శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 30 నవంబరు 2015 (20:47 IST)

సరైన హీరోయిన్లు దొరకడంలేదు... హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ

ప్రతినాయకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి కథానాయకుడిగా ఎదిగిన శ్రీకాంత్ ఎంతోమంది యువ కథానాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇగోలకు పోకుండా కథ నచ్చితే అగ్రకథానాయకులు మొదలుకొని యువ కథానాయకులతోనూ కలిసి నటించే వారిలో ముందుంటారు శ్రీకాంత్. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేక వెనుకబడ్డారు. అయితే.. తన తాజా చిత్రం "వీడికి దూకుడెక్కువ" మంచి విజయం సాధించడంతో పాటు కథానాయకుడిగా తనకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాంత్. సత్యం ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ సరసన కామ్నా జెఠ్మలాని కథానాయికగా నటించింది. డిసెంబర్ 4న "వీడికి దూకుడెక్కువ" విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ముచ్చట్లు.
 
ఈమధ్య మీ చిత్రాలు విఫలమవుతున్నాయి...
నాకు సరైన విజయం దక్కట్లేదు అని నేనెప్పుడు బాధపడలేదు. ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు చేయడంలో విఫలమవుతున్నానని నా భావన. ముఖ్యంగా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలకు ఆదరణ తగ్గింది. ఆ కారణంగా మా శైలి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి.
 
వీడికి దూకుడెక్కువ ఎలా ఉంటుంది..?
"వీడికి దూకుడెక్కువ" సినిమా ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంటుంది. మా ప్రొడ్యూసర్ బెల్లం రామకృష్ణారెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని బ్యాంకాక్, మలేసియా దేశాల్లో చాలా అద్భుతంగా తెరకెక్కించారు. నేను ఈమధ్యకాలంలో నటించిన చిత్రాల్లో "వీడికి దూకుడెక్కువ" ది బెస్ట్.
 
మీ సినిమాల స్పీడు తగ్గిందే...
ఇంతకుమునుపు హీరోయిన్లు అందరితో కలిసి నటించేవారు. ఇప్పుడున్న హీరోయిన్లు ఒక గీత గీసుకొని కూర్చుకొన్నారు. మనకున్నది చాలా తక్కువమంది హీరోయిన్లు. కొత్తవాళ్లని పెట్టుకొంటే మార్కెట్ పరంగా ఉపయోగపడడం లేదు. ఈమధ్య కాలంలో సరైన హీరోయిన్ దొరక్క రెండు సబ్జెక్టులను పక్కన పెట్టాల్సి వచ్చింది. వాళ్ల ప్లానింగ్ వేరే అనుకోండి.  
 
వరుస పోలీస్ సబ్జెక్ట్స్‌లో ఎందుకు నటిస్తున్నారు?
ఇదే చాలామంది అడుగుతుంటారు. అయితే నేను అవి కావాలని చేయడం లేదు. నా దగ్గరికి అలాంటి కథలే వస్తున్నాయి (నవ్వుతూ..). చేయను అని మొండిపట్టు పట్టి కూర్చోలేను కదా. అందుకే వచ్చిన సినిమా వదులుకోకూడదు అని చేస్తున్నాను. 
 
మీ కెరీర్ ప్లాన్స్...
ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా సముద్రం మధ్యలో ఈదుతున్నట్లే ఉంది. ఇంకా సాధించాల్సి చాలా ఉంది. చాలా సినిమాలు చేయాలి. ఇప్పటికి 116 సినిమాల్లో నటించాను. మరికొన్ని సినిమాలు సెట్స్‌లో ఉన్నాయి. ఇప్పుడున్న అందరు కథానాయకులతో కలిసి నటించాలి.
 
మీ అబ్బాయి రుద్రమదేవిలో నటించాడు కదా... ఇక వరుస చిత్రాలు చేస్తాడా...?
మా అబ్బాయి "రుద్రమదేవి"లో నటించడంతోపాటు "నిర్మల కాన్వెంట్" అనే మరో చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నాడు. కానీ వాడింకా చిన్నపిల్లోడే. కథానాయకుడిగా పెద్ద స్థాయికి చేరుకొంటాడా? లేదా? అన్నది వాడి అదృష్టం మీద ఆధారపడి ఉంది.
 
వీడికి దూకుడెక్కువ అత్యధిక థియేటర్లలో విడుదలవుతోందనుకుంటా...
నిజానికి "వీడికి దూకుడెక్కువ" చిత్రం ఇంత త్వరగా విడుదలవుతుందని నేను అనుకోలేదు. అసలు థియేటర్లు దొరుకుతాయి అని నేను ఊహించలేదు. అయితే మా ప్రొడ్యూసర్ బెల్లం రామకృష్ణారెడ్డి మంచి ప్లానింగ్‌తో మంచి సంఖ్యలో థియేటర్లు సాధించడంతోపాటు భారీ స్థాయిలో పబ్లిసిటీ కూడా మొదలెట్టారు.
 
మీ చిత్రాలను మీరే ఆపమన్నారని వార్తలు వస్తున్నాయి...
నేను హీరోగా నటించిన చాలా సినిమాలు ఫస్ట్ కాపీ సిద్ధమై విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేనే ఆ సినిమాలను వాయిదా వేయమన్నాను. నిర్మాతలు నష్టపోకూడదు అన్నది నా అభిమతం.
 
త్వరలో విడుదల కాబోయే చిత్రాలేమిటి...?
ప్రస్తుతం హారర్ ఎంటర్ టైనర్స్ మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ఓ హారర్ మూవీ చేస్తున్నాను. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరిలో విడుదల చేద్దామని అనుకొంటున్నాం. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పారు.