శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: మంగళవారం, 16 డిశెంబరు 2014 (17:58 IST)

మెగా 'ముకుంద'తో చేయడం ఆనందంగా ఉంది... పూజా హెగ్డే ఇంటర్వ్యూ

మోడల్‌ నుంచి నటిగా మారిన పూజా హెగ్డే తెలుగులో తొలిసారిగా 'ఒక లైలా కోసం' చిత్రంలో నటించింది. తనకు ఆ చిత్రం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చిందని చెబుతోంది. ఆ చిత్రం తర్వాత చేసిన చిత్రం 'ముకుంద'. పెద్ద బేనర్‌లో హీరోతో చేయడం చాలా ఆనందంగా వుందని చెబుతోంది. ఆ చిత్రం ఈ నెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్వూ విశేషాలు..
 
'ఒక లైలాకోసం' సినిమా ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చింది? 
ఆ చిత్రంలో నాగచైతన్యతో నటించిన సన్నివేశాలు బాగా పేరు తెచ్చాయి. నా పెర్‌ఫార్మెన్స్‌ బాగుందనే కామెంట్‌ వచ్చింది. 'ఐ హేట్‌ లవ్‌'అనే కాన్సెప్ట్‌తో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు యూత్‌ను బాగా ఆకర్షించాయి. థియేటర్లలో ప్రేక్షుల స్పందన బాగుంది.
 
'ముకుంద'లో వరుణ్‌తేజ్‌తో చేయడం ఎలా అనిపించింది? 
నటుడిగా.. మెగా కుటుంబాన్నించి వచ్చిన వ్యక్తి. ఆరు అడుగులపైనే వుంటాడు. నటనాపరంగా చాలా  మెచ్యూర్డ్‌గా కన్పించాడు. సెట్లో చాలా సరదాగా వుంటాడు. లంచ్‌, డిన్నర్‌ టైమ్‌లో కలిసి చేసేవాళ్లం. ఎక్కడా ఇగో అనేది కన్పించలేదు.
 
దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం ఎలా అనిపించింది? 
ఆయన చేసిన 'సీతమ్మవాకిట్లో..' సినిమా చూశాను. చాలా విషయాల్లో కేర్‌ తీసుకున్న సన్నివేశాలున్నాయి. ముకుందలో కూడా కాస్ట్యూమ్స్‌లోనూ చిన్న తేడాలొచ్చినా వెంటనే పరిశీలించి సరిచేసేవారు. చాలా విషయాలపై అవగాహన వుంది. కథ చెప్పినప్పుడు దాదాపు గంటసేపు ఆయన చెప్పింది విన్నాను. ప్రతీదీ క్లారిటీగా వుండేది. మ్యూజిక్‌ సెన్స్‌ కూడా చాలా ఎక్కువ. అందుకు ముకుందలోని పాటలే ఉదాహరణ.
 
బాలీవుడ్‌లో పెద్ద సినిమా చేస్తున్నారు? 
అవును. అశుతోష్‌ గోవార్కర్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. 'మొహంజదారో' సినిమా పేరు. ఆయనకు అన్నింటిలో పట్టు వుంది. ఆయన చెప్పినట్లు చేయడమే పెద్ద ఎచీవ్‌.
మొహంజదారో గురించి స్టడీ చేశారా? 
నేనైతే చేయలేదు. అన్నీ స్టడీ చేసిన అశోతోష్‌ వుండటం నాకు ప్లస్‌. కథను మొత్తం చాలా ఓపికగా ఎక్కువ సేపు చెప్పారు. అది విన్నవెంటనే ఎప్పుడు సెట్‌పైకి వెళదామా అనిపించింది. స్కూల్‌ డేస్‌లో చరిత్ర గురించి చదివితే నిద్రవచ్చేది. స్కూల్లో కూడా కాస్త బోర్‌గా ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు దానిపై సినిమా చేయడం, అందులో నటించడం చాలా థ్రిల్‌గా అనిపిస్తుంది.
 
ఈ అవకాశం ఎలా వచ్చింది? 
నేను కొన్ని యాడ్స్‌ చేశాను. అందులో ఒకటి నచ్చి ఆయన భార్య సునీతా గోవార్కర్‌ నా ఫోన్‌ నెంబర్‌ పట్టుకుని ఆడిషన్‌కు రమ్మన్నారు. పాత్రకు తగినట్లుగా వున్నాననీ, అందుకు తగినట్లు తీర్చిదిద్దారు. 
 
ఆ చిత్రం ఎలాంటి తరహా చిత్రమవుతుందనుకుంటున్నారు? 
చారిత్రాత్మక కథతో రూపొందే ఆ చిత్రం 'లగాన్‌'లా అనిపిస్తుంది. అంత రేంజ్‌లో వుంటుందని నమ్ముతున్నాను.
 
ఆ చిత్రం కోసం డేట్స్‌ ఎన్నిరోజులు ఇచ్చారు? 
రోజులు కాదు. నెలలు. దాదాపు 5నెలలు పైగా ఆ చిత్రం షూటింగ్‌లోనే వుంటాను. ఒకలైలా కోసం తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్‌లో ఈ చిత్రం కోసం అన్నీ వదులుకున్నాను. అందులో మణిరత్నం సినిమా కూడా వుంది. చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయనతో అవకాశం రావడం కుదరకపోవడం బాధను కల్గించింది.
 
హృతిక్‌తో లిప్‌కిస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది? 
చారిత్రాత్మక నేపథ్యం గనుక అందులో ఓ సీన్‌పరంగా చేయాల్సి వచ్చింది. అది కథే.. కల్పితం కాదుకదా... సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
 
ఎలాంటి పాత్రలు ఇష్టం? 
నాకు గ్లామరస్‌ రోల్స్‌ అంటే ఇష్టం. నటిగా కథాపరంగా అన్ని పాత్రలు పోషించాలి. దానికీ కొన్ని లిమిట్స్‌ అనేవి ఇంతవరకు పెట్టుకోలేదు. నాకు వచ్చేవన్నీ మంచి పాత్రలే వస్తున్నాయి.
 
మళ్లీ తెలుగు సినిమాలో చేస్తారా? 
మొహంజదారో సినిమా  పూర్తయి రిలీజ్‌ అయ్యేసరికి 2016 సంక్రాంతి అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాకు వచ్చే అవకాశాలపై నేను సినిమాలు చేస్తాను.