శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 22 జూన్ 2016 (22:19 IST)

సమంత, రెజీనాను అనుకున్నాం.. సంధ్యకు నిహారిక 100% కరెక్ట్... దర్శకుడు రామరాజు ఇంటర్వ్యూ

''ప్రేమకథలు చాలా వస్తుంటాయి. అయినా అవే అందరికీ గుర్తుంటాయి. జంట ఎంత బాగుంటే అంత ఆదరణ వుంటుంది. నాకు 'మరోచరిత్ర' ప్రేమకథ బాగా నచ్చిన చిత్రం. అందుకే నేను ప్రేమకథలే తీస్తుంటానని'' దర్శకుడు రామరాజు తెలియజేస్తున్నాడు. 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' వంటి

''ప్రేమకథలు చాలా వస్తుంటాయి. అయినా అవే అందరికీ గుర్తుంటాయి. జంట ఎంత బాగుంటే అంత ఆదరణ వుంటుంది. నాకు 'మరోచరిత్ర' ప్రేమకథ బాగా నచ్చిన చిత్రం. అందుకే నేను ప్రేమకథలే తీస్తుంటానని'' దర్శకుడు రామరాజు తెలియజేస్తున్నాడు. 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' వంటి ఆహ్లాదకరమైన సినిమాను తీసిన ఆయన 'ఒక మనసు' చేశారు. ఈ శుక్రవారమే విడుదల కానున్న ఈ చిత్రంలో నాగశౌర్య, నిహారిక జంటగా నటిస్తున్నారు. నాగబాబు కుమార్తెను హీరోయిన్‌గా అనుకోక ముందు సీనియర్లను ఆ పాత్రకు అనుకున్నారు. కానీ సాధ్యపడలేదని చెబుతున్నారు. టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం గురించి దర్శకుడు రామరాజుతో ఇంటర్వ్యూ.
 
మల్లెలతీరంలో.. పెద్దగా సక్సెస్‌ కాలేదుకదా? ఈ అవకాశం ఎలా వచ్చింది?
ప్రతి సినిమా పురిటినొప్పులు భరించిన తర్వాత వచ్చే బిడ్డలాంటిది. అయితే 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రం మిస్‌ క్యారీ అయ్యింది. దాంతో సినిమాలు మానేద్దామనుకున్నాను. ఒక సంవత్సరం పాటు గ్యాప్‌ తీసుకున్నాను. అయితే చంద్రమౌళి వంటివారు నాకు అండగా నిలబడి సినిమాలు చేయమని ప్రోత్సహించారు. సినిమా అనేది బిజినెస్‌ అని కూడా భావించి ఆలోచించుకుని ఒక మనసు సినిమా చేశాను.
 
లవ్‌ స్టోరీలే తీస్తున్నారే?
నా స్నేహితులు కూడా అదే అడుగుతున్నారు. తెలుగు సినిమా ట్రెండ్‌కు వ్యతిరేకంగా ఓ ప్యూర్‌ లవ్‌స్టోరీ చేయడానికి కారణమేంటని అడుగుతున్నారు. కానీ సినిమా కథ రాసుకునేటప్పుడు, సినిమా చేసేటప్పుడు అలా ఆలోచించలేదు. ఒక మంచి లవ్‌స్టోరీ చేయాలనిపించడంతో ఒక మనసు సినిమా చేయడానికి రెడీ అయ్యాను.
 
మీకు నచ్చిన ప్రేమకథలు?
ముందు నాకు సినిమా అనేది నా డ్రీమ్‌. సినిమా అనగానే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది 'మరోచరిత్ర'. ఎప్పుడైనా అందరికీ ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా గుర్తుంటాయి. అలాంటి ఓ మంచి ప్రేమకథ తీయాలనిపించడంతో ఒక మనసు సినిమా చేశాను.
 
నాగబాబు కుమార్తె అని ఎంపిక చేశారా?
ముందు ఆమె గురించి అనుకోలేదు. నాకు కూడా ఆమె నటి అన్న విషయం తెలియదు. కథను రాసుకున్న తర్వాత నిర్మాతలు కమర్షియల్‌గా భారీస్థాయిలో తీద్దామని అన్నారు. సంధ్య అనే అమ్మాయి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అందుకని ఈ కథను సమంతకు ముందు వినిపించాం. ఆమె చేయడానికి రెడీ అయ్యారు. కానీ జూన్‌ వరకు ఆగాలన్నారు. దాంతో వేరే హీరోయిన్‌తో వెళదామనిపించింది. రెజీనా సహా మరికొంతమందికి ఈ కథను వినిపించాను. అందరూ ఓకే అన్నారు కానీ డేట్స్‌ ప్రాబ్లెం వచ్చింది. 
 
