శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2015 (14:08 IST)

చిరంజీవి 150వ సినిమాకు టీజర్‌ లాంటిది 'బ్రూస్‌లీ' : శ్రీను వైట్ల ఇంటర్వ్యూ

'ఆనందం'తో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీను వైట్ల... సీనియర్‌ దర్శకుడు సాగర్‌ శిష్యుడు. వివి వినాయక్‌తో కలిసి సాగర్‌ దగ్గర పనిచేశారు. కానీ శ్రీను వైట్ల తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నాడు. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌. వెంకీ, దుబాయ్‌ శీను, తర్వాత 'ఢీ' చిత్రం కామెడీలో కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఆ తర్వాత పలువురు దర్శకులతో పాటు ఆయన కూడా ఢీ ఫార్మెట్‌ను కొనసాగించారు. ఒక దశలో మొహమెత్తింది. దీంతో తన ట్రెండ్‌ను మార్చుకున్నానని శ్రీనువైట్ల చెబుతున్నారు. అది 'బ్రూస్‌లీ' చిత్రంలో చూడవచ్చని అంటున్న ఆయన పుట్టిన రోజు ఈ నెల 24. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్‌.
 
బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఏమైనా వున్నాయా?
నేనెప్పుడే అలాంటివి చేసుకోలేదు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ అయితే చేస్తాను కానీ.. దీనికి ప్రత్యేకంగా చేయను. పైగా నేను అయ్యప్ప మాలలో వున్నాను.
 
చిరంజీవి పాత్ర చేస్తున్నారు ఎలా వుంటుంది?
చాలా సర్‌ప్రైజ్‌గా వుంటుంది పాత్ర. రామ్‌ చరణ్‌ ఇందులో ఫైట్‌మాస్టర్‌... ఆ దశలో చిరంజీవి పాత్రకు దానికి లింక్‌ వుంటుంది. అదేమిటో అక్టోబర్‌ 16న చూడాల్సిందే.
 
కథ ప్రారంభించినప్పుడు ఆ పాత్రకు ఇంకెవరిని అనుకున్నారు?
సినిమా కథ చెప్పినప్పుడే అందులో ఓ ప్రత్యేక పాత్ర దగ్గరకు రాగానే.. ఇది నేనేనా! అనేశారు. అంతగా ఆయన కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యారు. ఈ పాత్రకు మరొకరిని అనుకోలేదు.
 
చిరంజీవి 150వ చిత్రం మీదనుకోవచ్చా?
అదేమికాదు. ఆయన 150 సినిమా చేస్తారు. దానికి ఇది చిన్న టీజర్‌ లాంటిది.
 
కోన వెంకట్‌తో గతంలో తేడాలువచ్చాయి. మళ్లీ ఆయనతో కలిసి చేస్తున్నారు?
అవును. గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు చక్కగా కలిసి పనిచేస్తున్నాం. ఆయన మంచి రచయిత. (గతంలో కోన డైలాగ్స్‌ను తన డైలాగ్స్‌గా శ్రీను వైట్ల పేరు వేసుకున్నారు. దాంతో.. కోన.. మీడియా ముందు విమర్శలు గుప్పించారు)
 
బ్రూస్‌లీ టైటిల్‌ పెట్టడానికి కారణం?
హీరో.. ఇందులో ఫైట్‌మాస్టర్‌. తను బ్రూస్‌లీ అంటే వీరాభిమాని. అందుకే టైటిల్‌ అలా పెట్టాం. ఇందులో తనకో ప్రాబ్లమ్‌ వస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోన్నాడనేది ది ఫైటర్‌ అని కాప్షన్‌ పెట్టాం.
 
మీ చిత్రాల్లో కమేడియన్‌ను బఫూన్‌ చేసే కామెడీ వుంటుంది. ఇందులోనూ వుందా?
అలాంటి కామెడీని నేను పరిచయం చేశాను. కానీ దాన్ని చాలామంది వాడుకున్నారు. చూసిచూసి ప్రేక్షకులు బోర్‌ ఫీలయ్యారు. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశాను. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు.
 
బ్రహ్మానందం పాత్ర ఎలా వుంటుంది?
బ్రహ్మానందం పాత్ర సెపరేట్‌గా వుంటుంది. తను ఇందులో కొత్తగా కన్పిస్తారు.
 
క్రుతి కర్బందా పాత్ర ఎలా వుంటుంది?
ఆమె పాత్ర చిన్నదే. చరణ్‌ సోదరిగా నటించింది. 
 
చిరును, రామ్‌చరణ్‌ను ఒకేతెరపై చూపించడం ఎలా ఫీలవుతున్నారు?
చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి రేర్‌ అవకాశం నాకే వచ్చింది.
 
చిత్రం ఎంతవరకు వచ్చింది?
రెండు పాటలు మినహా మొత్తం పూర్తయింది. నా పుట్టినరోజు నాడు టీజర్‌ను, అక్టోబర్‌ 2న ఆడియోను, అక్టోబర్‌ 16న సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పారు.