శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 28 జనవరి 2016 (21:01 IST)

సమంతతో చేయాలని ఆరాటంగా ఉంది... రాజ్‌ తరుణ్‌ ఇంటర్వ్యూ

రాజ్ తరుణ్ కోరిక తీరుతుందా...?

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టినా.. ఇంకా తనను పిల్లాడి లెక్కన చూస్తున్నారనీ.. హీరోయిన్‌ కోసం అందరూ కొత్తవారినే వెతుకున్నారనీ.. నాకైతే సమంతతో చేయాలనుందనీ.. ఎందుకంటే.. సమంత వీరాభిమానని కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ అంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై పూర్ణిమ ఎస్‌ బాబు సమర్పణలో ఎస్‌.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్‌ రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రాజ్‌ తరుణ్‌తో ఇంటర్వ్యూ..
 
హీరోయిజం లేని కథలే ఎంచుకోవడానికి కారణం?
నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథలే నేను ఎన్నుకుంటాను. అవే జనాలకు కనెక్ట్‌ అవుతాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నేను హీరోను కాదు. నాతోపాటు ఏడుగురు బేవార్స్‌గాళ్లు వుంటారు. వారిలో నేను ఒకడిని మాత్రమే. ఇదొక చిన్నప్పటి ప్రేమ కథ. ప్రతి సిట్యువేషన్‌ ఫ్రెష్‌‌గా ఉంటుంది. ఆడియన్స్‌ నుండి వచ్చే రియాక్షన్‌ డిఫరెంట్‌‌గా ఉంటుంది. విలేజ్‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే కథ ఇది. నేను హీరోను కాదు.. ఊర్లో ఖాళీగా తిరిగే ఏడెనిమిది మంది బ్యాచ్‌లో నేనొకడిని. సీతమ్మ కోసం ఈ రాముడు ఏం చేసాడనేడే కథ. అదే టైటిల్‌‌గా పెట్టారు. సీతమ్మ అందాల కోసం రాముడు చేసిన సిత్రాల గురించి చెప్పే స్టొరీ. కథ రాసుకున్న తరువాతే డైరెక్టర్‌‌కి ఈ టైటిల్‌ పెట్టే ఆలోచన వచ్చింది.
 
వరుసగా సక్సెస్‌లు ఎలా వుంది?
సక్సెస్‌ వచ్చిందని హ్యాపీ అవ్వను.. ఫెయిల్యూర్‌ వచ్చిందని బాధపడను. నా తప్పొప్పులు తెలుసుకొని మరొక సినిమా కోసం ప్రిపేర్‌ అవుతాను.
 
ఈసారి కూడా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. పోటీ ఎలా వుంటుందని భావిస్తున్నారు?
29న మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. సోలో రిలీజ్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా పోటీకి చిత్రాలు ఉంటాయి. సినిమాలో కంటెంట్‌ ఉంటే అన్ని సినిమాలు హిట్‌ అవుతాయి. దానికి ఉదాహరణ సంక్రాంతికి రిలీజ్‌ అయిన నాలుగు సినిమాలే. 'సోగ్గాడే చిన్ని నాయన' , 'నాన్నకు ప్రేమతో', 'డిక్టేటర్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' ఇలా రిలీజ్‌ అయిన నాలుగు సినిమాలు విజయాన్ని అందించాయి. అలానే రేపు రిలీజ్‌ అవ్వబోయే మా సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్‌ అవుతాయని ఆశిస్తున్నాను.
 
ఎక్కువగా కొత్త దర్శకులతో చేయడానికి కారణం?
కొత్త దర్శకుల్లో ఫైర్‌ ఉంటుంది. వాళ్లకి మొదటి సినిమా అనేది లైఫ్‌ అండ్‌ డెత్‌ క్వశ్చన్‌. మంచి సినిమా చేయాలనే తపన ఉంటుంది.
 
ఏ తరహా హీరోగా వుండాలని కోరిక వుంది?
యాక్షన్‌ హీరోగానో, మాస్‌ హీరోగానో పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్‌ లేదు. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి. 'ఉయ్యాలా జంపాలా' , 'సినిమా చూపిస్తా మావ' , 'కుమారి 21 ఎఫ్‌' ఇలాంటి సినిమాలు తీయడానికి రాజ్‌ తరుణ్‌ లాంటి హీరో ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం చిత్రాల్లో పెద్ద పెద్ద ఫైట్స్‌ ఐటెం సాంగ్స్‌ లేవు. కాని ఆ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. నా దృష్టిలో ప్రేక్షకులకు రీచ్‌ అయ్యే సినిమానే కమర్షియల్‌ సినిమా.
 
సెట్‌లోకి వెళితే ఎలా వుంటారు?
ఒకసారి సినిమా సెట్స్‌ మీదకి వెళితే ప్రపంచాన్ని మరచిపోతా. నా ఫోన్‌ నా దగ్గర ఉండదు. ఫ్రెండ్స్‌‌తో మాట్లాడను. మొదట కథ మీద క్లారిటీ తెచ్చుకుంటాను. డైరెక్టర్‌ ఇమాజినేషన్‌‌కు తగ్గట్లుగా అవుట్‌‌పుట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
 
ఆలస్యంగా వస్తారని విమర్శలున్నాయి?
ఒక్క నిర్మాతను అడగండి.. నా గురించి చెబుతారు. అవన్నీ పుకార్లే.. మొన్న ఓ ఫంక్షన్‌కు నాకు చెప్పిన టైమ్‌ వేరు. మీడియాకు చెప్పిన టైం వేరు. నేను వచ్చేసరికి.. వారు బాయ్‌కాట్‌ చేస్తున్నారని విషయం తెలిసి.. సారీ చెప్పాను.. సినిమాకు అలా జరగదు. ఇంకా ముందుగానే వుంటాను.
 
మీ పక్కన హీరోయిన్లు అంతా కొత్తవారే వస్తున్నారే?
నేనింకా పిల్లాడిలానే కన్పిస్తున్నానట. అందుకే.. గెడ్డం, మీసాలు పెంచాను. అయినా చాలదంటున్నారు. అందుకే కొత్తవారిని ఎంకరేజ్‌ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
 
మీకు అవకాశం వస్తే ఎవర్ని సజెస్ట్ చేస్తారు?
నేను సమంత ఫ్యాన్‌ను. ఆమెతో నటించాలని వుంది. అవకాశం వస్తే తప్పకుండా...
 
కొత్త దర్శకుడు శ్రీను ఎలా వున్నాడు?
ఈ సినిమా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్‌. 'కుమారి 21 ఎఫ్‌' లాంటి అన్‌ కన్వెన్షనల్‌ సినిమా తరువాత నేను ఎలాంటి సినిమాలో నటిస్తే బావుంటుందో.. ఆలోచించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీనివాస్‌‌కు ఎమోషన్స్‌ మీద మంచి పట్టు ఉంది. డైలాగ్స్‌ చాలా బాగా రాసుకుంటాడు. ఈ సినిమాకు కూడా డైలాగ్స్‌‌తో పాటు కథకు తగ్గ ఎమోషన్స్‌ రాసుకున్నాడు. ప్రపంచం ఏం అయిపోయినా.. సరే శ్రీనివాస్‌ అనుకున్నది మాత్రం సాధిస్తాడు.
 
హాలీవుడ్‌ చిత్రాలు చూస్తారా? మీలో ఎవరి ప్రభావం వుంది?
చూస్తాను. కానీ.. వారి ప్రభావం తక్కువే. ఎక్కువగా రవితేజ సినిమాలు చూస్తాను. ఆటోమెటిక్‌గా ఆయన ప్రభావం పడుతుంది. 
 
వేరే హీరోలతో నటిస్తున్నారే?
మంచు విష్ణు, నేను హీరోలుగా ఓ పంజాబీ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాం. దానికి నాగేశ్వరెడ్డి గారు డైరెక్టర్‌. మంచు కాంపౌండ్‌ నుండి సినిమా అన్నారని నేను నటించడానికి ఒప్పుకోలేదు. నాకు కథ నచ్చిందని ఒప్పుకున్నాను. కాని నేను చూసిన డీసెంట్‌ ఫ్యామిలీస్‌‌లో వాళ్లొకరు. విష్ణు నాకు బ్రదర్‌‌లా అయిపోయాడు. సినిమా టైటిల్‌ ఇంకా కన్ఫర్మ్‌ చేయలేదు. ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.
 
విష్ణు బేనర్‌లో చేయడం కష్టమనిపించలేదా?
బయట చెప్పుకున్నంత వ్యతిరేకత లేదు. వారి ట్రీట్‌మెంట్‌ బాగుంది.
 
వర్మతో ఎప్పుడు?
వర్మగారితో చేయాలి. ఓ లైన్‌ చెప్పారు. ఆయన ప్రస్తుతం హిందీలో బిజీగా వున్నారు అని చెప్పారు.