శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (12:23 IST)

ఐపీఎల్‌లో అదరగొట్టిన వార్నర్.. అయినా గెలవలేకపోయిన హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా హైదరాబాగ్ సన్ రైజర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓ దశలో గెలుపు సాధ్యమని అందరూ భావించినా సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు ఆండ్రీ రసెల్. రసెల్ కేవలం 19 బంతుల్లో 49 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ మూడు వికెట్లకు 181 పరుగులు చేయగా, కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి గెలుపును కైవసం చేసుకుంది. ఇక ఓపెనర్ నితీశ్ రాణా 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. రాబిన్ ఊతప్ప 35 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రసెల్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. 4 ఫోర్లు, 6 సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 
 
ఇక ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన సత్తా చాటాడు. బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్టు తేలడంతో ఏడాది నిషేధానికి గురైనా ఆ ఛాయలేమీ కనిపించకుండా, తాజాగా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్ బౌలర్లను ఊచకోత కోశాడు.
 
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో వార్నర్ కేవలం 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ వార్నర్ చలవతో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది.