శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:41 IST)

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్!

ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఆటాగాళ్ళ వేలం పాటలు గురువారం జరిగాయి. ఈ వేలం పాటల్లో ఒక సంచలనం నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 
 
ఈ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16.25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. 
 
రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో క్రిస్ వేలంపాటలోకి వచ్చాడు. అయితే అతన్ని సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడటంతో... చివరకు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. క్రిస్ మోరిస్ కంటే ముందు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. 
 
ఐపీఎల్ 2020లో కమిన్స్ రూ.15.5 కోట్ల ధర పలికాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మరియు లోయర్ ఆర్డర్ హిట్టర్ అయిన క్రిస్ మోరిస్ ఇప్పటి వరకు 70 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 157.87 స్ట్రైక్ రేట్‌తో 551 పరుగులు చేశాడు. 80 వికెట్లను పడగొట్టాడు.
 
అలాగే, ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ భారీ ధర పలికాడు. మ్యాక్స్ వెల్‌ను రూ.14.25 కోట్ల మొత్తానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. 
 
కాగా, వేలం సందర్భంగా మ్యాక్స్ వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరివరకు ఆర్సీబీతో పోటీపడింది. మ్యాక్స్ వెల్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అక్కడి నుంచి వేలం పోటాపోటీగా సాగింది. చివరికి మ్యాక్స్ వెల్ ఆర్సీబీ సొంతమయ్యాడు.
 
మ్యాక్స్ వెల్ గత ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా విఫలమై, విమర్శల పాలయ్యాడు. అయితే, సొంతగడ్డ ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌తో పాటు, భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. దాంతో మ్యాక్స్ వెల్‌కు మరోసారి డిమాండ్ ఏర్పడింది. 
 
కాగా, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత టెస్టు ఆటగాడు హనుమ విహారిలను కొనుక్కునేందుకు ఏ ఫ్రాంచైజీ సుముఖత వ్యక్తం చేయలేదు. వీళ్లద్దరి కనీస ధర రూ.1 కోటి కాగా, ఎవరూ ఆసక్తి చూపలేదు.
 
ఇక, రాజస్థాన్ రాయల్స్‌కు గత సీజన్‌లో నాయకత్వం వహించిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. స్మిత్ వంటి అగ్రశ్రేణి ఆటగాడు తాజా వేలంలో రూ.2.20 కోట్లకే అమ్ముడయ్యాడు. గత సీజన్‌లో అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాట్స్‌మన్‌గానూ విఫలం కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్మిత్‌ను వదులుకుంది.