లాభంలేదని.. కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేయాలనికుని హీరోయిన్‌ కోసం అన్వేషణ ప్రారంభించాం. ఓరోజు మధుర శ్రీధర్‌గారు ఫోన్‌ చేసి నిహారిక అయితే ఎలా ఉంటుందని అడిగారు. తను టీవీప్రోగ్రాములు చేస్తుందని తెలుసు. కానీ నేను టీవీ సరిగా చూడను. శ్రీధర్‌గారు చెప్పిన తర్వాత టీవీ చూశాను. అలా చూస్తున్నప్పుడు తనలో నేను రాసుకున్న కథలో సంధ్య పాత్రలోని అమాయకత్వం కనపడింది. దాంతో నేను శ్రీధర్‌గారితో నిహారికతో సినిమా చేద్దామని చెప్పాను.
 
మీ చిత్రాల్లో మూడు కామన్‌గా వుంటాయే?
అవును. నా సినిమాల్లో మల్లెపువ్వు, కాటన్‌ చీర, సముద్రతీరం.. అనే మూడు అంశాలు కామన్‌గా కనపడతాయి. మల్లెపువ్వు అంటే రొమాన్స్‌. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. అలాగే ఎవరైనా చీరలో చూపిస్తే గ్రేస్‌ వేరుగా ఉంటుంది. అందుకనే కాటన్‌ చీర నా సినిమాలో ఉంటుంది. నా కథలకు ప్రత్యేక బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి సముద్రతీరం నా సినిమాలో కనపడుతుంది.
 
నిహారికకు కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
శ్రీధర్‌ గారు ఫోన్‌ చేసి కథ నెరేట్‌ చేయాలని చెప్పగానే నాకెందుకో భయమేస్తుంది సార్‌! అనే మాట అయితే చెప్పాను. ఎందుకంటే తను మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. చిరంజీవిగారికి ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో తెలుసు. ప్రతి అభిమాని సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తాడు. అందుకని కథను నిహారికకు ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్తానని చెప్పాను. అలాగే ప్రతి సీన్‌ను వారితో పాటు నిహారికకు వివరించాను. సీన్‌లో ఎక్కడ ఫిజికల్‌ టచ్‌ వస్తుందో, దాని పరిమితులేంటో చెప్పాను. నేను నెరేట్‌ చేసిన తర్వాత నిహారిక నటించడానికి ఒప్పుకుంది. ఓ రకంగా చెప్పాలంటే నిహారిక సంధ్య పాత్రలో ఒదిగిపోయింది. సెట్స్‌లో కూడా సంధ్య అనే పిలవమనేది. తనెక్కడా నిహారికగా కనపడలేదు.
 
ప్రేమకు మీరిచ్చే నిర్వచనం?
ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రేమ, బంధం ఒకటే. అందుకనే మనమింకా మనుషులుగానే ఉన్నాం. ఒక మనుసు అనేది మనలో, మన చుట్టూ ఉండే పాత్రలను చూస్తూ రాసుకున్న ఓ యదార్థం.
 
హీరోహీరోయిన్లు ఎలా చేశారు?
మరోచరిత్ర సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడికి బాలు, స్వప్న పాత్రలే గుర్తుండిపోతాయి. అందులో ఎవరి పాత్ర గొప్పదంటే ఎలా చెప్పగలం. అలాగే ఈ చిత్రంలో కూడా సూర్య పాత్ర గొప్పదా, సంధ్య పాత్ర గొప్పదా అని చెప్పలేం. రేపు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కథ వినగానే నాగశౌర్య సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సూర్య అనే పాత్రలో ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. ఇలాంటి పాత్రను గొప్పగా చేశాడు.
 
ఇప్పటి ట్రెండ్‌ ఇలాంటి సినిమాలు చూస్తారా?
స్వచ్చమైన ప్రేమకథలు వచ్చి చాలా కాలమైంది. రెగ్యులర్‌ సినిమాలను చేస్తే నేనెందుకనిపించే 'ఒక మనసు' వంటి ప్యూర్‌ లవ్‌ స్టోరీ చేశాను. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌లో తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూస్తారా అనుకోవచ్చు కానీ మనం చేసే ప్రయత్నాన్ని నిజాయితీతో చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు భారతీరాజా, బాలచందర్‌, బాలు మహేంద్ర వంటి దర్శకులు చేసిన చిత్రాలను ఆదరించారు. శంకరాభరణం వంటి చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులే ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు విలక్షణ చిత్రాలను ఆదరించకపోతే తమిళ చిత్రాలకు ఇంత పెద్ద మార్కెట్‌ ఉండదు.
 
తదుపరి చిత్రం.
ఇదే ప్రొడక్షన్‌లో మరో చిత్రం చేయబోతున్నాను అని ముగించారు.