శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (22:57 IST)

రాజమౌళి జడ్జిమెంట్‌ కరెక్ట్‌గా వుంటుంది: ముళ్ళపూడి వరా

బాపు, రమణలది విడదీయరాని బంధం. అందులో ముళ్ళపూడి కుమారుడు వరా ముళ్ళపూడి. తను దర్శకత్వ శాఖలో కె. రాఘవేంద్రరావు దగ్గర పలు చిత్రాలకూ, సీరియల్స్‌కూ పనిచేశాడు. ఎప్పటినుంచో దర్శకుడు కావాల్సింది.. 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌'తో ఆమద్య ఓ చిత్రం చేశాడు. పర్వాలేదు అనిపించేలా వుంది. పేరూ వచ్చింది. మళ్ళీ కొంతకాలం గ్యాప్‌ తర్వాత తన గురువైన రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'కుందనపు బొమ్మ' తీశారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్‌.
 
దర్శకుడిగా గ్యాప్‌ తీసుకున్నారే?
గ్యాపేమీ లేదు. ఏదో ఒక పనిచేస్తూనే వుంటాను. మా చెల్లెలు, బావగారి కంపెనీ అమెరికాలో ఉంది. వారి కంపెనీ కోసం యాడ్స్‌ చేస్తుంటాను. అలాగే టీవీ సీరియల్‌ ప్రొడక్షన్‌ కంపెనీ ఉంది. 'గోరంత దీపం', 'ముత్యాలముగ్గు' సీరియల్స్‌ చేస్తున్నాం. పనిలేకుండా ఏరోజు లేను.
 
'విశాఖ ఎక్స్‌‌ప్రెస్‌' సక్సెస్‌ను వుపయోగించుకోలేదనిపిస్తుంది?
'విశాఖ ఎక్స్‌‌ప్రెస్‌' 2008లో విడుదలైంది. ఆ తర్వాత ఆఫర్స్‌ వచ్చాయి. రొటీన్‌గా వుండటంతో అవేవీ నచ్చలేదు. నాకు నచ్చకో, వారికి నచ్చకో సినిమాలు టేకాఫ్‌ కాలేదు.
 
కొత్త వారితో తీయడానికి కారణం?
నాకు పెద్ద హీరోలు డేట్స్‌ ఇవ్వరు. ఈ సినిమా కథ ఇమేజ్‌ ఉన్న హీరోలతో చేయకూడదు. కొత్తవాళ్లతోనే వర్కవుట్‌ అవుతుంది. వాళ్లకున్న పరిమితుల్లో, నటీనటుల్లో నాకు తెలిసిన వారితో చేసిన సినిమా. చాలా బాగా వచ్చింది. 
 
'కుందనపు బొమ్మ' పేరుకు కారణం?
కథ హీరోయిన్‌ చుట్టూ కథ తిరుగుతుంటుంది. తెలుగమ్మాయి కోసం చాలా వెతికాం. చాందిని చౌదరి చక్కగా సరిపోయింది. అందుకే 'కుందనపు బొమ్మ' అనే టైటిల్‌ పెట్టాం.
 
చిత్ర నేపథ్యం ఏమిటి?
విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే కథ. విజయనగరం, బొబ్బిలిలో షూటింగ్‌ చేశాం. బొబ్బిలి కోటలో 30 రోజుల పాటు చిత్రీకరణ చేశాం. సుధాకర్‌, సుధీర్‌ క్యారెక్టర్స్‌ రెండు సిటీ నుండి విలేజ్‌కు వచ్చే క్యారెక్టర్స్‌. అయితే సుధాకర్‌ క్యారెక్టర్‌కు కాస్తా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా తనపైనే ఉంటుంది. సుధాకర్‌పై పాటలుండవు. ముందు తను ఆలోచించుకున్నాడు కానీ చివరకు చేయడానికి ఒప్పుకున్నాడు. సినిమా సెట్స్‌లోకి వెళ్లేంత వరకు ముగ్గురు గురించి నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. చాందిని చౌదరి సుచి అనే క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది.
 
కథ రాసుకున్నాకే సెట్‌కు వెళతారా? 
స్క్రిప్ట్‌ మొత్తం పూర్తయ్యాకే సెట్స్‌లోకి వెళదాం అనుకుని అలాగే ప్లాన్‌ చేసుకుని షూట్‌కు వెళ్లాం. కథ రాసుకున్న తర్వాత నాకు ఎగ్జయిట్‌మెంట్‌ ఇచ్చిన సినిమా ఇది. ముందు నాకే ఎగ్జయిట్‌ మెంట్‌ లేకుండా నేనెలా చేస్తాను. 
 
