శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (09:07 IST)

ఉత్కంఠకే ఉత్కంఠ నేర్పిన ఫైనల్ ఓవర్: ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర.. విలపించిన స్టీవ్ స్మిత్

వాట్ ఎ గేమ్. వాట్ ఎ ఫీల్డింగ్, వాట్ ఎ బౌలింగ్.. ఉత్కంఠకే ఉత్కంఠ కలిగిస్తూ చివరి బంతివరకు దోబూచులాడిన విజయం చివరికి ముంబై ఇండియన్స్‌నే వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ మిచెల్ జాన్సన్ డెత్ బౌలింగ్

వాట్ ఎ గేమ్. వాట్ ఎ ఫీల్డింగ్, వాట్ ఎ బౌలింగ్.. ఉత్కంఠకే ఉత్కంఠ కలిగిస్తూ చివరి బంతివరకు దోబూచులాడిన విజయం చివరికి ముంబై ఇండియన్స్‌నే వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ మిచెల్ జాన్సన్ డెత్ బౌలింగ్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన చివరి ఓవర్లో ఐపీఎల్ చరిత్రలో మహాద్భుతాన్ని సృష్టించాడు. చివరి ఓవర్లో  6 బంతులకు 11 పరుగులు చేయవలసిన సంక్లిష్ట క్షణాల్లో తొలి బంతికి బౌండరీని సమర్పించుకున్న మిచెల్ జాన్సన్ తర్వాతి రెండు బంతుల్లో మనోజ్ తివారీ, స్టీవ్ స్మిత్‌లను ఔట్ చేయడంతో పుణె సూపర్ జెయింట్ గుండె బద్దలయింది. ఇక నాలుగు, అయిదో బంతికి మూడు పరుగులు రావడంతో చివరి బంతికి పుణే గెలుపు సాధించాలంటే నాలుగు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని బలంగా బాదిన క్రిస్టిన్ రెండుపరుగులు సాధించి మూడో పరుగుకు ప్రయత్నంచిన సమయంలో ముంబై ఫీల్డర్ సుచిత్ విసిరిన అద్భుతమైన త్రో పుణెను క్షణకాలంలో టైటిల్‌కు దూరం చేసింది. ముంబై జట్టు విజయానికి మూలకారణం కృనాల్ పాండే అద్భుత బ్యాంటింగ్, చివరి మూడు ఓవర్లలో మలింగా, బూమ్రా, మిచెల్ జాన్సన్ అత్యున్నత  బౌలింగ్ ప్రదర్శనే. ఈ క్రమంలోనే పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్మిత్ అర్ధ సెంచరీ, అజింక్యా రహానే 44 పరుగులు వృధా అయిపోయాయి.
 
ఆదివారం హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయం సాధించింది.  చివరి మ్యాచ్ లో ఆద్యంత ఆకట్టుకున్న ముంబై బౌలర్లు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురైన పుణె పోరాడి ఓటమి చెందింది.  పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(44),స్టీవ్ స్మిత్(51) రాణించినా జట్టుకు విజయతీరాలకు చేర్చలేకపోయారు. ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రోహిత్ సేన తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.  చివర బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుంది. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఈ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ జట్టు గెలుపు అంచులవరకూ వచ్చి చతికిలబడింది. 
 
చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సి ఉండగా జాన్సన్‌ వేసిన తొలిబంతిని మనోజ్‌ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నించిన మనోజ్‌ లాంగ్‌ ఆన్‌ లో పోలార్డ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్‌ క్రీజులో  ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. మూడో బంతికి స్మిత్‌ కూడా భారీ షాట్‌ కు ప్రయత్నించి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ బైరన్‌ తీశాడు. బ్యాటింగ్‌‌కు వచ్చిన క్రిస్టియన్‌ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో​ పరుగు తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్‌ ముంబై సొంతమైంది.
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరచడంతో ముంబైకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్‌కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై మూడంకెల స్కోరుకు చేరగల్గింది.
 
ఈ ఒక్క ఫైనల్ ఐపీఎల్ టోర్నీకి మరో పదేళ్లపాటు ఆయుర్దాయం పోసిందంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే నిరుపమానమైన, అద్వితీయమైన క్రీడా విన్యాసాలకు ఉప్పలో స్టేడియం సాక్షీభూతమై నిలిచింది. చివరి బంతితో విజయం దూరం కావడంతో పెవిలియన్‌లో కూర్చున్న పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్మిత్ విషాదంలో కూరుకుపోయాడు. కళ్లముందు విజయం దూరమవటం చూస్తూ పుణె కెప్టెన్ తట్టుకోలేకపోవడం ప్రేక్షకులను కదిలించింది.