సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (09:52 IST)

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనీ - రోహిత్ - కోహ్లీల్లో ఎవరు బెస్ట్!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. నెలన్నర రోజుల పాటు క్రికెట్ సందడిని అందించనున్నాయి. బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఈ పోటీలు నిజానికి స్వదేశంలో నిర్వహించాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పోటీలను యూఏఈకి తరలించారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తున్న భారత స్టార్ ఆటగాళ్ల (కెప్టెన్లలో)లో ఎవరు బెస్టో పరిశీలిద్ధాం.
 
ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ, ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు విరాట్ కోహ్లీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు దినేష్ కార్తీక్, ఢిల్లీ కేపిటల్స్‌కు శ్రేయాన్ అయ్యర్, కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు కేఎల్ రాహుల్‌లు నాయకత్వం వహిస్తున్నారు. కెప్టెన్లుగా వీరి ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే, 
 
ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) 
మిస్టర్ కూల్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్‌జియంట్స్‌కు సారథ్యం వహించాడు. ఇందులో పూణె జట్టు కనుమరుగైంది. ప్రస్తుతం సీఎస్‌కేకు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా ధోనీ 174 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధికం. కెప్టెన్‌గా 104 విజయాలు సాధించాడు. 69 ఓటములు చవిచూశాడు. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ధోనీ విజయాల శాతం 60.11. ఐపీఎల్‌లో మరెవరికీ ఇలాంటి రికార్డు లేదు.
 
విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)  
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్నాడు. భారత జట్టులో అద్భుతంగా ఆడే కోహ్లీ.. ఐపీఎల్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు పాలవుతున్నాడు. బెంగళూరు జట్టుకు 110 మ్యాచుల్లో సారథ్యం వహించిన కోహ్లీ 49 విజయాలు మాత్రమే అందించగలిగాడు. 55 సార్లు జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచులు టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఐపీఎల్‌లో కోహ్లీ విజయాల శాతం 47.16 శాతం మాత్రమే. 
 
రోహిత్‌శర్మ (ముంబై ఇండియన్స్) 
ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌గా పెద్ద రికార్డు లేకపోయినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం రోహిత్ శర్మకు మంచి రికార్డే ఉంది. ఎందుకంటే.. జట్టుకు టైటిళ్లు అందిస్తున్నాడు. మొత్తం నాలుగు టైటిళ్లు సాధించి రికార్డులకెక్కాడు. రోహిత్ కెప్టెన్‌గా 104 మ్యాచ్‌లు ఆడాడు. అతడి సారథ్యంలోని జట్టు60 విజయాలు సాధించింది. 42 మ్యాచుల్లో ఓటమి చవిచూడగా, రెండు టై అయ్యాయి. 
 
దినేశ్ కార్తీక్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 
దినేశ్ కార్తీక్ రెండు జట్లకు సారథ్యం వహించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ కేపిటల్స్), కోల్‌కతా నైట్‌రైడర్స్. ఢిల్లీకి ఆడినప్పుడు అంతగా రాణించలేకపోయాడు. కోల్‌కతా జట్టు తరపున మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాడు. కెప్టెన్‌గా దినేశ్ 36 మ్యాచ్‌లు ఆడాడు. 17 విజయాలు సాధించాడు. 18 మ్యాచుల్లో ఓడిపోయాడు. విజయాల శాతం 48.61. 
 
శ్రేయాస్ అయ్యార్ (ఢిల్లీ కేపిటల్స్)  
2018 సీజన్ మధ్యలో గౌతం గంభీర్ మధ్యలోనే తప్పుకోవడంతో శ్రేయాస్ అయ్యర్‌కు యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా 24 మ్యాచులు ఆడగా 13 విజయాలు సాధించాడు. 10 మ్యాచుల్లో జట్టు ఓడింది. ఒకటి టై అయింది. అతడి విజయాల శాతం 56.25 శాతం. 
 
కేఎల్ రాహుల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) 
కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో తొలిసారి ఐపీఎల్ జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం రాహుల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆటగాడిగా మంచి రికార్డు ఉన్నప్పటికీ.. కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.