శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2016 (22:17 IST)

పుచ్చకాయల్తోనే నాలుగు రోజులున్నా... ఆ రోజు అక్కడ ఎంజాయ్ చేస్తా: రకుల్‌ ఇంటర్వ్యూ

నాజూగ్గా నడుమును చూపిస్తూ... 'పరేశానురా..' అంటూ గ్లామర్‌ సాంగ్‌తో ''ధృవ'లో అలరించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌... మరోవైపు డైటింగ్‌ విషయంలో తనకంటే శ్రద్ద పెట్టేవారెవ్వరూ లేరని చెబుతోంది. ఖాళీ దొరికితే ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలనే చదువుంటానని చెబుతున్న

నాజూగ్గా నడుమును చూపిస్తూ... 'పరేశానురా..' అంటూ గ్లామర్‌ సాంగ్‌తో ''ధృవ'లో అలరించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌... మరోవైపు డైటింగ్‌ విషయంలో తనకంటే శ్రద్ద పెట్టేవారెవ్వరూ లేరని చెబుతోంది. ఖాళీ దొరికితే ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలనే చదువుంటానని చెబుతున్న ఆమె.. రామ్‌ చరణ్‌తో రెండోసారి నటించింది. ఇలా నటించడం.. అదృష్టంగా భావిస్తున్నాననీ చెబుతోంది. ధృవ చిత్రాన్ని చూశాననీ.. ప్రేక్షకులు తన పాత్రను మెచ్చుకుంటున్నారని అంటున్న ఆమె చెప్పిన విశేషాలు.
 
'ధృవ' మీరనుకున్న సక్సెస్‌ సాధించిందా?
సక్సెస్‌ ఇంత వుందని కొలబద్దతో అనుకోలేదు. బాగా ఆడుతుందని భావించా. థియేటర్లలో బాగానే రెస్పాన్స్‌ వస్తుంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ, సురేందర్‌రెడ్డి దర్శకత్వం, రామ్‌చరణ్‌ పక్కన చేసిన సినిమా ఇది చాలా హ్యాపీగా వుంది.
 
'బ్రూస్‌లీ' ఫెయిల్‌ కదా మరలా నటించమంటే మొదట ఎలా ఫీలయ్యారు?
ఫెయిల్‌, సక్సెస్‌ అనేది కాదు. మనం చేసింది కరెక్టా కదా!  కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు.  జయాపజయాలను నటీనటులు నిర్ణయించలేరు. హిందీలో షారుఖ్‌, కాజోల్‌ హిట్‌ పెయిర్‌ అంటారు. అలాగని వారు చేసిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయా? అలాగే సల్మాన్‌, రాణి చేసిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయా? సినిమా సక్సెస్‌ని నిర్ణయించే పండితులం మేం అయితే ప్రతి సినిమానూ సక్సెస్‌ చేసుకుంటాం. అలాగే సురేందర్‌ రెడ్డితో 'కిక్‌2' చేశా. ఆడలేదు. కానీ మరలా ఈ సినిమాకు అవకాశం ఇచ్చారు.
 
రెండో సినిమా కాబట్టి హీరో, దర్శకుడితో నటించడం ఎలా అనిపించింది?
మామూలుగానే ఈజీగా వుంటుంది. ఒకసారి పనిచేసిన తర్వాత వారి ప్రవర్తన మనకు తెలుస్తుంది. చాలామంది దర్శకులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒకసారి చేసిన తర్వాత వారేం చెప్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. నిర్మాణ సంస్థ దగ్గర నుంచి సురేందర్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ వరకు అందరితోనూ ఇంతకుముందు పనిచేశాను. వాళ్లతో మరలా చేయడం హ్యాపీగా అనిపించింది.
 
' పరేషానురా..' పాట కోసం బాగా డైట్‌ చేశారని దర్శకుడు చెప్పారు?
ఆ పాటకోసం ఏమీ తినకూడదనీ.. కనీసం మంచినీరు కూడా ఎక్కువగా తాగవద్దని చెప్పారు. మనం ఏది తిన్నా, నీళ్లు తాగినా పొట్ట కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండేలా ఈ పాట కోసం జాగ్రత్త తీసుకున్నాను. ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగేదాన్ని కాదు. ఎప్పుడైనా మరీ దాహంగా అనిపిస్తే నోరు తడుపుకునేదాన్ని. నీరసంగా ఉంటే పుచ్చకాయ ముక్కలు ఒకటో, రెండో తినేదాన్ని. అలా నాలుగు రోజులు చేశాను. షూటింగ్‌ పూర్తవగానే 'రకుల్‌కి ఫుడ్‌ పెట్టండి' అంటూ యూనిట్‌ అంతా చాలా కేర్‌ తీసుకునేవారు.
 
తెలుగు వచ్చుగదా డబ్బింగ్‌ చెప్పలేదే?
నేను తెలుగు బాగా నేర్చుకున్నా. తెలుగు అమ్మాయినే. 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి డబ్బింగ్‌ చెప్పా. ఈ సినిమాకు నేను చెబుదామనే అనుకున్నా. దర్శకుడు కూడా చెప్పమనే అన్నారు. కానీ ఆ తర్వాత బిజీగా ఉన్నాను. ఒకరోజు ఒక చోట ఉంటే, ఇంకో రోజు ఇంకెక్కడో ఉండేదాన్ని. నా పరిస్థితిని అర్థం చేసుకున్న అల్లు అరవింద్‌గారు సరేలే అమ్మా! అని అన్నారు.
 
'తని ఒరువన్‌' చూశారా?
ఆ సినిమా విడుదలైనప్పుడే చూశా. ఏ సినిమా అయినా విడుదల కాగానే చూస్తాను.
 
ఏది బాగా నచ్చింది?
అలా ఎలా చెప్పగలం. ఏ సినిమా టేకింగ్‌ దానిదే. రెండూ బాగానే వున్నాయి.
 
డైటింగ్‌ గురించి అందరికీ చెబుతున్నారే?
అందరినీ డైటింగ్‌ చేయమని చెప్పను. ఏం తింటే మంచిదో తెలుసుకుని తినమంటాను. ముఖ్యంగా తిండి విషయంలో ఎక్కువ అవగాహన వుంది. ప్లేట్‌లో ఉన్న ఐటమ్స్‌ని బట్టి అవి ఎన్ని కేలరీలు ఉంటాయో, వాటిలో మనకెన్ని కావాలో చెప్పేయగలను. అందువల్ల ఎక్కువ కేలరీ ఫుడ్‌ తీసుకోను. కేరవాన్‌ లోనూ వున్నా.. ఎప్పుడూ హెల్త్‌ మేగజైన్స్‌ చదువుతుంటాను.
 
ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాక మీరెలా ఫీలవుతున్నారు?
మీకేమైనా మార్పు కన్పిస్తుందా! నేనేం ఓవర్‌నైట్‌ స్టార్‌ని కాలేదు. స్టార్‌ని కావడానికి చాన్నాళ్లే పట్టిందనిపిస్తోంది. దానికి చాలా కష్టపడ్డాను. అయినా నేను షూటింగ్‌ పూర్తయితే రకుల్‌గానే ఉంటాను. సాయంత్రం 6 గంటల తర్వాత సరిగా తల కూడా దువ్వుకోను. కానీ బయటకు వచ్చేటప్పుడు ఓ నటిగా సిద్ధంకాక తప్పదు కాబట్టి రెడీ అవుతుంటాను.
 
మీ సోదరుడు కూడా హీరో అవుతున్నాడే?
నటుడిగా వుండాలనేది అతని కోరిక. తను తెలుగు నేర్చుకుంటున్నాడు. తనపరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఈసారి కొత్త ఏడాది ఎక్కడ జరుపుకుంటున్నారు?
జనవరి 1న గోవాకి ట్రిప్‌ వెళ్తున్నా. గత నాలుగేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేదు. ఈ సారి మాత్రం పాతికమంది కలిసి గోవాలో సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాం.
 
మీ డ్రీమ్‌ రోల్స్‌ వున్నాయా?
పూర్తి స్థాయి రొమాంటిక్‌ చిత్రం చేయాలని ఉంది. మణిరత్నంగారి 'ఓకే బంగారం' తరహా సినిమా అన్నమాట.
 
మీ ఫేవరేట్‌ డైరెక్టర్‌.
రాజమౌళిగారితో సినిమా చేయాలనేది కోరిక. ఆయన నా ఫేవరేట్‌. ఆయన పిలిస్తే అలా వెళ్లిపోతానంతే.
 
కొత్త చిత్రాలు?
మహేశ్‌బాబు చిత్రం, కార్తితో ఓ సినిమా, నాగచైతన్యతో ఓ చిత్రం, సాయిధరమ్‌తేజ్‌ మరో సినిమా అని చెప్పింది.