరణ ఏ మేరకు వుండాలి. అనే ఆలోచన మినహా.. మరో ఆలోచన లేదు. మనమే పెద్ద ఒత్తిడి వారిపై పెడుతున్నాం.
 
ఈ చిత్రం కోసం వర్క్‌షాప్‌ ఏమైనా చెప్పారా?
హీరోతో పాటు ఆరుగురు మెకానిక్‌లకు వర్క్‌షాప్‌ పెట్టాం. ప్రకృతి ప్రేమికుడు ఎలా వుండాలో ఆ లుక్‌ అవసరం అనేలా.. ఇలా కొన్ని వర్క్‌షాప్‌లో చెప్పాం.
 
సోషల్‌ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారే?
సోషల్‌ మీడియా అనేది పెద్ద లెవల్‌కు వెళ్ళింది. ఏ చిన్నపాటి వార్త పెట్టినా క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా చేరిపోతుంది. రాజకీయాలు కూడా అంతే. ప్రధానమంత్రే ట్విట్టర్‌లో ప్రతిదీ పెట్టేస్తున్నారు. అంటే.. అంతకంటే పెద్ద మీడియా లేదనేగా. జనతా గ్యారేజ్‌ సినిమా విడుదల సెప్టెంబర్‌ 1, 2వ తేదీనా? అనే చర్చ జరుగుతుండగా... ఎవరో ట్విట్టర్‌లో సెప్టెంబర్‌ 1 అని పెట్టారు. కాసేపటికి 700 ఫాలోవర్స్‌ వచ్చేశారు. గంట దాటాకా.. గోలగోలగా మారిపోయింది. అంతలా పాకిపోతున్న ఈ మీడియాను మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇంకో మార్గంలేదు. ఒక దశలో న్యూస్‌ పేపర్లు, టీవీలు కూడా సోషల్‌ మీడియానే బేస్‌ చేసుకోవాల్సివస్తుంది.
 
గ్యారేజ్‌ సెట్‌ లీక్‌ అయింది కదా?
చాటుగా వచ్చేసింది. ఎవరో తీసేసి పెట్టేశారు. క్లారిటీ లేదు. అందుకే మనమే వదిలేద్దామని తర్వాత మేమే చేసేశాం.
 
ట్రైలర్‌లో కథంతా చెప్పేశారు? ఏదైనా స్ట్రాటజీనా?
నాకు తెలిసిన ట్రైలర్‌ అంటే కథ చెప్పడం. అంతేకానీ హీరోహీరోయిన్లు బాగుంటారు. డ్రెస్‌ బాగుంటుంది. పాటలు బాగుంటాయి.. అని చెప్పడంకాదు. నా కథ ఇది అని ట్రైలర్‌ ద్వారా చెప్పాలన్నదే చెప్పాను. లేకపోతే ట్రైలర్‌ అవసరం లేదని నా ఫీలింగ్‌. కథ ద్వారా ప్రేక్షకుడ్ని ఇన్‌వాల్వ్‌ చేయడమే ట్రైలర్‌ ఉద్దేశ్యం. 
 
మీ దృష్టిలో 'జనతా' అంటే అర్థం?
జనతా అంటే జనం. పూర్వం జనతా.. అనే పేరులో చిన్న ఫీల్‌ వుండేది. చిన్నతనంలో. జనతా కేఫ్‌, జనతా ఖాదీభండార్‌, జనతా టైలర్‌, జనతా పార్టీ, జనతా థియేటర్‌ ఇలా పేర్లుండేవి. అప్పట్లోనే జనతా గ్యారేజ్‌ వుండిందేమో తెలీదు కానీ.. ఆ పేరు నాకు చాలా ఇష్టం.
 
సాంగ్‌ లీకయిందే?
ఎక్కడో ఎవరో వుంటారు లీక్‌ చేసే వారు. దాన్ని ఆపలేం.
 
పెద్ద హీరోలందరికీ కథలు ఎలా రాయగలుగుతున్నారు?
ఒక్కో హీరోకు ఒక్కో బలం, వీక్‌నెస్‌ వుంటుంది. వారి బలం తెలుసుకుని రాస్తుంటాను. ఎన్‌టిఆర్‌ నటుడని తెలుసు.. ఓవర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, లౌడ్‌గా వుంటాయని తెలుసు. కానీ అంతకంటే మనం ఆయన్ను ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. మనకు ఆయన మాస్‌ హీరో. కానీ ఆయనో స్టైలిష్‌ పర్సన్‌.
 
ముందుగా శ్రుతి హాసన్‌ను అనుకున్నారే?
నేను అనుకోలేదు. బయట అనుకుంటున్నారేమో.. వారు నన్ను అడిగితే చెప్పేవాడిని కదా.
 
డబ్బింగ్‌ విషయంలో మోహన్‌లాల్‌ ఎలా చెప్పారు?
తెలుగు భాష డబ్బింగ్‌ ఈజీ కాదు. విదేశీయులు తెలుగు మాట్లాడలేరు. మలయాళంలో మన హీరో చెప్పలేరు. మోహల్‌ లాల్‌ వాయిస్‌ బాగుంటుందని ఫోర్స్‌ చేశాను. రెండు నెలలు పట్టింది. అయినా ఇబ్బంది పడ్డారు. పల్లెటూరి మనిషి కాబట్టి ఆ యాస వుండాలి. క్యారెక్టర్‌ ప్రాధాన్యతను బట్టి వేరేవారితో చెప్పించమని ఆయనే అన్నారు.
 
'మనమంతా'లో ఆయన వాయిస్‌ సెట్‌ కాలేదన్నారు?
వారికంటే నాది ముందు అయిపోయింది.
 
రచయితగా, దర్శకుడిగా ఎవరు డామినేట్‌ చేస్తారు మీలో?
రచయిత ఇష్టమొచ్చింది రాస్తాడు. దర్శకుడు అందులోంచి కావాల్సింది తీసుకుంటాడు. రచయితగా కూడా నేను ఎంత అవసరమో అంతే రాసేవాడ్ని. అందుకే ఇద్దరి మధ్య క్లాష్‌ వుండదు.
 
స్టార్‌ హీరోలతో దర్శకత్వం కష్టమా?
నా దృష్టిలో చాలా సులువు. వారికి ఏ విధమైన కోరికలుండవు. కథ ఇలా వుంటే చాలని అనుకుంటారు. వేరే అంశాలను టచ్‌ చేయరు.
 
సహజంగా హీరోలు వంశం, బ్లడ్‌, రికార్డులు అంటూ ఏవేవో పెట్టమంటారు కదా?
ఒకప్పుడేమో కానీ.. ఇప్పుడు అస్సలు స్టార్లే చెబుతున్నారు. అలా రాయొద్దు, ఇలా రాయవద్దు అని. నాకు తెలిసి స్టార్‌లు చాలా తక్కువగా మాట్లాడుతారు. అలాంటివారిని హ్యాండిల్‌ చేయడం ఈజీ. ప్రస్తుతం స్టార్‌ ఇలా వున్నారు. గతంలో అలా వున్నారు. భవిష్యత్‌లో అప్పటి పరిస్థితిని బట్టి వుంటారు. ఇదంతా మార్పులో భాగమే.
 
అంటే జనం మారారా? స్టార్స్‌ మారారా?
జనం మారితే స్టార్స్‌ మారతారు.. దర్శకులు మారుతారు. ప్రపంచాన్ని బట్టి మనం మారుతుంటాం. నేను ట్విట్టర్‌ లోకి రాకూడదనుకున్నా. ఎందుకంటే.. ఎవరో ఏదో కామెంట్‌ చేస్తారు. తిడతారు.. ఇలాంటివి మైండ్‌కు అవసరమా? అనిపించేది. కానీ మార్పులో భాగంగా నేనే అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇలా వున్నాం. రేపు ఎలా వుంటామో చెప్పలేం. అంతా ప్రపంచాన్ని బట్టి మారాల్సి వుంటుంది.
 
కాజల్‌ ఐటంసాంగ్‌ చేయడానికి కారణం?
ఆ పదమే బాగోలేదు. ప్రత్యేక గీతం అందాం. ఎవరో డాన్సర్‌ను పెడితే వేరే స్థాయిలో వుంటుంది. కానీ సన్నివేశపరంగా పాటకు హైప్‌ రావాలంటే.. పేరున్న హీరోయిన్‌ కావాలి. వారు చేస్తేనే పండుతుంది. నిర్మాతలు కూడా కాజల్‌ కావాలన్నారు. సరే.. తెచ్చుకోండని చెప్పాను.
 
ఇద్దరు హీరోయిన్లతో ఎవరిది పైచేయి?
ఇద్దరూ గొప్ప నటీమణులు. కథాపరంగా ఇద్దరూ బాగా నటించారు. ప్రాధాన్యత కూడా అంతే వుంటుంది.
 
రామ్‌ చరణ్‌తో చేస్తున్నారా?
రామ్‌ చరణ్‌తో కథ కుదిరితే చేసేస్తాను. నా దగ్గర అందరి హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాశాను. రేపు ప్రభాస్‌ గారికి కథ దొరికితే వెంటనే ఆయనతో చేసేస్తాను.
 
తదుపరి ఎవరితో వుంటుంది?
మహేష్‌ బాబు తోనే.
 
శ్రీమంతుడు సీక్వెలా?
కానే కాదు. అది అయిపోతుంది. రీమేక్‌, సీక్వెల్స్‌ చేయలేం. అవి బాగోవ్‌. బోర్‌ కొడుతుంది. కొత్త ఆలోచనతో కూడిన కొత్త కథతో వుంటుంది. 
 
కథలు ఎలా పుడతాయి?
 
డైలీ లైఫ్‌లోనే పుడతాయి. రూలర్‌ ఇండియాను చూస్తే బోల్డు కథలు పుట్టుకొస్తాయి. అంతా పల్లెలను వదిలి పట్టణం వైపు వచ్చేస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు వుండటంలేదు. ఆసుపత్రులు, స్కూళ్లు, వ్యవసాయం చేసేందుకు పొలాలు లేకుండా రియల్‌ ఎస్టేట్స్‌ అయిపోతున్నాయి. ఇవన్నీ చూశాక.. శ్రీమంతుడు కథ పుట్టుకొచ్చింది. ఇప్పుడు భూమి అనేది గొప్ప అవసరంగా మారింది. దాన్ని నాశనం చేస్తున్నారు. బిజీ లైఫ్‌లో భూమి గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఎప్పుడో తుఫానులు, సునామీలు, హుద్‌హుద్‌ వచ్చినప్పుడే భూమి, పర్యావరణం అంటూ ఆ మూడురోజులు మీడియాలో గోలగోల చేస్తారు. తర్వాత మామూలే. అదే విదేశాల్లో వారికి ఎవేర్‌నెస్‌ ఎక్కువగా వుంటుంది. అది ఈ సినిమాలో చూపించాను. 
 
సినిమాల్లో చెప్పడమేనా పాటిస్తారా?
అమలు చేశాకే చెబుతాను. ఎలా అంటే.. నేను ప్లాస్టిక్‌ వాడను. మొక్కల్ని పెంచుతాను. రోజూ సాయంత్రం నీరు పోస్తుంటాను. మా అపార్ట్‌మెంట్‌లో వీకెండ్‌లో అందరినీ ఇన్‌వాల్వ్‌ చేసి ఇంకుడుగుంట్ల తవ్వించాను. చుట్టుపక్కల చెట్లు పాతాము. ఇలా చేస్తుంటే కొందరైనా రియాక్ట్‌ అవుతారు. సినిమా ద్వారా ఏ కొద్దిమందైనా పాటిస్తారనేది నా నమ్మకం.
 
రచయితగా ఎవరి ప్రభావం మీపై వుంది?
స్వతహాగా కొంత వుంది. ప్రధానంగా కుటుంబ ప్రభావం ఎక్కువగా వుంది. శ్రీశ్రీగారి సాహిత్యం అంటే పిచ్చి. అంతకుముందు ఎన్నో పుస్తకాలు చదివాను. చాలా అందంగా తెలుగు భాష అనిపించింది. కానీ శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాక.. తెలుగులో ఇంత పవర్‌ వుందా? అనిపించింది. మాటల్తో నేరుగా గుండెల్లో గుచ్చవచ్చని తెలిసింది అని చెప్పారు.