1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (16:48 IST)

తప్పులు తెలుసుకున్నా.. నటుడిగా గుర్తింపు వచ్చింది : నారా రోహిత్‌

సినీ కెరీర్‌ను ప్రారంభించి ఆరేళ్లు అయినా ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నానని నారా రోహిత్‌ అంటున్నారు. ఇన్నేళ్ళ అనుభవంలో కొన్ని తప్పులు తెలుసుకున్నాననీ.. సీరియస్‌ కథలు కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ కథల్నే తీసుకోవాలనికుంటున్నానని చెబుతున్నాడు. నారా రోహిత్‌తో జరిపిన చిట్ చాట్ వివరాలు...
 
 
* పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా వుందా? 
గత ఏడాది.. పార్టీ శ్రేణుల మధ్య జరుపుకున్నాను. కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను. ఈసారి వారికి దూరంగా వుంటున్నందుకు బాధగా వుంది. షూటింగ్‌ వల్ల విదేశాల్లో ఉంటున్నాను. నేను అక్కడ వున్నా.. నా అభిమానులు రక్తదానం చేస్తుంటారు. 
 
* మీ కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తుంది? 
ఈ ఆరేళ్ళలో.. తక్కువ చిత్రాలు చేశాననే ఫీలింగ్‌ కలిగింది. కథలు కూడా సీరియస్‌వే ఎంచుకుంటారని చాలామంది అన్నారు. అవన్నీ పరిగణలోకి తీసుకుని.. చేసిన తప్పుల్ని సరిద్దుకోవాలనుకుంటున్నాను. సమకాలీన అంశాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకుని కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశాను. అవి పూర్తి ఫలితాలు ఇవ్వకపోయినా నటుడిగా గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. 
 
* ఈసారి ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు? 
నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. మూడు రిలీజ్‌కు సిద్ధంగా వున్నాయి. ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాను. తమిళంలో మురుగదాస్‌ కథ అందించిన చిత్రం 'మాస్‌ కరాటే' భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం నచ్చి రీమేక్‌లో చేయడానికి రెడీ అయ్యాను. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. క్రీడా నేపథ్య చిత్రమిది. బాక్సర్‌గా కన్పిస్తాను. ఇది కెరీర్‌కు మలుపు ఇస్తుందని ఆశిస్తున్నాను. 
 
* శంకర చిత్రం వివరాలేంటి? 
'శంకర' తొలికాపీ సిద్ధమైంది. వచ్చేనెలలో విడుదల చేయాలనుకుంటున్నాం. కార్తికేయ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'పండగలా వచ్చాడు' చిత్రం టాకీ పూర్తయింది. రెండు పాటలు చేయాల్సివుంది. సెప్టెంబర్‌లో విడుదలవుతుంది. ఆ తర్వాత పవన్‌ సాదినేని దర్శకత్వంలో 'సావిత్రి' చిత్రం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సెట్స్‌మీదకు రానుంది. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో చేయబోతున్న 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో 1990 దశకంలో జరిగే కథ. త్వరలో షూటింగ్‌ మొదలవుతుంది. 
 
* మీరే నిర్మాతగా మారడానికి కారణం? 
నేనే నిర్మాతగా మారితే.. నాకు ఫ్లెక్సిబులిటీవుంటుంది. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించినట్లుంటుంది. వారే నన్ను కొత్తగా ప్రెజెంట్‌ చేయగలరు. వారిలో తపన ఉంటుంది. 
 
* సీనియర్స్‌లో తపన వుండదా? 
వారిలో ఇంకా ఎక్కువగా వుంటుంది. అయితే నాకు సరిపడా కథతో ముందుకు వస్తే తప్పకుండా నేను చేస్తాను. ఇక్కడ ఎక్కువగా హిట్‌పైనే కెరీర్‌ ఆధారపడి వుంటుంది. 
 
* త్వరలో పెండ్లి అని గతంలో అన్నారు? 
ఇప్పుడు కూడా అదే అంటున్నాను. ఇంటిలోవారు కుదర్చిన సంబంధమే చేసుకుంటాం. బయట ఎవరినీ ప్రేమించలేదు. అది సినిమావరకే. అని ముగించారు.