1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (22:18 IST)

అదే నాకు అర్థం కాని విషయం... 'శ్రీమంతుడు' మహేష్ ఇంటర్వ్యూ

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ... అభిమానులు, ప్రేక్షకుల కోసం ప్రయోగాత్మక చిత్రాలు చేసే నటుడు మహేష్‌ బాబు. 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్‌ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' వంటి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో మహేష్‌ బాబుతో జరిపిన ఇంటర్వ్యూ.
 
'శ్రీమంతుడు' టైటిల్‌కు వివరణ ఏమిటి?
కొరటాల శివ గారు నాకు మొదటిసారి కథ చెప్పినపుడు వెంటనే ఓకే చేశాను. కథలో బలమైన అంశముంది. కథకు ఈ టైటిల్‌ అయితే సరిపోతుందని శివగారు అనుకొని సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యాక నాకు చెప్పారు. అందరికి నచ్చడంతో శ్రీమంతుడు టైటిల్‌ను ఖరారు చేసారు. సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. పూర్తిస్థాయి వినోదాత్మక మూవీ.
 
ఈ సినిమా స్పూర్తితోనేనా బుర్రిపాలెం ఊరును దత్తత తీసుకున్నారు? 
లేదు. ఈ సినిమా కథను వినకముందే.. నాన్నగారి ఊరుని దత్తత తీసుకున్నాం. ఈ సినిమా విన్నాక.. మరింత నచ్చింది.
 
సహ నిర్మాతగా మారడానికి కారణం? 
మా కుటుంబంలో అందరూ చాలా చిత్రాలకు కో-ప్రొడ్యూసర్స్‌గా చేసారు. ఇప్పటివరకు అక్క, అన్నయ్య పేర్లు మాత్రమే ఆ లిస్టులో వున్నాయి. ఇప్పుడు నా పేరు కూడా వున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
 
మీ బేనర్‌లో ఇతర హీరోలతో సినిమా చేస్తారా? 
నా చిత్రాలకే టైం సరిపోవడంలేదు. ఇంకా బయటి చిత్రాలు ఏమీ అనుకోలేదు.
 
ఈ చిత్రంలో డాన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం? 
ప్రతి సినిమాలో డాన్స్‌ విషయంలో బెస్ట్‌ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ సినిమాలో డాన్స్‌ విషయంలో శివ, రాజు సుందరం నాకు చాలా సహకరించారు. వారి వలనే బాగా వచ్చింది. ముఖ్యంగా చారుశీల సాంగ్‌ చేసినప్పుడు చాలా ఎంజాయ్‌ చేస్తూ చేసాను. మనం వర్క్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేస్తే బెస్ట్‌ రిజల్ట్స్‌ వస్తాయి.
 
గతంలో మీతో ఐటంసాంగ్‌ చేసిన శ్రుతిని హీరోయిన్‌గా పెట్టుకోవడానికి కారణం? 
ఆమె కమల్‌ హాసన్‌ కుమార్తె.. మంచి నటి.. డాన్సర్‌.. మ్యూజిషియన్‌.. మల్టీటాలెంట్‌ పర్సన్‌.. 
 
ఇంతకుముందు చిత్రాల అపజయాలతో ఏం నేర్చుకున్నారు? 
కమర్షియల్‌ చిత్రాలైనా, ప్రయోగాత్మక చిత్రాలైనా మంచి కామెడీ వుండాలని తెలుసుకున్నాను.
 
'ఖలేజా', '1' చిత్రాలు టీవీల్లో బాగా ఆదరణ పొందుతున్నాయి కదా? 
అదే అర్థం కాని విషయం. చాలామంది చెప్పారు. ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపించేట్లుగా వుందనీ. కానీ థియేటర్లలో ఆడలేదు.
 
కొత్త ప్రయోగాలు చేస్తారా? 
ఆల్‌రెడీ 'టక్కరి దొంగ', 'నాని', 'నేనొక్కడినే' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాను. కాని అవి ప్రేక్షులకు రీచ్‌ కాలేదు. దానికి కారణాలు నా పెర్‌ఫార్మెన్స్‌ కాని కథ కాని ఏదైనా కావచ్చు. కథ సరికొత్తగా ఉంటే నేను ఖచ్చితంగా నటిస్తాను కాని నా మిస్టేక్స్‌ రిపీట్‌ అవ్వకుండా చూసుకుంటాను.
 
జగపతిబాబు మీ తండ్రిగా మీరు ఒప్పించారా? 
కథప్రకారం మచి స్టేచర్‌ ఉన్న పర్సన్‌ కావాలి. ఆ పాత్రలో ఆయన సూట్‌ అవుతారని మేమంతా ఫీలయ్యాం. కాని ఒప్పుకుంటారో లేదో అని ఆయనని అడగడానికి భయపడ్డాం. కథ నేరేట్‌ చేయగానే నటించడానికి ఓకే చెప్పారు. హీరో ఫాదర్‌ క్యారెక్టర్‌లో అధ్బుతంగా నటించారు.
 
డైరెక్టర్‌ కొరటాల శివ రచయిత. దర్శకుడిలా ఎలా చేశారు? 
తెలుగు ఇండస్ట్రీలో ఆయనొక మంచి రచయిత. 'శ్రీమంతుడు' కూడా గొప్ప స్క్రిప్ట్‌. ఆయన నాకు ఏ కథనైతే చెప్పారో అంతకంటే బాగా స్క్రీన్‌ మీద చూపించారు. మంచి సత్తా ఉన్న దర్శకుడు.
 
ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్లతో సినిమా చేయడానికి కారణం? 
ఈ చిత్ర నిర్మాతలు ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూటర్లు. అక్కడ నా సినిమాలను రిలీజ్‌ చేస్తుంటారు. వారు ఎప్పటినుండో సినిమాను నిర్మించాలనే కోరికతో ఉన్నారు. ఈ సినిమాను మొదటిసారి ప్రొడ్యూస్‌ చేసినా చాలా అనుభవం ఉన్న వారిలా పని చేసారు. ఎక్కడా కాంప్రమైస్‌ అవ్వకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.
 
ఈ సినిమాకు తమిళంలో మీరే డబ్బింగ్‌ చెప్పారా? 
ఇదొక యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అందరికి రీచ్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో మా కెమెరామెన్‌ ఈ సినిమాను తమిళంలో కూడా రిలీజ్‌ చేద్దామని సజెస్ట్‌ చేసారు. అందుకే రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తున్నాం. నేను తమిళ్ బాగా మాట్లాడగలను. కాని డబ్బింగ్‌ చెప్పడానికి టైం దొరకలేదు. అందుకే చెప్పలేకపోయాను.
 
భజరంగీ బాయ్‌ జాన్‌, పికె తరహా కథల్లో మీరు నటిస్తారా? 
ఆ విషయం మన రచయితల్ని, డైరెక్టర్స్‌ను అడగాల్సిందే. బాలీవుడ్‌లో వచ్చిన ఆ రెండు చిత్రాల కథలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్స్‌ నాకు ఎవరైనా చెప్తే ఖచ్చితంగా నటిస్తాను.
 
జేమ్స్‌‌బాండ్‌ చిత్రాల్లో చూడాలనుందని కృష్ణగారు చెప్పారు? ఎప్పుడు? 
నాన్నగారికి నేనెప్పుడు కొత్త తరహా ఉన్న పాత్రల్లో నటిస్తే చాలా ఇష్టం. ఆయన ఆశించినట్లుగానే జేమ్స్‌‌బాండ్‌ లాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే డెఫినిట్‌‌గా చేస్తాను. 
 
అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని రీమేక్‌ చేస్తారా? 
నాన్నగారు నటించిన అల్లూరి సీతారామరాజు ఓ క్లాసిక్‌ మూవీ. అది నాకు బైబుల్‌ లాంటిది. ఆ చిత్రాన్ని రీమేక్‌ చేసి ఆలోచన లేదు.
 
బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? 
ముందుగా నాకు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే సమయం లేదు. శ్రీమంతుడు చేయడానికి నాకు ఎనిమిది నెలలు పట్టింది. దీని తరువాత వెంటనే 'బ్రహ్మోత్సవం' సినిమా ఉంది. దానికి మరొక ఎనిమిది నెలలు పడుతుంది. దీనికి మధ్యలో నేను గ్యాప్‌ తీసుకొని బాలీవుడ్‌ సినిమాలో నటిస్తే తెలుగులో నా సినిమా రిలీజ్‌ అవ్వడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అక్కడ సినిమాలు చేయాలనుకోవట్లేదు.
 
వినాయక్‌ మీతో సినిమా చేస్తానన్నారు? 
వినాయక్‌, రాజమౌళిలతో కలిసి మాట్లాడుకుంటున్నాం. కథ సిద్ధమయితే తప్పకుండా చేస్తాను.
 
ఇండస్ట్రీలో మీకిష్టమైన స్నేహితులు? 
ఫ్రెండ్‌షిప్‌ డే అనేది పెద్దగా తెలీదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెద్దగా స్నేహితులు లేరు. అంతా మదరాసులోనే. వారితో టచ్‌లో వుంటూ వుంటాను.
 
తమిళ మార్కెట్‌ కోసం ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారా? 
తమిళ మార్కెట్‌ అనికాదు. ఇటీవలే అక్కడకు కొరటాల శివగారు వెళ్ళారు. అక్కడ మీడియా వారు చెప్పిందేమంటే.. మహేష్‌కు ఇక్కడ చాలా ఫ్యాన్స్‌ వున్నారనీ. యూత్‌.. శ్రీమంతుడు సినిమాను తెలుగులో రిలీజ్‌ చేసిన రోజే తమిళంలో చేయమని అడిగారు. అందుకే విడుదల చేస్తున్నాం.
 
యూనివర్సల్‌ కథ అన్నారు హిందీలో కూడా చేయవచ్చుగదా? 
హిందీలో చేయాలని అనుకోలేదు. దానికి తగిన సమయం కూడా లేదు.
 
హీరోగానూ, నిర్మాతగానూ మారారు. మరి దర్శకత్వం చేసే ఆలోచన వుందా? 
(నవ్వుతూ) అంటే.. నన్ను హీరో నుంచి పంపిచేద్దామనేనా. దర్శకత్వం ఆలోచన అస్సలు లేదు.