టీవీ సీరియల్స్‌ చేస్తున్నారన్నారు. మరోవైపు యాడ్స్‌ చేస్తున్నారు. ఇటు సినిమానూ.. ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?
టీవీ సీరియల్స్‌ డైరెక్ట్‌ చేస్తుంటాను. అలాగే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను. రెండింటిలో దేని దారి దానిదే. సీరియల్స్‌లో ప్రతి డీటెయిల్డ్‌గా చూపించాలి. సినిమా విషయంలో కాస్తా డ్రెమటిక్‌గా చెప్పాలి. ఈ రెండింటితో పోల్చితే యాడ్స్‌ ఇంకా ఎగ్జయిట్‌మెంట్‌ ఇస్తుంది. ఎందుకంటే ముప్పై సెకండ్స్‌లో మనం అనుకున్నదంతా చెప్పాలి. కాబట్టి వర్క్‌ విషయంలో దేనిదారి దానిదే.
 
కీరవాణితో పనిచేయడం ఎలా వుంది?
కీరవాణిగారితో ఎప్పటి నుండో కలిసి పనిచేయాలనుకున్నాను. అయితే కుదిరేది కాదు. ఈ సినిమాకు ఆయన్న అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారు. స్క్రిప్ట్‌ అడిగారు కానీ నేను ఇవ్వలేకపోయాను. స్క్రిప్ట్‌ చూడకుండా మ్యూజిక్‌ చేసేశారు. ఇప్పటికీ ఆయన స్క్రిప్ట్‌ చూడలేదు. ఆయన సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాపు, రమణగారు 'గోరంతదీపం' కోసం రికార్డ్‌ చేసుకున్న సాంగ్‌ను వాడలేదు. ఆ సాంగ్‌ను బాలుగారు పాడారు. మళ్లీ బాలుగారి పర్మిషన్‌ తీసుకుని ఆ సాంగ్‌ను రీమిక్స్‌ చేసి ఈ సినిమాలో వాడాం.
 
నాన్నగారు ఓ కథను చేయాలనుకున్నారు? అది ఏమయింది?
'శ్రీరామరాజ్యం' చిత్రానికి ముందు బాపు-రమణగారు ఓ కథను అనుకున్నారు. అయితే 'శ్రీరామరాజ్యం' సినిమా రావడంతో దాన్ని పక్కన పెట్టారు. ఆ కథను ఇప్పుడు టేకప్‌ చేశాను. మోడ్రన్‌గా మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఉండే లవ్‌ స్టోరీ. నిత్యామీనన్‌ను దష్టిలో పెట్టుకుని రాస్తున్నాం. తను ఒప్పుకుంటే వెంటనే స్టార్ట్‌ చేస్తాం. పెద్ద బడ్జెట్‌ సినిమాలున్నాయి. అవి కూడా స్క్రిప్ట్‌ సిద్ధం అవుతున్నాయి. ఈ విషయంలో వక్కంతం వంశీ హెల్ప్‌ చేస్తుంటాడు.
 
రాజమౌళితో మంచి సాన్నిహిత్యం వుందికదా.. ఆయన సలహాలు తీసుకుంటారా?
సాధారణంగా నేను కథలను రాజమౌళికి వినిపిస్తుంటాను. తనకు నచ్చకపోతే వద్దు అపేయ్‌ అంటారు. పెద్దగా డీప్‌గా ఆ కథలోకి వెళ్ళరు. ఆ వెంటనే ఆపేస్తాను. ఎందుకంటే తన జడ్జ్‌మెంట్‌ చాలా కరెక్ట్‌గా ఉంటుంది.
 
ఇప్పటి దర్శకుల చాలా స్పీడ్‌గా వున్నారు. ఆ పోటీని ఎలా తట్టుకుంటారు?
రాఘవేంద్రరావు దగ్గర చేసినప్పుడు నేను, రాజమౌళి శిష్యులం. ఆయన సీరియల్స్‌కూ పనిచేశాను. అయితే.. స్పీడ్‌ అనేది ఎవరి ఆలోచలను బట్టి వారిది. ఇప్పటి ట్రెండ్‌ చాలా స్పీడ్‌గానే వున్నారు. ఒక్క హిట్‌ వస్తే.. వెంటవెంటనే ఆఫర్లు వచ్చేస్తుంటాయి. ఎక్కడైనా బ్రేక్‌ పడితే.. మళ్ళీ కొంత గ్యాప్‌ వస్తుంది. ఇదో చట్రం.. ఇక్కడ స్పీడ్‌.. స్లో అని చెప్పలేం. ఎవరి అదృష్టం వారిది అని చెప్పారు.