బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (19:52 IST)

ఐపీఎల్ 2 మ్యాచ్ : ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ - శిఖర్ డకౌట్...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 పదమూడో అంచె పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య అబుదాబిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని, ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, 3.3 ఓవర్లలో రెండు కీలకమైన వికెట్లను కోల్పోయి కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ డకౌట్ రూపంలో వికెట్ల ముందుదొరికిపోగా, పృథ్వీ షా 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 
 
అయితే, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో ప్రధానంగా అందరి దృష్టి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఉండనుంది. రాహుల్ ఫామ్ కొనసాగిస్తే మాత్రం పరుగులు వెల్లువెత్తడం ఖాయం. గ్లెన్ మ్యాక్స్ వెల్, నికోలాస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్‌పైనే భారం ఉంది.
 
ఇకపోతే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత సీజన్ ఊపును ఈసారి కూడా కొనసాగించాలని పట్టుదలతో ఉంది. యువ సారథి శ్రేయాస్ అయ్యర్ స్ఫూర్తిదాయక నాయకత్వంలో 2019 సీజన్‌లో కొన్ని అద్భుత విజయాలు సాధించి గత సీజన్ల పరాజయాలను మరుగున పడేసింది.
 
ఇక ఆ జట్టులో ఆటగాళ్ల విషయానికొస్తే... శిఖర్ ధావన్, పృథ్వీ షా, హెట్మెయర్, అయ్యర్, రిషభ్ పంత్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. మార్కస్ స్టొయినిస్ వంటి ఆల్ రౌండర్ అదనపు బలం.బౌలింగ్ లో ప్రధానంగా కగిసో రబాడా, ఎన్రిచ్ నోర్జే, అశ్విన్ రాణిస్తే ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌కు కష్టాలు తప్పవు. 
 
అయితే 2020 సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు ఉత్సాహంగా ఉన్నాయి. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో పంజాబ్‌ బరిలో దిగుతుంటే, శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది.