మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (21:00 IST)

అనుష్క అంటే ఇష్టం.. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' నటి మెహ్రీన్‌ కౌర్‌ ఇంటర్వ్యూ

''రియల్‌ లైఫ్‌లో ఎవ్వరినీ ప్రేమించలేదు. బాయ్‌ఫ్రెండ్‌ ఎవ్వరూలేరు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాను. నేను ప్రేమించేది కెమెరానే'' అని వర్ధమాన నటి మెహ్రీన్‌ కౌర్‌ అంటోంది. నాని, మెహ్రీన్‌ కౌర్‌ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ మెహ్రీన్‌తో  చిట్‌చాట్‌.
 
మీ నేపధ్యం?
నేను పుట్టింది పంజాబ్‌‌లో. న్యూఢిల్లిలో నా చిన్నతనం, చదువు గడిచింది. ఆ తరువాత కెనడా వెళ్లి డిగ్రీ పూర్తి చేశాను. ఇక బొంబాయికి వచ్చి కమర్షియల్‌ యాడ్స్‌‌లో నటించడం మొదలుపెట్టాను. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, పియర్స్‌ ఇలా చాలా యాడ్స్‌‌లో నటించాను.
 
తెలుగులో అవకాశం ఎలా వచ్చింది?
దర్శకులు హను రాఘవపూడి నన్నొక యాడ్‌లో చూసి నా ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని, ఫోటోలు పంపమని అడిగారు. న్యాచురల్‌గా ఉన్న ఫోటోలను పంపాను. అవి ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత ఆయన్నుంచి పిలుపు వచ్చింది. ఆడిషన్‌ చేసి హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
 
సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?
సినిమాలో నా పాత్ర పేరు మహాలక్ష్మీ. రాయలసీమలోని అనంతపురం ప్రాంతానికి చెందిన అమ్మాయి. కుటుంబానికి మంచి విలువనిస్తుంది. చాలా సరదాగా వుండే అమ్మాయి. చాలా పొగరుగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. కృష్ణ, మహాలక్ష్మీలు పదిహేనేళ్ల నుంచి ప్రేమించుకుంటారు. కృష్ణను పెళ్లి చేసుకోవడమే మహాలక్ష్మీ జీవిత లక్ష్యం.
 
నాని పాత్ర ఎలా వుంటుంది?
కృష్ణ, మహాలక్ష్మి మధ్య జరిగే సంఘటనలే ఈ సినిమా. నిజానికి కృష్ణ చాలా భయస్తుడు. మహాలక్ష్మి ప్రేమను దక్కించుకునే ప్రాసెస్‌‌లో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుంటాడు.
 
సీనియర్‌గా నాని సలహాలు పాటించారా?
నాని చాలా సహజంగా నటిస్తాడు. మంచి మనిషి. తను నటుడు మాత్రమే కాదు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూడా. అన్ని పాత్రల డైలాగ్స్‌ ఆయనకే వచ్చేస్తాయి. ఈ సినిమా ఒప్పుకునే వరకు తను నటించిన సినిమాలు చూడలేదు. ఆ తరువాత 'ఈగ', 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్‌' సినిమాలు చూశాను. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
 
బాలీవుడ్‌లో ట్రై చేయలేదా?
హీరోయిన్‌‌గా ఓ బాలీవుడ్‌ సినిమాతో పరిచయం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి అవకాశం ఎక్కడ లభిస్తే, ఆ భాషలో సినిమా చేయాలనుకున్నాను. ప్రతి ఇండస్ట్రీ చాలా గొప్పది.
 
మీ డ్రీమ్‌ రోల్‌?
కంగనా రనౌత్‌ నటించిన 'క్వీన్‌', కాజోల్‌ నటించిన 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే' వంటి సినిమాల్లో నటించాలనుంది. అవే నా డ్రీమ్‌ రోల్స్‌.
 
నటిగా స్పూర్తి ఎవరు?
అనుష్క శెట్టి అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను చూసి నటించాలనుకున్నాను. తను నటించిన 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సింగం' సినిమాలు చూశాను. లవ్లీ హ్యూమన్‌ బీయింగ్‌. ఇప్పటివరకు తనని కలవలేదు. కలిస్తే మాత్రం పెద్ద అభిమానిని అని చెప్తాను.
 
ఎవరినైనా ప్రేమించారా?
ప్రేమించాను. కెమెరాను మాత్రమే. బాయ్‌ఫ్రెండ్స్‌ లేరు. ఆ అవసరం రాలేదు
 
తదుపరి చిత్రాలు?
తెలుగు, హిందీ భాషల్లో నటించడానికి మాటలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాను అని చెప్పారు.